నిన్నటి కథ
“మొదట నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నామనే దానికి సమాధానం నీ పుట్టుకతో ముడిపడి ఉంది. నీ జననాన్ని గురించి త్వరలోనే కొన్ని రహస్యాలు నీకు తెలుస్తాయి. వాటితో ఈ లోకానికి విడదీయరాని సంబంధం ఉంది. కాబట్టి నీ అన్వేషణ అక్కడి నుంచే మొదలౌతుంది. ఆ జవాబుకూ, నిన్ను ఈ లోకానికి రప్పించడానికీ, నిన్నే ఈ పనికి ఎన్నుకోడానికీ విడదీయరాని సంబంధం ఉంది,” అంటుంది అరణ్య.
మొత్తానికి అరణ్య అభ్యర్ధన మేరకు “నేను మీ లోకాన్ని కాపాడే ప్రయత్నం తప్పకుండా చేస్తానని మాటిస్తున్నాను.” అంటుంది రక్ష.
“నువ్వు చాలా మంచి దానివి రక్షా!” అన్నారు వాళ్లు. “సరే, ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్లాలి,” అంటూ లేచి నిలబడ్డారు. “సరే,” అని రక్ష కూడా లేచి నిలబడింది. వాళ్లు ఆ ఇంట్లోంచి బయలుదేరారు. తర్వాత ఏమైందో చదవండి.
ఆరో అధ్యాయం
డా.వి.ఆర్.శర్మ
ఇల్లుదాటి బయటకు వచ్చిన తరవాత ఆ ప్రాంతాన్ని మరోసారి చుట్టూ కలయ చూసింది రక్ష.
ఎటుచూసినా ఆకుపచ్చదనం. అదో ఆకుపచ్చ సముద్రం లాగా, ప్రకృతిమాత పుట్టిల్లులాగా కనిపిస్తోంది. ఆకుపచ్చదనంలోని అనేక వర్ణాలలో చెట్లూ, రంగురంగుల పూలపొదలు ఉన్నాయి. అలా చూస్తుంటే పచ్చని సముద్రంలా ఉన్న భూమిపై కెరటాల లాగా కొండలు, పర్వతాలూ, వాటి మీద అరణ్యాలు కనిపిస్తున్నాయి. తన లోకంలో తాను ఎన్నడూ చూడనంత స్వచ్ఛమైన నీలాకాశం. పర్వతాలను చుట్టుకుని కదలకుండా కనిపిస్తున్న పలచటి మేఘాలు. శరీరాలనూ, మనసులనూ ఆత్మీయంగా తాకుతూ పలకరిస్తూ, పరవశింప చేస్తున్న గాలి తెమ్మెరలు, గంధర్వ లోకం నుండి వినిపిస్తున్న సంగీత గమకాల్లా పక్షుల కూతలు. ఎంత అదృష్టవంతులు వీళ్లు అనిపించింది రక్షకు.
రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు, 4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com
వాళ్లు అలా కొంత దూరం నడిచి వెళ్లిన తరవాత ఒక గడ్డి మైదానం వచ్చింది. అక్కడ కొన్ని పశువులు గడ్డి మేస్తున్నాయి. వాటి దగ్గరకు వెళ్లిన తరవాత వాటిని పరీశీలనగా చూసింది రక్ష. అవి, తన లోకంలో చూసిన జంతువుల లాగా లేవని గ్రహించి ఆశ్చర్యపోయింది. అవి రకరకాల ఆకారాలతో, ముఖాలతో, శరీరాలతో కనిపిస్తున్నాయి. కొన్నిటికి సింహాల్లాంటి శరీరాలు, మొసళ్ల వంటి తలలు ఉన్నాయి. ఎద్దుల్లా, ఆవుల్లా కనబడుతున్న వాటికి సన్నటి తొండాలు ఉన్నాయి. ఒంటె లాంటి జంతువులు ఒళ్లంతా దట్టమైన వెంట్రుకలతో ఉన్నాయి. చిన్నచిన్న శరీరాలు ఉన్న జంతువులకు పెద్ద పెద్ద తలలు ఉన్నాయి. పెద్ద శరీరాలు ఉన్న వాటికి చిన్నచిన్న తలలు ఉన్నాయి. కొన్నిటికి మూడు కళ్లు కనబడుతుంటే కొన్నిటికి నాలుగు కళ్లు ఉన్నట్టు కనబడుతున్నాయి. తాను ఆశ్చర్యంతో నిలబడి వాటివైపు చూస్తుంటే, “భయపడకు, అవన్నీ సాధు జంతువులు. వాటికి అపకారం తలపెట్టనంత వరకూ అవి ఏమీ చేయవు,” చెప్పింది అరణ్య.
