Editorial

Monday, December 23, 2024
కథరఘు మాందాటి కథ : నడకలు

రఘు మాందాటి కథ : నడకలు

illustration by beera srinivas
Beera Srinivas

అంతకు ముందు రాత్రే చాలా సేపు నిప్పులను రాజుకుంటు నేను వాంగ్మూ, ఉగేన్ ఈ రెండేళ్లలో జీవితాల్లో జరిగిన మార్పులు గురించి పంచుకున్నాం.

సమయం నాలుగు

ఇంకా చీకట్లు అలుముకునే ఉన్నాయి.
చిత్రంగా నాలాగే వెలుతురును పులుముకోవాలని ఎదురుచూస్తున్నట్టు ఉన్నాయి చిన్న కుండీల్లో మొక్కలకు పూచిన పూలు.
పొగమంచు తన ప్రతాపం చూపెడుతూ అమాంతం అధిమి పట్టినట్టుంది,
కనుచూపుమేర వరకు అంతా ఒకటే రంగు.
చీకటి నింపుకున్న కాస్త తెలుపు కాస్త బూడిద రంగుతో మంచు పొగ.

చుట్టూ చేరుకున్న నిశ్శబ్దంలో అప్పుడప్పుడు కిటికీలో సగం తెరుచుకున్న తలుపు సందు గుండా గాలి ఈలలు వేస్తోంది.
దూరాన మినుకు మంటున్న స్ట్రీట్ లైట్ నీలి రంగు కిటికీ అద్దం గుండా గమ్మత్తుగా మిళుకు మిళుకుమంటోంది.
కింద కంబలి, మీద కంబలి ఒళ్ళును వెచ్చగా హత్తుకుంది.
కుంపటిలో బొగ్గు రాత్రంతా మండి మండి చప్పున చల్లారి ఎరుపు నుండి నలుపులోకి తన గమ్యాన్ని మలుపుకున్నది.
ఇప్పుడు ఆ కుంపటి నిండా యుద్ధం ముగిసిన గంభీర నిశ్శబ్దం అలుముకుంది.

అవును నిశ్శబ్దం.
అది గతానికి వర్తమానానికి మధ్యన వారధిలా స్మృతులని ఎదురుగా పేరుస్తూ కొత్త గమ్యాలకు దారులు చూపెడుతూ తన ప్రమేయం లేకుండా అంత తానే అయి ఉంటుంది.
అంటి ముట్టనట్టుండే ఈ జీవనయానాం తెలియకుండానే ఎన్నో కొత్త దారులను ఎంతగా వద్దనుకున్న కొత్త బంధాల్ని బాంధవ్యాల్ని తెచ్చి పెడుతూనే ఉంటుంది.
మనకు తెలియని ప్రపంచంలో ఒంటరిగా ఉన్నావంటే దానర్థం ఆ ప్రపంచంలో లీనమవ్వాలనే మనకు రాసిపెట్టి ఉందని.
అప్పుడు కావాల్సింది జాగ్రత్తలు కాదు నమ్మకం మన మీద మనకు, మనం చేరుకున్న చోటు మీద, చుట్టూ అల్లుకున్న ప్రపంచం మీద, మనుషుల మీద, మనసుల మీద.
మన దగ్గర దోచుకోవడానికి ఏమిలేదన్న మానసిక స్థితికి మన స్థితి చేరుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది.

ప్రపంచాన్ని పట్టించుకోవడం అనే జిజ్ఞాసని మానుకున్నప్పటి నుండి అనేకానేక మానసిక అలజడులను నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడే ఇంకాస్త నిశ్శబ్ధాన్ని మనలోకి ఆహ్వానించుకోవచ్చు.
ఆ నిశ్శబ్దంలో వినిపించే ప్రతి రాగం సూటిగా మనసుకు హత్తుకుంటుంది అది వాస్తవమైన.. అవాస్తవమైన .. బేరీజు లెక్కలకు తావులేకుండా కేవలం లీలగా స్వీకరిస్తాం.

