Editorial

Saturday, September 21, 2024
Peopleవీడు 'టీవీ జంధ్యాల' - అన్న ఖదీర్ బాబు అభినందన

వీడు ‘టీవీ జంధ్యాల’ – అన్న ఖదీర్ బాబు అభినందన

ప్రసిద్ద కథకుడు, పాత్రికేయుడు ఖదీర్ బాబుకు అంజద్ స్వయానా సోదరుడు. బుల్లితెర వినోద పరిశ్రమలో ఇప్పటికే తన సత్తా చూపిన తమ్ముడు డిజిటల్ మీడియాలో మరో పెద్ద అడుగు వేస్తున్న సందర్భంగా తన ఆత్మీయ అభినందన, ఆలింగన పరిచయ వాక్యాలు.

మహమ్మద్ ఖదీర్ బాబు

టివి 9లో ‘ఎవడి గోల వాడిదే’ షో సూపర్‌ హిట్‌. ఆదివారం ఆ షో వస్తుంటే పెద్ద పెద్ద పొలిటీషియన్లంతా ఫాలో అయ్యేవారు. వైఎస్‌ఆర్, రోశయ్య, చంద్రబాబు, కెసిఆర్‌… వీరందరి మాస్కులు వేసుకున్న నటులు ఆ వారంలో జరిగిన ఏదైనా ఘటన మీద ఫార్స్‌గా రెస్పాండ్‌గా కావడమే ఈ షో ఉద్దేశం. మాస్క్‌ల వల్ల, వాయిస్‌ మిమిక్రీ చేయడం వల్ల ఆ లీడర్లే యాక్ట్‌ చేస్తున్నట్టు అనిపించి జనం భారీగా ఎంజాయ్‌ చేసేవారు. ఆ ప్రోగ్రామ్‌ను డిజైన్‌ చేసింది వీడు. పేరు అంజద్‌ బాబు.

తెలుగు చానల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ తయారు చేసిన ఫస్ట్‌ జనరేషన్‌ టాలెంట్‌ మొదటి 5 మందిలో వీడు వస్తాడు. ఎం.సి.ఏ చదివి 23 ఏళ్ల వయసులో ‘మా టీవీ’లో చేరి ‘మొగుడ్స్‌–పెళ్లామ్స్‌’ షోలో సీనియర్‌ నటీమణి వాణిశ్రీ గారిని డైరెక్ట్‌ చేశాడు. ఆమె వీడి రిసెప్షన్‌కు హాజరయ్యేంత ఇష్టాన్ని పొందాడు. సుమ కెరీర్‌ స్పీడ్‌ అందుకోవడంలో ఇవాళ ఈ స్థాయి యాంకర్‌గా ఎదగడంలో ఆమెతో వీడు చేసిన లెక్కలేనన్ని కామెడీ షోస్‌ కూడా కారణం. ఉదాహరణకు ‘అవాక్కయ్యారా’. ఆమె చేత ‘ పంచతంత్రం ‘ షోకు ఒకే స్క్రీన్‌ మీద 5 పాత్రలు చేయిస్తూ మూవీ రివ్యూలు చెప్పించాడు. హిట్‌ అయిన క్యారెక్టర్‌ ‘క్రిటిక్‌ రావు’. ఆమెకు వీడి డైరెక్షన్‌లో సినిమా చేయాలని కోరిక.

అన్నదమ్ములు : ఒకరు కాగితంపై మరొకరు బుల్లి తెరపై వెలుగు జిలుగులు

నాకూ వీడికీ ఒకటే కామన్‌ పాయింట్‌. నవ్వించే మనిషికి ఆకర్షితులవుతాం.

టివి 9 అనుబంధ సంస్థ టీవీ1లో కామెడీ షోస్‌ మొదలెట్టి ఇవాళ విస్తృతంగా వస్తున్న కామెడీ షోలకు అంకురార్పణ చేశాడు. నేడు ‘జబర్దస్త్‌’లో కనిపిస్తున్న చాలామంది నటులు వీడి దగ్గర పాఠాలు నేర్చుకున్నవారే. ‘గెటప్‌ శీను’ వీడి డిస్కవరీ. మొన్న బిగ్‌బాస్‌లో కనిపించిన ‘లోబో’ వీడి శిష్యుడే. ఇప్పుడు డైరెక్టర్‌ అయిన కరుణ కుమార్‌ వీడి దగ్గర ఐదారు షార్ట్‌ ఫిల్మ్స్‌కు పని చేశాడు. టివి 9 ప్రారంభించిన ‘సంస్కృతి’ చానల్‌కు వీడే హెడ్‌. ఇవాళ్టి భక్తి చానెల్స్‌ వీడు ఆ చానల్‌తో మోడల్‌ చూపెట్టాడు.

