నవ్వోకసారి ఈ ప్రపంచాన్ని శుభ్రం చేసి వెళ్ళావు
ఇప్పుడది మళ్ళీ పాపపంకిలమై పోయింది
నీ వల్ల పరీమళ భరితం అయిన మానవ సమాజం
ఇవాళ దుర్భర దుస్సహ దుర్గంధ భూయిష్టమై
కుళ్ళీ కంపుగొడుతున్నది
తెల్లవారితే చాలు పైకం శరణం గచ్ఛామి
పొద్దు గ్రుంకితే సరి మైకం శరణం గచ్ఛామి
అహర్నిశలూ యిక స్వార్ధం శరణం గచ్ఛామి
ఇప్పుడు త్రిశరణాలంటే యివే మరి!
మేమెంతో అద్బుతంగా త్రిపిటకాలను
గంపల కింద కమ్మేశాం ఎవరికీ కనబడకుండా
నువ్వు బోధించిన ప్రేమ స్థానంలో
మూడు అత్యాచారాలూ, ఆరు హత్యాచారాలతో
కామం నెలకొన్నది
దయార్ర్ధ హృదయుడివై నువ్వు మాకు చెప్పిన
కరుణను నిష్కారణంగా తరిమికొట్టాం
మైత్రిని చిత్రవధ చేశాం
మహా మహా చతురులమై
నీ చతురార్య సత్యాలను లెఖ్భే చేయడం లేదు
నువ్వు ప్రపంచానికి ప్రవచించిన
పంచశీలకు ఐదా, ఆరా
అసంఖ్యాకమైన సీలలు దిగ్గొట్టాం
నీకు సాష్టాంగ పడుతూనే
నీ ఆర్య అష్టాంగ మార్గాన్ని కాష్ఠానికి ఎక్కించాం
మాకు అహింస అప్రియం
భూతదయ అయిష్టం
మేం కుశల కర్మలు చేయం
అకుశల కర్మలే నేస్తం మాకు
మా సంస్కారాలు మాతోనే సహజీవిస్తాయి
మాకు చూపే లేదు
ఇంక విపస్సన ఎక్కడిది?
ఆనాపాన సతి కన్న
ఖానాపీనా వసతి మాకిష్టం
మాకు దానశీలాది పారమితలు కల్గవు
ఇంక నిర్వాణమెక్కడిది?
ఉన్నదల్లా నిర్యాణమే!
తథాగతా!
నువ్వు చెప్పే శీలానికి సిలువ వేశాం
ప్రజ్ఞను అవజ్ఞ చేశాం
సమాధిని సమాప్తం కావించాం
ధర్మకాంతులతో కళకళలాడిన
ఆనాటి జేతవనం లేదిక్కడ
ఇప్పుడన్నీ ఈతవనాలూ, తాటివనాలే!
నువ్వు తృష్ణారహితంగా వుండమంటే
మా కోరిక లీరికలెత్తి గుర్రాలవుతాయి
భగవాన్!
నీ సద్ధర్మ ప్రవచనధారామృతావసరం
ఇప్పుడే ఎక్కువ
బుద్ధా!
ఈ ప్రబుద్ధుల్ని మార్చడానికి నువ్వురావాలి.
మరొక్కమారు నీ బోధలు విన్పించడానికి
మళ్ళీ ఈ పుణ్యరహిత లోకాన్ని పుటం పెట్టడానికి
ఈ సంక్షుభిత సంఘాన్ని బాజాప్త తేజాబ్‌లో ముంచడానికి
ఈ కఠిన హృదయాలలో కరుణ నింపడానికి
తరలి రా!
త్వరగ రా!!
మరల రా!!!
కదలి రా!!!!
అత్యంత సహజమైన పదాలతో నేటి సజీవ జీవన వైరుద్యాలను ఆవిష్కరించారు.
అత్యంత వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరించారు.