Idontwantdowry.com: కట్నం వద్దనే వధూవరుల స్వయంవరానికి ఇదే ఆహ్వానం.
కందుకూరి రమేష్ బాబు
‘‘అబ్బే… కట్నం లేనిదే మీ అమ్మాయిని చేసుకోం’’ అనే మాట నుంచి ‘‘కట్నం ఎందుకు లెండి’’, ‘‘కట్నం వద్దు’’ అని చెప్పేటంతగా సమాజం ఆలోచనలో మార్పు రావాలన్న ఆశయంతో ప్రారంభమైన తొలి వివాహవేదిక ‘ఐ డోంట్ వాంట్ డౌరీ డాట్ కాం’. ఈ సంస్థ పదహారవ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి ఒక ఆ నవ్యమైన కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తోంది. అదే కట్నం వద్దనే వధూవరుల స్వయంవరం.
IdontwantDowry.com : పదహారవ ప్రాయం
‘కట్నానికి వ్యతిరేకంగా వధూవరులు వివాహం చేసుకునే ఆదర్శంతో పనిచేస్తున్న ఈ సంస్థ పదిహేనేళ్ళ ప్రయాణంలో తమవంతుగా ఈ దురాచారాన్ని కొంతలో కొంత మార్పుకు పాటు పడటం విశేషం. అయితే ‘ఇప్పటికీ మా అబ్బాయికి ఇంత ఇస్తామని వస్తున్నారండీ’ అనే వాళ్లు ఎక్కువే. కాకపోతే, ‘మేము కట్నం లేకుండా వివాహం చేసుకుంటాం అని ధైర్యంగా చెప్పే పెళ్లి కొడుకులూ, ‘కట్నం తీసుకోని వాళ్లనే చేసుకుంటాం’ అనే పెళ్లికూతుళ్లూ చాలా మంది పెరిగారు. అలాంటి సదాశయం గల వారందరికీ గత పదిహేను సంవత్సరాలుగా ‘IdontwantDowry.com’ అనువైన వేదిక కల్పిస్తూ వస్తోంది. వారి ఆలోచనని, భావాలని ఒకరికొకరికి వినిపించి వివాహబంధంతో ఒక్కటయ్యేలా చేస్తోంది. అలా ఒక్కటైన జంట ఆశీర్వచనాలతో, స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మరోమారు ‘స్వయంవరం’ కొనసాగించాలని ఆ సంస్థ నిర్ణయించింది.
ఒక్కటైన అరవై జంటలు
అన్నట్టు తమ సంస్థ స్థాపించిన నాటినుంచి అధికారికంగా అరవై జంటలు ఒక్కటయ్యయని దీని వ్యవస్థాపకులు సత్య నరేష్ తెలుపుతో చెప్పారు.
కట్నం తీసుకోకూడదన్న ఆశయం గల చాలామంది వ్యక్తులను ఒకటి చేయాలని ఈ సంస్థ కృషి వినూత్నమైనది. ఇప్పటిదాకా వంద జంటలను కలిపినప్పటికీ తమకు తెలియజేసిన వాళ్ళు దాదాపు అరవై జంటలు ఉన్నట్టు వారు అన్నారు. కాగా, తమ ప్రయాణంలో పద్నాలుగు మార్లు స్వయంవరం నిర్వహించమని, కరోనా కారణంగా గత ఏడు ఆన్ లైన్ లో నిర్వహించమని, ఈ ఏడాది కూడా అలాగే జరపబోతున్నామని వారు తెలిపారు.
ఈ నెల డిసెంబర్ 19వ ‘స్వయంవరం’
ఈ నెల డిసెంబర్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ఈసారి ఆన్‌లైన్ వేదికగా పదహారవ స్వయంవరం వివాహ వేదిక నిర్వహిస్తున్నట్టు సత్య నరేష్ వివరించారు.
“అబ్బాయిలూ… మీది కట్నం తీసుకోకుండా వివాహం చేసుకునే వ్యక్తిత్వం అయితే స్వయంవరంకు ఇదే మా ఆహ్వానం. అలాగే అమ్మాయిలూ… కట్నంతో అబ్బాయిని కొనుక్కోవటం నాన్సెన్్స అని నమ్మితే మీరూ రండి…” అని వారు సాదరంగా పిలుపునిస్తున్నారు. ఒక చక్కటి ఆదర్శం ఆచరణలోకి తీసుకురావడానికి, సరైన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించడానికి ఆసక్తి ఉన్న వారు ఈ స్వయంవరం కార్యక్రమకోసం రిజిస్టర్ చేసుకొని పాల్గొనవచ్చుని వారు తెలిపారు.
వివరాలకు…
మరిన్ని వివరాలకు www.IdontwantDowry.com ని చూడవచ్చు లేదా 98858 10100 నెంబర్‌కి ఫోన్ చెయవచ్చు. సంస్థ చిరునామా: NKGONLNE,115B,VENGALARAO NAGAR,HYDERABAD 500 038.