Editorial

Thursday, November 21, 2024
కథనాలుయాంటిగని : దమన ధిక్కార మానవత్వ ప్రకటన- జి. భార్గవ

యాంటిగని : దమన ధిక్కార మానవత్వ ప్రకటన- జి. భార్గవ

వ్యక్తిగత శౌర్యం స్థానంలో నియమబద్ధమైన రాజ్యం సమాజాన్ని నడిపించే ముఖ్య చోదక శక్తిగా అవతరిస్తున్న ఒక సంధి దశను సూచించే నాటకం యాంటిగని. క్రీస్తు పూర్వం 495-406 మధ్యలో జీవించిన సోఫోక్లీస్‌ అనే గ్రీకు నాటక రచయిత రాసిన అతిగొప్ప విషాదాంత నాటకాలలో యాంటిగని ఒకటి.

అనంతు చింతలపల్లి అనువదించిన ఈ నాటకం ‘ప్రేమలేఖ’ ప్రచురణగా నేటినుంచి తెలుగు పాఠకులకు అందుబాటులో వస్తోంది. పుస్తకానికి రాసిన ముందుమాట ‘దమన ధిక్కారం మానవత్వ ప్రకటన’ తెలుపు సందర్భం ఇది.

జి. భార్గవ

క్రీ.పూ.3వ శతాబ్దానికి ప్రాచీన గ్రీకు సామాజిక చరిత్రలో ఒక విశిష్ట స్థానం వుంది. పాత రాచరికాల స్థానంలో ప్రజాస్వామిక నియమాలచే నడిచే నగర-రాజ్యాలు ఆవిర్భవిస్తున్న కాలం అది. ఈ కీలక పరిణామానికి కేంద్రబిందువు ఏథెన్స్‌ నగరం.

ఏ ప్రాంతంలో అయితే చరిత్ర వేగం పుంజుకుని, సామాజిక-రాజకీయ మార్పులు శరపరంపరగా జరగడం ప్రారంభం అవుతుందో ఆ ప్రాంతానికి అత్యంత ప్రతిభావంతులయిన మానవులు చేరుకుంటారు. ఆ నాటి ఏథెన్స్‌ నుండీ ఆధునిక మెట్రోపాలిటిన్‌ నగరాల వరకు ఈ పరిణామాన్ని మనం గమనించవచ్చు. అలా ఏథెన్స్‌ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్ద ఆరంభం నాటికి most happening city గా అవతరించింది.

ఏథెన్స్‌ నగరం ఒక రాజకీయ, సాంస్కృతిక, తాత్విక సంరంభంలోకి ప్రవేశిస్తున్న కొత్త కాలానికి సూచనగా, ఆ కొత్త కాలంలో దాగివున్న కొత్త క్రౌర్యాల, కొత్త విషాదాల, కొత్త ప్రమాదాల గురించిన హెచ్చరికగా మనం యాంటిగని నాటకాన్ని చూడవలసి వుంటుంది.

ప్రాచీన గ్రీకు విషాద నాటకకారుల త్రయంగా పిలుచుకునే ముగ్గురు మహత్తర నాటక రచయితలు ఎస్కలస్‌, సోఫోక్లీస్‌, యూరిపిడిస్‌ ఇదే ఏథెన్స్‌ నగరవాసులే, పైగా వీరంతా సమకాలీనులే. అంతేనా, ప్రాచీన తత్వవేత్తల్లో శిఖరాయమానులయిన సోక్రటీస్‌, ప్లాటో, ఆరిస్టాటిల్‌ – ముగ్గురూ కూడా అదే నగర వాసులే. అదే శతాబ్దానికి, అదే కాలానికి చెందిన వారే కావడం యాదృచ్ఛికం కాదు. ఆ విధంగా ఏథెన్స్‌ నగరం ఒక రాజకీయ, సాంస్కృతిక, తాత్విక సంరంభంలోకి ప్రవేశిస్తున్న కొత్త కాలానికి సూచనగా, ఆ కొత్త కాలంలో దాగివున్న కొత్త క్రౌర్యాల, కొత్త విషాదాల, కొత్త ప్రమాదాల గురించిన హెచ్చరికగా మనం యాంటిగని నాటకాన్ని చూడవలసి వుంటుంది. కళ్ళ ముందే కూలిపోతున్న పాత ప్రపంచం, పాత విలువలు, పాత జీవన విధానం గురించి వేదనతో, నిశ్చేష్టతో, క్రోధంతో, ఆక్రోశంతో చేసిన ఒక nostalgic cry గా యాంటిగని నాటకం మనకు కనిపిస్తుంది.

