చెన్నంగి యనెడి పేరిట
చిన్నారి పొద కసివింద క్షేమము లడిగెన్
సన్నని యాకులు పూవులు
మిన్నగ రోగముల తరిమి మేలును గూర్చున్
నాగమంజరి గుమ్మా
బాట పక్కన కనిపించే చిన్న మొక్క లేదా పొద ఈ కసివింద. దీనినే కసింద, చెన్నంగి అనికూడా అంటారు. కాఫీ సెన్న, నిగ్రో కాఫీ అని పిలుస్తారు. ఇది పసుపు పచ్చని పూలతో తంగేడులా కనిపిస్తుంది. కనుక నేల తంగేడు అని కూడా పిలుస్తారు. వీటికి గుత్తి చిక్కుడు కాయల వంటి కాయలు ఉంటాయి.
చెన్నంగి ఆకు గ్రామీణ వైద్యానికి పెట్టింది పేరు. దీని ఆకును పొడి చేసుకొని ఎంతోమంది వాడుతారు. ఇది నాడీ నొప్పులను తగ్గిస్తుంది. పైపూతగా, నోటి మందుగా కూడా ఉపయోగపడుతుంది. అజీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలున్నప్పుడు ఉపశమనం కోసం తింటారు. కడుపులో ఇన్‌ఫెక్షన్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
కసింద విత్తనములు, ఆకులు, బెరడు ( కాండములో వుండే) ఆయుర్వేదిక్ మందుల తయారీలో వాడుతున్నారు. మలేరియా, కాలేయ రుగ్మతలను నయం చేయడానికి, చెడు బాక్టీరియాను నిర్ములించడానికి, రోగనిరోధక శక్తిని శరీరం లో పెంచడానికి, దగ్గు, మూర్ఛల వంటి మందుల లాంటివి చేయడానికి వాడుతున్నారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.