ఇంతలో, నోటికి రెండు వైపులా తన అరచేతులను పెట్టుకుని ఒక కూతలాంటి శబ్దం చేసింది అవని. వెంటనే దూరంగా గడ్డి మేస్తున్న రెండు గుర్రాలు పరిగెత్తుకుని వచ్చాయి. దగ్గరగా వచ్చి నిలబడ్డ ఆ గుర్రాలను చూసి మరింత ఆశ్చర్యపోయింది రక్ష. ఆ గుర్రాలకు తలల మీద వాడిగా రెండు అడుగుల పొడవు ఉన్న ఒక కొమ్ము కనిపిస్తోంది. వాటికి పెద్ద పెద్ద రెక్కలు ఉండటం అంతకన్నా ఆశ్చర్యం కలిగించింది.
ఇంత సంతోషానుభూతి రక్షకు ఎప్పుడూ కలగలేదు. కొంత సేపటి తరవాత వాళ్లు ప్రయాణిస్తున్న గుర్రాలు మెల్లగా కిందికి వాలాయి.
“పద రక్షా!” అంటూ అరణ్య సునాయాసంగా ఒక గుర్రం మీదికి ఎక్కి కూర్చుని, ఎక్కడానికి రక్షకు చేయి అందించింది. మరో గుర్రం మీద అవని ఎక్కి కూర్చుంది. అరణ్య చేయి పట్టుకుని రక్షకూడా గుర్రం ఎక్కి, అరణ్య వెనక కూర్చుని, వెనక నుంచి అరణ్యను పట్టుకుంది. అలా గుర్రం మీద కూర్చోవడం రక్షకు కొత్తగా, ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. తనకు కొత్తగా అనిపించకపోవటం రక్షకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ గుర్రాలు నేల మీద నాలుగు, అయిదు అడుగులు నడిచి మెల్లగా ఆకాశంలోకి ఎగిరాయి. అది తనకు ఎంతో అలవాటైన ప్రయాణం లాగానే అనిపిస్తోంది.
పైన నీలి సముద్రం లాంటి స్వచ్ఛమైన ఆకాశం. సూర్యుడు బంగారు పువ్వులా విచ్చుకుని ప్రేమతో, తన్మయంతో ఆ ప్రాంతాన్ని చూస్తున్నట్టున్నాడు. కింద చిన్నా, పెద్దా కొండలు, లోయలు, మైదానాలు కళ్లకు వరాలు ప్రసాదిస్తున్నట్టు ఎన్నో రంగులు ప్రసరిస్తున్నాయి. ఇంత సంతోషానుభూతి రక్షకు ఎప్పుడూ కలగలేదు. కొంత సేపటి తరవాత వాళ్లు ప్రయాణిస్తున్న గుర్రాలు మెల్లగా కిందికి వాలాయి. ఒక కొండవాలులో సమతలంగా ఉన్న ప్రాంతంలా ఉంది. ఒక ఆశ్రమంలా కనిపిస్తోంది. చెట్ల నడుమ దూర దూరంగా కొన్ని కుటీరాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రకాల రంగులతో, రూపాలతో పూసిన పూపొదలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతానికి ఉత్తర దిక్కున పర్వతం మీది నుంచి సుమారు వెయ్యి అడుగుల కింద ఉన్న లోయలోకి నవ్వుతూ, తుళ్లుతూ ఒక జలపాతం మనోహరంగా దూకుతోంది. ఈ లోకం అంతా ఒక కవిత లాగా ఎంతో బాగుంది కదా అనుకుంది రక్ష.
