ఇవి కవితలో కధలో కావు. కేవలం పదాలు, లైన్లు, ఫుల్ స్టాప్లు, ఖాళీలు, నా ప్రయత్నం వల్లో ప్రయత్నలోపం వల్లో సగం సగం కనబడే నిజ జీవిత ప్రేరణలు.
స్వరూప్ తోటాడ
ఇన్ని పేజీల పుస్తకం నేనే రాసానా! ఎలా రాశాను? రాయటం ఎలా? ఎవరికి తెలుసు! చాలా మందికి తెలిసే ఉంటుందిలే కానీ నాకు మాత్రం తెలీదు. తెలుసుకోవాలనీ అనిపించలేదు. ఎలా రాయాలో తెలీకపోయినా ఎందుకు రాయాలో మాత్రం చాలా బాగా తెలుసు. ఏ సాయంత్రం పూటో సిటీ బైటికి వెళ్లే దారిలో అప్పుడే కొద్దిగా చిక్కబడుతున్న సాయంత్రాన్ని ఆవాహన చేసుకుంటున్న ఏదో నాచు పట్టిన డాబా ప్రహారీ గోడ కనిపిస్తుంది. అలవాటైన పదాల్లో ఇమడని, ఎప్పటినుండో వెంటాడుతున్న ఏదో సన్నటి ఒక అలజడి ఇప్పటివరకూ మాటలకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతూ ఇప్పుడీ దృశ్యంలో వెలసినట్టు ఓ epiphany అప్పటికప్పుడు కలుగుతుంది. ఆ పల్చటి పొరని రియాలిటీ మీంచి నేర్పుగా విడదీసి అక్షరాలు చెక్కటం మహా సరదా. అలాంటి సరదాలో రాసినవి కొన్ని. ఇక కొన్నైతే అక్షరాల్లోకి ఒంపకపోతే లోపలి ఆత్మో మనసో లేక ఉత్త మెదడో మెలితిరిగిపోయి ఓ లక్ష చిక్కుముళ్లు వేసేసుకుంటుందేమో అని భయపడి గత్యంతరం లేక రాసినవి.
బహుశా ఏదో బద్దకపు వేసవి మధ్యాహ్నం గురించి నేను రాసే ఓ మూడు పొడి పొడి పేరాల మామూలుతనంలో వాటికి ఒక తోవ దొరికి, ఈ చిన్న చిన్న నీటిబొట్లు అన్నీ ధారకట్టి ప్రవహిస్తుండవచ్చు. అందుకు నేను రాసిందేదో గొప్పదన్న భ్రమలో చదివిన వాళ్ళు పడి ఉండవచ్చు.
ఇవి కవితలో కధలో కావు. కేవలం పదాలు, లైన్లు, ఫుల్ స్టాప్లు, ఖాళీలు, నా ప్రయత్నం వల్లో ప్రయత్నలోపం వల్లో సగం సగం కనబడే నిజ జీవిత ప్రేరణలు. అప్పుడప్పుడూ అంతకు కొంచెం మించి ఇంకేవోలు. మరి ఇలాంటి సాధారణమైన అక్షరాల గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? ఎడారి ఇసుక తిన్నెల మీద గాలికి పుట్టే గీతల్లాగ ఇష్టం వచ్చినట్టు పోయే ఈ రాతల్ని ఎందుకు ఒకచోట చేర్చాలి? చాలా మంది మిత్రులు నేను ఫేస్బుక్ లో రాసుకున్న write ups ని మెచ్చుకుని, నా మాటలు తమను ఏదో తెలియని ఒక ఉద్వేగానికి గురించేశాయని చెప్పడం విన్నాను. నేను కొన్ని నెలల క్రితం మామూలుగా రాసుకున్న కొన్ని వాక్యాల్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ వాటిని నా దగ్గర ప్రస్తావించారు. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత విస్తారంగా సాహిత్యం చదివే వీరికి అసలు సాహిత్యంతో ఏ పరిచయం లేని నేను రాసిన మాటలు ఎందుకు అంత గొప్పగా అనిపిస్తున్నాయా అని ఎన్నో సార్లు ఆలోచించాను. బహుశా ప్రేమ, ద్వేషం, కోపం, దుఃఖం లాంటి mainstream emotions కి మధ్య ఉండే విస్తారమైన ఖాళీల్లో ఆశంఖ్యాకంగా ఉండే అనేకానేక నిర్లిప్తతలు, నిశ్శబ్దాలు, ఖాళీలు, చీకట్లు, అస్పష్టతలు మన మాటల్లో వాటికి చోటు దొరక్క