“కు జుంగ్ పోలా..
చుబో డేలె”

ఉలిక్కిపడి వెనక్కి తిరిగా
“వాంగ్మో త్సుమి తింలె” ముద్దుగా వాంగ్మూ అని పిలుచుకుంటాం.

హై గుడ్ మార్నింగ్ అని జొన్ఖా (Dzongkha) భాషలో పలకరించింది.
నేను కూడా నవ్వుతూ “చుబో డేలె” అన్నాను.

అప్పుడే లేచావ. ఏంటి నిద్ర పట్టట్లేదా అంది.
లేదు నిద్ర నుండి మేలుకున్నాను. నిజానికి చాలా బాగా పట్టింది నిద్ర.

మోమోస్ లెహ్ లడక్ లో తిన్న అలవాటు ఉంది. పైగా డోల్మా చేతిలో ఏదో మాయ ఉంటుంది. తన చేత్తో ఏది చేసినా గమ్మత్తుగా ఉంటుంది.

కొన్ని పరిచయాలంతే అదేదో ఫాంటసీ, ఫిక్షన్ కథల్లోలాగా అలా పరిచయానికి గురై తెలియకుండానే జీవితంలో చెరగని గుర్తులని మిగుల్చుతాయి.
అంతకు ముందు రాత్రే చాలా సేపు నిప్పులను రాజుకుంటు నేను వాంగ్మూ, ఉగేన్ ఈ రెండేళ్లలో జీవితాల్లో జరిగిన మార్పులు గురించి పంచుకున్నాం.
మా సంభాషణల్లో ఎక్కువ శాతం జోన్క్ పరిసర ప్రాంతాల్లో పెరిగే లావెండర్ మరియు చామంతుల తోటలు, వాటి మీద వాలే తేనె టీగలు.
అంతే కాదు జాంగ్ స్టా దేవాలయంలో బౌద్ధుల పూజ తంతులు దేవాలయం చుట్టూ మారు మ్రోగే సంగీత వాయిద్యాల హోరు నుండి మొదలుకొని.
పలుచని రాగి రేకుల మీద కాన్వాస్ గుడ్డల మీద గెంకి గీసే అద్భుత చిత్రాల వరకు. అతని చెల్లెలు వండే ఏమ (స్థానికంగా దొరికే మిరపకాయలు) ఏమ దాట్శి పులుసు.
వాళ్ళ అమ్మ పుదీనా తురుము వేసి చేసే బన్ను రొట్టెలతో ముంచుకు తినడం వరకు ఎన్నో మాట్లాడుకున్నాం.

ఉగేన్ ఇక్కడికి రావడం కొత్తేమి కాదు. వాంగ్మూ, ఉగేన్ ఈ ఇద్దరమ్మాయిలు మంచి స్నేహితులు. ఒకప్పుడు ఉగేన్ కూడా ఇక్కడే పారో లో పని చేస్తుండేది.
తర్వాత తన జీవిత భాగస్వామికి టూరిస్ట్ డిపార్ట్మెంట్ లో గైడ్ గా నియమిథులయ్యాక తినుకూడా కొత్త రాజధాని థింపు కి మారక తప్పలేదు.
వాంగ్మూ కి ఇక్కడే పాత రాజధాని పారో లొనే ఉండడం ఇష్టం అంటుంది. పారో తో పోల్చితే థింపు కాస్త రణగొణ ధ్వనులతో టూరిస్టులతో కిక్కిరిసి ఉంటుంది అక్కడ నాకు ఊపిరి ఆడదు అంటుంది.