ఒకతను పద్మాసనంలో కళ్లు మూసుకుని ధ్యానంలో ప్రశాంతంగా కూర్చుని కనిపించాడు. అతని ముఖంలో వెన్నెల లాంటి స్వచ్ఛమైన, సుందరమైన తేజస్సు. బుద్ధుడు, మహర్షులు ఇలాగే ఉండేవారేమో అనిపించింది రక్షకు.
వాళ్లు గుర్రాలు దిగి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. అక్కడక్కడా ఉన్న కుటీరాల ముందు ఆ లోకానికి చెందిన వాళ్లు కొందరు కనిపిస్తున్నారు. ఆ ప్రాంతం అంతా ఎంతో పరిశుభ్రంగా, స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఆ కుటీరాల మధ్యలోంచి ఉన్న బాటలో నడుస్తూ వెళ్లి, ఏడు కుటీరాలు ఉన్న చోటికి వాళ్లు చేరుకున్నారు. వాటి చుట్టూ ఒక ప్రహరీలా వరసగా, ఎత్తుగా పెరిగిన చెట్లు ఉన్నాయి. వాటి కింది భాగంలో కొన్ని రంగు రంగుల పూల పొదలు ఉన్నాయి. అక్కడికి అడుగుపెడుతూనే ఏదో అనిర్వచనీయమైన భావన. మనసూ, హృదయమూ, శరీరమూ అన్నీ పరిశుభ్రమైనట్టు, తేలికపడుతున్నట్టు హాయిగా, ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా రక్షకు అనిపించింది.
“ఇది మా జ్ఞానశాల, అంటే మా పాఠశాల! విశ్వవిద్యాలయం!! ఇక్కడే మా వాళ్లంతా చదువు నేర్చుకుంటారు. జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి, ప్రకృతి గురించి మేం జ్ఞానం పొందేది ఇక్కడే. ఇదే మా దేవాలయం కూడా,” ఆ చోటును పరిచయం చేసింది అవని. రక్ష కళ్లు విప్పార్చుకుని పరవశంగా ఆ ప్రాంగణాన్ని అంతా చూస్తోంది. ఒక పర్ణశాలలోకి వాళ్లు ప్రవేశించారు. ఆ కుటీరం ముందు ఉన్న ఒక పెద్ద వృక్షం కింద ఒకతను పద్మాసనంలో కళ్లు మూసుకుని ధ్యానంలో ప్రశాంతంగా కూర్చుని కనిపించాడు. అతను సుమారు నలబై ఏళ్ల వ్యక్తిలా ఉన్నాడు. అతని ముఖంలో వెన్నెల లాంటి స్వచ్ఛమైన, సుందరమైన తేజస్సు. బుద్ధుడు, మహర్షులు ఇలాగే ఉండేవారేమో అనిపించింది రక్షకు.
వాళ్లు నిశ్శబ్దంగా వెళ్లి అతని ముందు నిలబడ్డారు. అలా నిలబడ్డ కొంత సేపటికి అతను నెమ్మదిగా కళ్లు తెరిచి, కళ్లతోనే నవ్వుతూ వాళ్లను పలకరించాడు. వాళ్లు చేతులు జోడించి నమస్కరించారు. రక్ష కూడా వాళ్లు చేసినట్టే చేసింది. ఆయన కూడా వాళ్లకు ప్రతి నమస్కారం చేసి, ఆశీర్వదిస్తున్నట్టు చేయి ఎత్తి, “రక్షా! ఎలా ఉన్నావు తల్లీ!” అంటూ చిరునవ్వుతో పలకరించాడు. బాగున్నాను అన్నట్టు రక్ష వినయంగా తల ఊపింది.