క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం ప్రాచీన గ్రీసులో వ్యక్తిగత శౌర్యంపై, వారసత్వంపై నిలబడిన రాచరికాలు గతించి ప్రజాస్వామిక నగర రాజ్యాలు అప్పుడప్పుడే ఏర్పడుతున్న సంధి కాలం కూడా. ఏ రాజు ఏ సైన్యంతో ఎప్పుడు దండెత్తి తమ కొత్త నగర-రాజ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూలదోసి తిరిగి నిరంకుశ రాచరికాన్ని స్థాపిస్తాడేమో అన్న భయాలు సమాజంలో ఇంకా తొలగిపోని కాలం కూడా అది. రాజులకు, రాజ వంశాలకు విధేయులుగా వుండడం అనే విలువ తిరస్కరించబడి చట్టాలకు, ప్రజాస్వామిక రాజ్య నిబంధనలకు పౌరులు విధేయులుగా వుండాలనే కొత్త విలువ అప్పుడప్పుడే ఏర్పడ్డ కాలం కూడా అదే. చట్టాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే పౌరులను కఠినాతి కఠినంగా దండిరచడం ద్వారా so-called శాంతిభద్రతలను అదుపులో వుంచడం ద్వారా రాజ్యం తన ప్రభుతను, సార్వభౌమికతను పరిరక్షించుకుంటున్న కాలం అది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజ్యం సమాజాన్ని తన కొత్త నిబంధనల, చట్టాల ఉక్కు చట్రంలో బంధించి పాత విలువలను, సాంప్రదాయాలనే కాదు చివరకు గతానికి సంబంధించిన జ్ఞాపకాలను కలిగివుండడం కూడా ఒక విద్రోహంగా, ఒక తిరుగుబాటుగా ఒక రాజ ద్రోహంగా భావిస్తున్న కాలం. బహుశా ప్రతి కొత్త తరహా రాజ్యం (అది ఏ భావజాల ప్రేరితమైనదయినా) ఈ రకమైన తీవ్ర పాలనను (Intense Regime) ప్రవేశపెట్టనిదే నిలదొక్కుకోలేదని కూడా మనం చెప్పవచ్చా?

ఒక విచిత్ర సంక్లిష్ట పరిస్థితినీ, ఇందులోని వైరుధ్యాన్నీ కళాకారులు, తత్వవేత్తలు మొదట గుర్తిస్తారు.  సోఫోక్లీస్‌ రాసిన ఈ యాంటిగని అనే మహత్తర విషాదాంత నాటకం ఈ కొత్త తరహా ప్రజాస్వామిక రాజ్యం యొక్క అమానవీయ వ్యవహారంపై ఒక కళాకారుని నిరసనగా కూడా మనం చూడవచ్చు.