చలి ఎక్కువగా ఉండేనా?
దుప్పట్లు సరిపోయాయ? అంటూ కూర్చుంది.
కాళ్ళకు సాక్సులు లేకుండా నేలమీద పెట్టలేము. చలికి తట్టుకునే విధంగా కింద నేల అంత కూడా చెక్కలతో నింపి దాని మీద మందపాటి తివాచీలు పరుచబడి ఉంటాయి.
లేచి నిల్చొని పక్కనే ఉన్న ఊలు దారంతో చేసిన జాకెట్ ని తీసుకుని ఒంటి కి తొడుక్కున్నాను. ఆ జాకెట్ అంతకు రెండు రోజుల ముందు అంటే మరి డొల్మా వారం రోజుల నుండి అల్లుతూ ఉందంటా..
చివరి సారి ఇండో భూటాన్ ఫ్రెండ్షిప్ ర్యాలీ పేరుతో ట్రిప్ నిర్వహించినపుడు మా బృందం ఆర్ధికంగా కొంత సహాయం డొల్మా మరియు తన మనవరాలికి (సోవాన్) అందించింది.
నేను వస్తున్న సంగతి తన మనవరాలు సోవాన్ కి ముందే చెప్పాను తను నేను చేరుకున్న రోజునుండి వాంగ్మూ ఇంటికి చేరే వరకు నాతోనే ఉంది.
నానమ్మ (డొల్మా) రమ్మంది అనడంతో ముందు డోల్మా దగ్గరికి వెళ్ళాను.
నాకోసం పొడుగాటి గిన్నెలో నుండి వేడి వేడిగా పొగలు కక్కుతున్న మోమోస్ ని ఒక ప్లేట్ లో వేసి దాని పక్కన అల్లం, మెంతులు, కారం తో చేసిన పలుచగా ఉండే పచ్చడి వడ్డించింది.
మోమోస్ లెహ్ లడక్ లో తిన్న అలవాటు ఉంది. పైగా డోల్మా చేతిలో ఏదో మాయ ఉంటుంది. తన చేత్తో ఏది చేసినా గమ్మత్తుగా ఉంటుంది.
వయసు సుమారు డెబ్భై కి పైనే ఉంటుంది కానీ ఇప్పటికీ ఎండు మిరపయకాయలని పెద్ద రోట్లో వేసి పొడుగాటి రోకలితో దంచి కారం పడుతుంది.
ఆ రోజు ఉదయం ఇంటికి చేరుకోగానే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లని ఇంకా నూనె క్యాన్లని సగానికి చీలి రెండు ముక్కలుగా చేసి అందులో మట్టి పోసి అందమైన పూల మొక్కల్ని పెంచుతుంటుంది వాటికి నీళ్లు పడుతుంది.
అక్కడి వాతావరణమే లేక తన వేళ్ళలో దాగిన ఆప్యాయతనో తెలియదు కానీ మొక్కలు మాత్రం ఎప్పుడు గలగల నవ్వుతుంటాయి.
మోమోస్ తిని కాసేపు రెండు గదుల ఇంటిని, దానికి ఆనుకుని రేకు పరుచుకున్న చిన్న వంట గదిని, బయట మొక్కల్ని, మనలాగే ఇంటి చుట్టూ అలుకు చల్లుకునే అలవాటు ఉండే ఉంటుంది నున్నటి నేలని చూస్తే అనిపించింది.

తరచి చూడాలే గాని ఏకాంతానికి మించిన స్వర్గం కానీ, ప్రయాణానికి మించిన అద్భుతం కానీ జీవితంలో మరోటి ఉంటుందని నేననుకోవటం లేదు.