ఎప్పటికీ వెలుగు చూడలేము అనే బెంగ పెట్టుకుంటాయి కాబోలు. అందుకే బహుశా ఏదో బద్దకపు వేసవి మధ్యాహ్నం గురించి నేను రాసే ఓ మూడు పొడి పొడి పేరాల మామూలుతనంలో వాటికి ఒక తోవ దొరికి, ఈ చిన్న చిన్న నీటిబొట్లు అన్నీ ధారకట్టి ప్రవహిస్తుండవచ్చు. అందుకు నేను రాసిందేదో గొప్పదన్న భ్రమలో చదివిన వాళ్ళు పడి ఉండవచ్చు. పుస్తకం వేద్దాం అని వెంకట్ సిద్దారెడ్డి గారు అన్నప్పుడు రచయితో కవో అని అనిపించుకునే ధైర్యం బొత్తిగా లేకపోయినా వద్దు లెండి అని చెప్పకపోవడానికి కారణం అదే. ఈ రాతలు గొప్పవా చప్పవా అన్నది అప్రస్తుతం అనీ, ఈ musings మనుషులతో మాట్లాడుతున్నాయి కాబట్టి అంతకంటే కారణాలు అక్కరలేదనీ అనిపించింది. ఎలా రాయాలో తెలియకపోయినా ఎందుకు రాయాలో తెలుసుకున్న నేను అసలు ఏం రాశానో నాకు నేనే తెలుసుకోవాలంటే అవన్నీ పక్కపక్కనే అమర్చుకుని మొదలు నుండి చివరిదాకా చదువుకోవాలనీ అనిపించింది. అందుకే పుస్తకం.
నేను తెలుగులో బాగా రాస్తాను అని నన్ను నమ్మించి, వెంటపడి రాయించి, ఇక రాయకుండా ఉండలేని స్థితిలోకి నన్ను నెట్టేసిన కృష్ణ మోహన్ గారికి, ఇంత చక్కగా పుస్తకం వేసి నన్ను ప్రోత్సహించిన వెంకట్ సిద్దారెడ్డి గారికీ, ఏదో చదివేసి స్క్రోల్ చేసేయకుండా నా రాతల్ని అభిమానించి, ప్రోత్సహించి, మంచి మాటలు చెప్పిన ఫేస్బుక్ మిత్రులకీ కృతజ్ఞతలు.
ప్రచురణకర్త వెంకట్ సిద్దారెడ్డి మాట…
ఒక పబ్లిషర్ గా స్వరూప్ అనే రచయితను కనుక్కోవడం ఒక యురేకా మొమెంట్.
ఒక రచయితగా సాటి రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తిగా చూస్తుంటాను. ఒక పబ్లిషర్ గా కొత్త రచయితలు ఎవరున్నారా అని అన్వేషిస్తూనే ఉంటాను. రచయితగా స్వరూప్ వాక్యం చదివి ఈర్ష్య కలిగింది. తెలుగులో కన్సిస్టెంట్ గా ఇంత మంచి వాక్యం రాసే రచయితను నేనైతే ఇంతవరకూ చూడలేదు.
స్వరూప్ ఫేస్ బుక్ లో రాసిన మ్యూజింగ్స్ ని పబ్లిష్ చేయడం ఆన్వీక్షికి ప్రచురణాలయానికి ఒక గర్వకారణం. స్వరూప్ రాతలు చదువుతుంటే అతను ఏమేం పుస్తకాలు చదువుతుంటాడో అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఫేస్ బుక్ లో పోస్ట్ రాసే ముందు అతనేం తింటాడో, తాగుతాడో అని క్యూరియస్ గా ఉంటుంది. అసలు అతను జీవితాన్ని, ప్రపంచాన్ని చూసే కళ్ళని కొన్ని రోజులు అద్దెకు తీసుకోవాలనిపిస్తుంది. స్వరూప్ మ్యూజింగ్స్ చదవడమంటే తెలుగు భాషను కొత్తగా డిస్కవర్ చేసినట్టుంటుంది. ఎప్పుడైనా కథలో ఎక్కడో ఒక చోట ఒక మంచి అబ్జర్వేషన్ ని రాసి శభాష్ అని భుజం తట్టుకుంటుంటాం. కానీ స్వరూప్ ప్రతీ వాక్యం ఒక వండర్ లా తోస్తుంది.
ఈ పుస్తకం కోసం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఉన్న122- 123 అన్విక్షికి స్టాల్స్ లో పొందవచ్చు లేదా ఈ amazon లింక్ క్లిక్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు.