పరిమళము పంచు సుమములు
విరివనముల ధవళ వర్ణ విలసిత సుమముల్
సరిసరి మగువలు యలకల
మురిపించెడి మారు కోల ములుకులు మల్లెల్
నాగమంజరి గుమ్మా
మల్లెలు తోటకు, ఇంటి ముంగిటకి, స్త్రీల జడకు అందాన్నిచ్చే తెల్లని పూవులు.
స్త్రీలు అలిగినపుడు వారికి మల్లెలు ఇస్తే అలక వీడుతారనడం పరిపాటి. మన్మథుని పంచబాణాలలో ఒకటి నవమల్లికం.
మల్లెలను నీటిలో వేసి ఆ పరిమళ నీటితో స్నానం చేస్తే శారీరక అలసట దూరమవుతుందట
ఎండిన మల్లెలను కొబ్బరి నూనెలో వేసి మరగకాచి, ఆ నూనెను మాడునకు పట్టిస్తే చుండ్రు తగ్గి, జుట్టు కాంతులీనుతుందట.
గులాబీ రేకులతో మల్లెలు కలిపి ముద్దచేసి ముఖానికి pack వేయవచ్చునట.
అలసిన కళ్లపై మల్లెలు ఉంచితే అలసట మాయమవుతుందట.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.