సోవాన్ ఇక్కడే పారోలో పెయింగ్ గెస్ట్ హౌస్లో పని చూసుకుందంట. పరీక్షలు పూర్తయ్యాయి. ఇంట్లో ఉండడం కన్నా ఇలా ఏదో ఒక పని చేయడం మంచిది కాదా అంది.
నిజమే చివరి సారి వచ్చినప్పుడు నేను కూడా గమనించాను ఇక్కడ దాదాపు అబ్బాయిలంతా టూరిస్ట్ గైడ్ లాగా అమ్మాయిలంతా హోటల్ మేనేజ్మెంట్ లో స్థిరత్వం కోరుకునే తీరు ముచ్చటేసింది.
మాటల్లో ఉండగానే లోపలి నుండి డోల్మా ఊలుతో చేసిన జాకెట్ (అదే స్వేట్టర్, గరం బనీన్ ఏ పేరైతే నేమి వెచ్చదనం పంచడం దాని పని) తీసుకొచ్చి చేతిలో పెట్టింది.
నాకేం మాట్లాడాలో తెలియలేదు ఒక విధంగా చెప్పాలంటే మా ఇద్దరి మధ్య భాష ఎప్పుడో మాయమైంది. అర్థంకాని మా ఇరువురి నడుమన ఉంది నిశ్శబ్దమే అదే నిశ్శబ్దం ఇప్పుడు ఒక కమ్మని స్వరాన్ని ఆప్యాయత పేరుతో వినసొంపుగా వాయిస్తోంది.
కళ్ళతో లోతుగా చూడడం మెత్తగా చేతులతో నన్ను తడమడం మనసు నిండుగా దీవెనలతో కూడిన చెరగని చిరునవ్వుకు మించిన భాష ఇంకా ఏముంటుంది, ఇంకేం కావాలి..
సుతారంగా అల్లుకున్న ఊలు జాకెట్ ప్రతి పోగు మెలికలో తన ప్రేమ లయ విన్యాసం దాగి, పక్షి తన పిల్లలను పొదుముకున్నట్టు నన్ను కూడా డోల్మా తన రెక్కలతో అదిమి పట్టి నట్టు భావన కలిగింది అది తొడుక్కున్నాక…

గట్టిగా తనని హత్తుకున్నాను. తన కంటి చెమ్మ నా మెడకి తగిలింది. అది ఇంకా మనసులో మెదులుతూ ఉంది.

సోమాలి నేను వాంగ్మూ ఇంటికి చేరాక బ్యాగ్లో నేను దాచుకున్న పల్లి పట్టీ ల ఉండలు, నువ్వుల ఉండల ప్యాకేట్స్ తీసి ఇచ్చాను తిను బావుంటాయని.

ఏం ఆలోచిస్తున్నావ్ అంది వాంగ్మూ చిన్నగా నవ్వి ఏమి లేదని తల ఊపాను
తను కూడా లేచి నుంచుంది. పక్క గదిలో ఉగేన్ ఇంక లేవలేదు.
తనని లేపాలని కూడా అనుకోలేదు.
ఇద్దరం రెండు చేతులకి గ్లౌజులు తొడుక్కొని బయటికి నడిచాం.
పక్కనే ఆవాల తోటలోకి చేరుకున్నాం.
చిన్న చిన్న పసుపు రంగుతో కొన్ని వేల లక్షల పూల తో తోట మొత్తం పచ్చని నేలకు పసుపు రంగు తీవాచీ పరిచినట్టు.
ఆకాశం తొంగి చూసి నేలకు దిగి వచ్చినట్లు అప్పుడే మొదలు కాబోతున్న సూర్య కిరణాల వెలుతురుతో మత్తు వదులుకునేందుకు సిద్ధమవుతూ..
చుట్టూ చల్లని గాలులు చెవులని గిలిగింతలు పెడుతూ కూని రాగాలు తీస్తూ ఆ క్షణం అదొక మాయ ప్రపంచం తోచింది…

తరచి చూడాలే గాని ఏకాంతానికి మించిన స్వర్గం కానీ, ప్రయాణానికి మించిన అద్భుతం కానీ జీవితంలో మరోటి ఉంటుందని నేననుకోవటం లేదు.

ప్రయాణమనే విత్తనం వేసాక ఆనందమనే వృక్షానికి, ఆప్యాయతలనే కొమ్మల రెమ్మలతో ఎల్లప్పుడూ నా మనసును జోడించి రెపరెపలాడించుకోగలిగే అదృష్టం నాకు మాత్రమే సొంతమనే ఓ ఆనందపు గర్వంతో ఆ నడకలు సూర్యకిరణాలను వాటేసుకుంటూ సాగాయి.

 

Randhu Mandhati

కథకుడు ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్, ట్రావెలర్. మొబైల్ 9966225666

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article