అంజాద్ బాబు, హెడ్ ఆఫ్ ఎంటర్ టెన్ మెంట్ – సుమన్ టివి అధినేతతో…

చేతిలో స్క్రిప్ట్‌ లేకుండా షో చేయడం వీడి స్పెషాలిటీ. ఫాస్ట్‌గా ఎడిసోడ్‌ని ముగిస్తాడని పేరు. స్టార్‌ వాళ్లు మా తీసుకున్నాక మా మ్యూజిక్‌ హెడ్‌గా పని చేశాడు. ఆ సమయంలో హీరో నాగార్జున ‘కథ చెప్పు సినిమా తీద్దువు’ అని వీణ్ణి అడగడం పెద్ద విశేషం. ఆ తర్వాత మిత్రులతో ‘ఆర్‌’ స్టూడియో పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టాడు. ఇప్పుడు సుమన్‌ టివికి ‘హెడ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’గా కూడా పని చేయబోతున్నాడు. నా కథలు వెబ్‌ యాంథాలజీ చేస్తాడట. నా కథలను విజువల్‌ మీడియాలో ఏమైనా చేసుకోగల హక్కుదారుడు వీడే. వీడు రాసిన ‘సుర్మా’ కథ ‘కథామినార్‌’లో ఉంది.

నాకూ వీడికీ ఒకటే కామన్‌ పాయింట్‌. నవ్వించే మనిషికి ఆకర్షితులవుతాం.

అన్నట్టు వీడు నేను రాసిన ‘ముక్కాలు లోనే ఉంది మజా’ కతలో, ‘రాత్రి పూట’ కథలో ఉన్నాడు. ఎందుకంటే మా అన్న పుట్టాక నేను పుట్టాక మా చెల్లెలు పుట్టాక వీడు పుట్టాడు.

బాగా పని చెయ్‌రా. All The Best.

ప్రతీ ఒక్కరికి సలాములు: అంజద్

నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి సలాములు. కృతజ్ఞతలు.

ఎప్పుడూ లేనిది మొదటిసారి నా గురించి రాసిన మా అన్న ఖదీర్ బాబు కు థాంక్స్ ఎలా చెప్పాలి???

18 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు…దేవుడు రెడీ చేసి పెట్టిన బాకప్ ప్లాన్ మా ఖధీరన్న.

నాకు ఊహ తెలిసే సరికే సరస్వతి దేవి ఖధీరన్న రూపంలో మా ఇంట్లోనే తిరుగాడేది. ఇంకు మరకలతో వుండే ఆ చేతి వెళ్లంటే నాకు చాలా ఇష్టం. లేతగా, పొడవుగా పొందికైన గోళ్ళతో ఇంటలెక్టువల్గా ఉంటాయి. బాపు గారు ఎవరో తెలియక ముందే అలాంటి చక్కటి చేతిరాత కలిగిన మా అన్న తెలుసు నాకు. బొమ్మలు కూడా వేసేవాడు (ఇదొక రహస్యం). వయ్యారాలుపోయే ‘క’ , పెద్దమనిషి తరహాలో ‘ఖ’,సున్నాలేని ‘మ’, లారిటైర్ని తలపించే ‘య’ అబ్బురంగా తోచేవి.ఆ చేతిరాతని కాపీ కొట్టేవాడిని.

ఇక ఆయన రాసే వ్యాసాలు, పాటల పై కాలమ్స్, కథలు అందరికంటే ముందే చదివే అవకాశం ఉండేది. క్రియటివిటి గురించి మిడి మిడి జ్ఞానంతో ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుంటాను, నాకు పొగరు అని అనుకుంటారేమో! కాదు, మా అన్న ని చూసిన, చదివిన కళ్ళకు విన్న చెవులకు ఆ డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కాకనే.

ఆయన పెట్టిన దృష్టి భిక్ష వలన ప్రపంచాన్ని చూసే తీరు మారింది. ప్రతీ వస్తువుని, విషయాన్ని పట్టి తూచే కళ అబ్బింది. అన్న కోసమే పుట్టాయా అని అనిపించే చెర్మాస్ షర్ట్స్, బెల్ట్ అక్కరలేని పాంట్స్, రింగు చెప్పులు నేనూ వేసుకు తిరిగేవాడిని. సృజన వాసన కోసం.

18 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు…దేవుడు రెడీ చేసి పెట్టిన బాకప్ ప్లాన్ మా ఖధీరన్న. ఆయన పై అప్పుడప్పుడు అరుస్తా, పిలవడానికి ‘రే భయ్యా’ అని పిలుస్తా కానీ…ఎప్పుడూ నాపై పల్లెత్తు మాట కూడా జారని ప్రేమ మూర్తి మా అన్న నిజానికి నాకు ‘అబ్బా’ సమానం.

కూర నచ్చితే చూడూ… అరచెయ్యంతా అంటేలా అన్నాన్ని కస కస కలుపేసుకుంటాడు. మా ఆవిడ వండే తలకాయ కూరంటే అన్నకు ఇష్టం…నెక్స్ట్ సండే లంచ్ ఫిక్స్.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article