ఈ కొత్త తరహా ప్రజాస్వామ్యం వల్ల మనుషులకు దొరికిన కొత్త స్వేచ్ఛలు ఎంత ఆహ్వానించదగినవో ఈ కొత్త నిబంధనలు, చట్టాలు అంతే నిర్బంధకరమైనవీ, ఊపిరాడనీయనివీ కూడా అయి వుంటాయి. ఈ విచిత్ర సంక్లిష్ట పరిస్థితినీ, ఇందులోని వైరుధ్యాన్నీ కళాకారులు, తత్వవేత్తలు మొదట గుర్తిస్తారు. తమదైన పద్ధతిలో నిరసన ప్రకటిస్తారు. ఆ విధంగా చూసినప్పుడు సోఫోక్లీస్‌ రాసిన ఈ యాంటిగని అనే మహత్తర విషాదాంత నాటకం ఈ కొత్త తరహా ప్రజాస్వామిక రాజ్యం యొక్క అమానవీయ వ్యవహారంపై ఒక కళాకారుని నిరసనగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ విషయాలను సూటిగా, స్పష్టంగా ఒక రాజకీయ విమర్శ రూపంలో చేసినట్లయితే ఆ నాటి ఏథెన్స్‌ రాజ్యం సోఫోక్లీస్‌ను బతకనిచ్చి వుండేదే కాదు. అలాగని తన భావాలను వెల్లడిరచకుండా వుండడమూ సొఫోక్లీస్‌లాంటి కళాకారునికి సాధ్యమూ కాలేదు. ఆ సందిగ్ధ మానసిక క్షోభ నుండి పుట్టుకొచ్చింది యాంటిగని నాటకం.

సమకాలీన ఏథెన్స్‌ నగరాన్ని నేపథ్యంగా ఇలాంటి ఇతివృత్తంతో నాటకం రాయడానికి సాధ్యం కాని ఒక రాజకీయ, భావజాల వాతావరణంలో జీవిస్తున్న సోఫోక్లీస్‌ తన తీవ్ర నిరసనను వెల్లడిరచడానికి ప్రాచీన గ్రీకు పురాణ గాథలను ఆశ్రయించాడు. ప్రాచీన గ్రీకు నగరమయిన థీబ్స్‌ను అక్కడ జరిగిన విషాద ఘటనల పరంపరను నేపథ్యంగా ఎంచుకున్నాడు. తద్వారా ఎథీనియన్‌ రాజ్య సెన్సార్‌షిప్‌ను, ఎథీనియన్‌ పౌరుల తక్షణ అనాలోచిత రియాక్షన్స్‌నూ అవాయిడ్‌ చేయగలిగాడు.

ప్రతి గ్రీకు పౌరుడికీ కంఠోపాఠమయిన ఈడిపస్‌ కథను ఆధారం చేసుకుని యాంటిగని నాటకం రాసాడు. ‘తన స్వంత తండ్రిని చంపి, తన స్వంత తల్లిని పెళ్ళాడతాడు,’ అనే భవిష్యవాణిని వమ్ము చేయడం కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఘోరమే జరిగిపోతుంది. తెలియకుండానే ఈడిపస్‌ తన తండ్రిని వధిస్తాడు, తల్లి అని తెలియకుండానే యొకాస్టానే పెళ్ళాడతాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆ బాధ భరించలేక రాజ్యాన్ని కొడుకులకు వదిలి తన కళ్ళను తానే పొడుచుకుని అంధుడయి తనకు తానే ప్రవాస శిక్ష విధించుకుని చరిత్రనుండీ వైదొలగే పాత్ర ఈడిపస్‌ది. ఇంతకన్నా దుఃఖభరితమయిన, ఇంతకన్నా వళ్ళు గగుర్పొడిచే విషాద పాత్రను ఊహించలేము. అలా రాజ్యం వదిలే ముందు తన రాజ్యాన్ని తన కొడుకులిద్దరూ చెరో ఏడాదిపాటు పాలించుకోవాలనే ఏర్పాటు చేసి వెళ్ళిపోతాడు.

రాజ్య నియమాలూ, చట్టాలూ, నిబంధనలు ఏవైనా సరే మనిషి స్వేచ్ఛకూ, గౌరవానికీ, న్యాయానికీ వ్యతిరేకంగా వున్నప్పుడు వాటిని ధిక్కరించడమే మానవత్వ అత్యున్నత ప్రకటన అనే సందేశాన్ని యాంటిగని ఇస్తుంది.