ఆయన లేచి నిలబడి తన కుడి చేతిని ముందుకు చాపి, రక్ష తలమీద తన చేతిని ఉంచాడు. అరచేతిని తలపై ఉంచి, బొటన వేలును, చిటికెన వేలునూ ఆమె కణతలకు తగిలేలా ఉంచాడు. రక్షకు హాయిగా ఉంది, నిదానంగా కనురెప్పలు మూసుకున్నాయి. తన కళ్లముందు ఏవో దివ్యకాంతులు వెలుగుతున్నట్టు, ఏవో శక్తులు తనలోకి ప్రవహిస్తున్నట్టు అనుభూతి కలిగింది. అలాగే ఒక అలౌకిక స్థితిలో ఉండిపోయింది.
నేటితో నీకు పద్నాలుగేళ్లు నిండుతున్నాయి. ఇంతకాలం నీలో అంతర్గతంగా ఉన్న ఈ లోకపు ప్రకృతి శక్తులు ఇక నీకు అందివస్తాయి. వాటిని ఈ లోకాన్ని రక్షించడానికి మాత్రమే నువ్వు ఉపయోగించు.
ఆయన మాటలు అద్భుతమైన సంగీత స్వరాల్లా తనకు వినబడుతున్నాయి. “రక్షా, నువ్వు ఈ లోకపు బిడ్డవు. కొన్ని పరిస్థితుల వల్ల మానవ లోకంలో పెరుగుతున్నావు. ఈ రోజు సూర్యుడు మకరరాశిలో ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడు. నేటితో నీకు పద్నాలుగేళ్లు నిండుతున్నాయి. ఇంతకాలం నీలో అంతర్గతంగా ఉన్న ఈ లోకపు ప్రకృతి శక్తులు ఇక నీకు అందివస్తాయి. వాటిని ఈ లోకాన్ని రక్షించడానికి మాత్రమే నువ్వు ఉపయోగించు. నీ తల్లిదండ్రులు చేసిన పొరపాటును నువ్వే సరిదిద్దగలవు. ఆ రకంగా వారి రుణం తీర్చుకోవాలి. వారు చేసిన తప్పు వల్ల ఈ లోకం నాశనం కాకుండా కాపాడవలసిన కర్తవ్యం వారి బిడ్డగా నువ్వు నిర్వహించు. ఇక నువ్వు చేయవలసిన, సాధించవలసిన దానికి సంబంధించిన కొన్ని ఇతర విషయాలు వీళ్లు నీకు చెపుతారు. మరికొన్ని నువ్వు తెలుసుకుంటావు. శుభం కలుగుతుంది,” అని తన చేతిని వెనక్కి తీసుకుని, మళ్లీ, తన ధ్యానంలోకి ఆయన వెళ్లిపోయాడు.
వాళ్లు ఆ విద్యాలయ ప్రాంగణం లోంచి వెనుదిరిగారు. ప్రధాన ద్వారానికి లోపల, కొంత దూరంలో రకరకాల పూలపొదలతో అందంగా కనిపిస్తున్న ఒక చోటు ఉంది. అక్కడ చుట్టూ వెదురు పొదలు, వాటి మధ్య ఒక పూల పందిరి, దాని కింద గుండ్రటి గద్దె కనిపించాయి. “మనం కాసేపు అక్కడ కూర్చుందాం. నీకు మరికొన్ని విషయాలు చెప్పాలి. ఆ తరవాత నువ్వు ఇటు నుంచే మీ లోకానికి వెళ్లి, నీ పని ప్రారంభించవచ్చు,” చెప్పింది అరణ్య.
రక్ష అలాగే అన్నట్టు తల ఊపి వాళ్లతో అటువైపు నడిచింది.
గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి
ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం | మూడో అధ్యాయం | రెండో అధ్యాయం | తొలి అధ్యాయం
మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్