పెద్దవాడయిన ఎటియోక్లిస్‌ ఒక ఏడాది పాలించిన తర్వాత తన తమ్ముడికి రాజ్య పాలన అప్పగించేందుకు నిరాకరిస్తాడు. ఒప్పందాన్ని వుల్లంఘించినందుకు పొలినైసిస్‌ పొరుగు రాజుల సహకారంతో థీబ్స్‌ నగరాన్ని ముట్టడిస్తాడు. ఆ యుద్ధంలో అన్నదమ్ములిద్దరూ మరణిస్తారు. వారి మేనమామ క్రియాన్‌ రాజుగా సింహాసనం స్వీకరించి నగరంపై దండెత్తిన పొలినైసిస్‌ను రాజద్రోహిగా, దేశద్రోహిగా ప్రకటించి అతని శవాన్ని నగర సరిహద్దుల్లో ఎక్కడా ఖననం చేయరాదనీ, ఎలాంటి అంత్యక్రియలూ చేయరాదనీ శాశనం చేస్తాడు. ఆ శాసనం అన్యాయమైనదనీ, అమానుషం అయినదనీ దైవ నిర్మితమయిన ప్రాచీన సాంప్రదాయాలకు కూడా వ్యతిరేకమైనది కాబట్టి ఆ రాజశాసనమే దైవ ద్రోహమని భావిస్తుంది యాంటిగని. తన తండ్రిని కోల్పోయి ఆ దుఃఖం వదలక ముందే భీభత్సమైన యుద్ధంలో తన ఇద్దరు సోదరులనూ కోల్పోయి శోకసముద్రంలో మునిగివున్న యాంటిగనికి క్రియాన్‌ జారీ చేసిన ఈ నిషేధ ఉత్తర్వు పిడుగుపాటు లాంటిది.

ఆమె దుఃఖం, నిరాశ తీవ్ర క్రోధంగా, ధిక్కారంగా మారిపోతుంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నమ్మిన విలువల కోసం, మానవత్వం కోసం న్యాయం కోసం నిలబడే గొప్ప వ్యక్తిత్వంగా మనకు యాంటిగని ఈ నాటకంలో కనిపిస్తుంది. మానవుల హుందాతనాన్ని భంగపరిచే రాజ్య శాసనాలన్నీ ధిక్కరించదగ్గవే అని యాంటిగని భావిస్తుంది. బతికివున్నా, మరిణించినా, ఎలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరణించినా ప్రతి మనిషి గౌరవానికి అర్హుడే అని నమ్మిన యాంటిగని తన సోదరుడి అంత్యక్రియలు జరుపుతుంది. అలా రాజశాసనాన్ని ధిక్కరించి రాజద్రోహిగా మారి బంధించబడుతుంది. సజీవ సమాధి అనే క్రూరమైన శిక్షను ఆమెకు విధిస్తాడు క్రియాన్‌. Human Dignity కి అత్యంత విలువ ఇచ్చే యాంటిగని ఈ అవమానకరమైన, అన్యాయమైన శిక్షకు నిరసనగా ప్రాణపరిత్యాగం చేసుకుంటుంది. ఆ విధంగా తన మరణంలో కూడా రాజ్యాధికారానికి చిక్కకుండా తన ఇచ్ఛానుసారమే చనిపోతుంది. రాజ్య నియమాలూ, చట్టాలూ, నిబంధనలు ఏవైనా సరే మనిషి స్వేచ్ఛకూ, గౌరవానికీ, న్యాయానికీ వ్యతిరేకంగా వున్నప్పుడు వాటిని ధిక్కరించడమే మానవత్వ అత్యున్నత ప్రకటన అనే సందేశాన్ని యాంటిగని ఇస్తుంది.

1990లలో మనం చూశాం. సరిగ్గా ఆ రాజ్య వికృత ముఖాన్ని బట్టబయలు చేయడం కోసం సమాజంలో దాన్ని చర్చకు పెట్టడం కోసం అనంతు ఈ నాటకాన్ని ఎంచుకున్నాడని అనిపిస్తుంది. చట్టబద్ధ పాలన అనే ముసుగు కింద రాజ్యం చేసే అమానుష హింసను, నిరంకుశ పాలనను expose చేయడానికి అదే లక్ష్యంతో రచించబడిన యాంటిగనికంటే తగిన నాటకం మరేముంటుంది?

1990లలో ఆంధ్రప్రదేశ్‌లో ఆ నాటి రాజ్యం పౌరహక్కులను యథేచ్ఛగా వుల్లంఘిస్తూ చిత్రహింసలతో, అపహరణలతో, బూటకపు ఎన్‌కౌంటర్లలో వందలాది మందిని చంపేసిన కాలాన్ని మనం చూసాం. ఆ భీభత్సమైన రాజ్యహింస చివరకు ‘ఎదురు కాల్పుల’లో చనిపోయిన ఉద్యమకారుల శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కూడా ఇష్టపడని అమానుష వికృత స్థాయికి చేరుకుంది. ‘ఎన్‌కౌంటర్‌ మృతుల శవస్వాధీన కమిటి’లాంటి ఊహకు కూడా అందని విచిత్రమయిన సంఘాలు పుట్టుకు రావలసిన, శవాలను అప్పగించాలని పోరాడవలసి వచ్చిన చీకటి కాలాన్ని 1990లలో మనం చూశాం. సరిగ్గా ఆ రాజ్య వికృత ముఖాన్ని బట్టబయలు చేయడం కోసం సమాజంలో దాన్ని చర్చకు పెట్టడం కోసం అనంతు ఈ నాటకాన్ని ఎంచుకున్నాడని అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం చట్టబద్ధ పాలన అనే ముసుగు కింద రాజ్యం చేసే అమానుష హింసను, నిరంకుశ పాలనను expose చేయడానికి అదే లక్ష్యంతో రచించబడిన యాంటిగనికంటే తగిన నాటకం మరేముంటుంది? ఈ ప్రఖ్యాత ప్రాచీన గ్రీకు నాటకాన్ని తనదైన, కవితాత్మకమైన, సరళ సుందరమైన శైలిలో అనంతు తెలుగు చేసాడు. ప్రాణాలను సైతం లెక్క చేయక రాజ్యాన్ని ధిక్కరించిన ఎందరో ఉత్తమ మానవులను చూసిన తెలుగు సమాజం మూడు వేల ఏళ్ళ నాటి ఈ నాటకాన్ని చప్పున అర్థం చేసుకోగలదు. హృదయానికి హత్తుకోగలదు. నిరంకుశ క్రియాన్‌లను వాగ్దాన భంగం చేసే ఎటియోక్లిస్‌లనూ, హక్కు కోసం తిరగబడే పొలినైసిస్‌లనూ, మానవత్వ పతాకాన్ని ధృడంగా ఎత్తిపట్టి నిలబడే యాంటిగనీలనూ తనలోనే వెతుక్కోగలదు.

సుమారు 30ఏళ్ళ క్రితం నాటక విద్యార్థిగా వున్న సమయంలోనే అనంతు చేసిన ఈ అనువాదం, తాను ఎంచుకున్న ఈ నాటకం ఆ ఎంపిక వెనుక ప్రేరణగా నిలిచిన రాజకీయ దృక్పథం మనలను ఆశ్చర్యపరుస్తాయి, ఆనందపరుస్తాయి.

సుమారు 30ఏళ్ళ క్రితం నాటక విద్యార్థిగా వున్న సమయంలోనే అనంతు చేసిన ఈ అనువాదం, తాను ఎంచుకున్న ఈ నాటకం ఆ ఎంపిక వెనుక ప్రేరణగా నిలిచిన రాజకీయ దృక్పథం మనలను ఆశ్చర్యపరుస్తాయి, ఆనందపరుస్తాయి. మనం బతుకుతున్న ఈ ఫాసిస్టు క్షణాల్లో ఈ రాజ్య ధిక్కార నాటకం పుస్తక రూపంలో వస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది. 30 ఏళ్ళు ఆలస్యంగా వచ్చినా సరిగ్గా రావలసిన రాజకీయ సందర్భంలోనే ఈ పుస్తకం వస్తున్నదని నా అభిప్రాయం. ఫాసిస్టు రాజ్యంపై దానికి ఆధారభూతంగా వున్న ఆధిపత్య, సాంప్రదాయిక విలువలకు, సంస్కృతికీ వ్యతిరేకంగా ఒక భావ, సాంఘిక, రాజకీయ విప్లవం అవసరమయిన కాలంలో మనం వున్నాం. తీవ్రమైన వ్యంగ్యంతో రాజ్యంపై కవులూ, కళాకారులూ, నాటకకారులూ స్పందించవలసిన కాలంలో బతుకుతున్నాం. ఆధునిక విలువలయిన వ్యక్తి స్వేచ్ఛ, సాంఘిక సమానత్వం, హేతుబుద్ధి అనే మూడు విలువలను పునాది చేసుకుని ఒక సాంస్కృతిక, బౌద్ధిక విప్లవమే ప్రారంభించాల్సిన సంధి దశలో వున్నాం. ఈ సన్నివేశంలో వెలువడుతున్న ఈ యాంటిగని కొత్త తరహా నాటకాలకూ ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాను.

ఈ పుస్తకాన్ని ప్రచురించి తెలుగువారికి గొప్ప కానుకను అందిస్తున్న ప్రేమలేఖ ప్రచురణనూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ముందుగా ‘యాంటిగని’ మీ చేతుల్లోకి : అనంతు చింతలపల్లి

మిత్రులారా! నేను కేంద్రీయ విశ్వ విద్యాలయంలో 1994-96 సంవత్సారాలలో నాటక విభాగంలో (Golden Threshold) SN School నుంచి MPA(Master of Performing Arts) చదువుకున్నాను. తర్వాత పాతికేళ్ళు జర్నలిజంలో – ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేసిన అనుభవం నాది.

నేను చదువుకునే రోజుల్లోనే ‘ఆంటిగొని’ నాటకాన్ని అప్పటి నా ఉపాధ్యాయుడయిన ఎన్.జె.భిక్షు గారి అభ్యర్థన మేరకు అనువాదం చేసాను. ఆ నాటకం చాలా మంది నాటక దర్శకులు ప్రదర్శించారు. ఆ తర్వాత, అంటే దాదాపు పాతికేళ్ళ తర్వాత అనురాధా కపూర్ గారి దర్శకత్వంలో ప్రపంచ ఆధునిక నాటక పితామహుడు అనదగ్గ హెన్రిక్ ఇబ్సన్ రచించిన ‘ఘోస్ట్స్’ నాటకాన్ని ‘దెయ్యాలు’ పేరుతో నా ప్రియ మిత్రుడు రాజీవ్ వెల్చేటి అభ్యర్థన మేరకు అనువదించాను.

ఇది ఒక అశుభ పరిణామం. ఈ నేపథ్యంలో నేను అనువదించిన రెండు నాటకాలను పుస్తకాలుగా తెస్తున్నాను. ముందుగా ‘యాంటిగని’ నాటకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాను.

ఈ నాటకం కూడా ఒకటి రెండు ప్రదర్శనలు నోచుకుంది.  నేను విద్యార్థిగా వున్నప్పుడు వేసేందుకు తెలుగు నాటకాలు అందుబాటులోనే వుండేవి కావు. నేను అనువాదాలు చేసేందుకు ప్రేరణ ఈ లోటే. ఈ నాటికీ తెలుగులో నాటక రచనలు అందుబాటులో లేవు. ఇప్పుడు HCU కూడా తెలుగు ప్రేక్షకులను అడ్రస్ చేయడం, తెలుగులో నాటకాలు వేయడం క్రమంగా, పూర్తిగా మానివేసే ధోరణిలో వుంది. ఇది ఒక అశుభ పరిణామం. ఈ నేపథ్యంలో నేను అనువదించిన రెండు నాటకాలను పుస్తకాలుగా తెస్తున్నాను. ముందుగా ‘యాంటిగని’ నాటకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాను.

ఈ పుస్తకాన్ని నేటినుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని ఛాయ, ప్రేమలేఖ స్టాల్ -159లో పొందవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article