పదిహేను నెలలుగా ఉక్కు సంకల్పంతో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు మోడీ ప్రకటిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా, ఎవరూ కనీస మాత్రంగా ఊహించని ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం త్వరలో సమీపిస్తున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలే అని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలపై రైతన్నలు పదిహేను మాసాలకు పైగా ఆందోళన చేస్తున్నారు. నిద్రహారాలు మాని, కుటుంబాలను వదిలి, ఢిల్లీ సరిహధ్దులు, ఇతర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని మరీ నిరసనలు చేపట్టారు. ఎట్టకేలకు రైతులు తమ పోరాటంలో విజయం సాధించారు. ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని గురునానక్ జయంతి సందర్భంగా ప్రకటించారు.
“కేంద్రం మెడలు వంచుతాం…చట్టాలను రద్దు చేసే వరకు తాము ఇళ్లకు వెళ్లబోమని రైతులు శపథాలు చేశారు. ఈ ఆందోళనలు, నిరసనలను కేంద్ర సర్కార్ నిన్నటిదాకా ఏమాత్రం పట్టించుకోలేదు. దాదాపు ఆరు వందల మంది చనిపోయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. అకస్మాత్తుగా నేడు, గురు నానక్ జయంతి సందర్భంగా మోదీ సర్కార్ రైతుల ఆందోళనలకు దిగొచ్చింది. చట్టాలు రద్దు చేస్తామని, ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుల్ని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ఇక రైతులు ఇంటికి వెళ్లి పండుగ చేసుకోవాలని కూడా మోడీ కోరారు.
ఐతే, ప్రధాని మోడీ ప్రకటనపై రైతు సంఘాలు స్పందిస్తూ వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని చేసిన ప్రకటనను తాము పూర్తిగా నమ్మడం లేదంటూ, రైతు చట్టాలు రద్దయ్యాకే తాము ఇళ్లకు వెళ్తామని ప్రకటించడం విశేషం.
ఎన్నికల స్టంట్ !
పంజాబ్, యూపీలో ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారని, ప్రస్తుతానికి రైతు ఆందోళనలు విరమింపచేసి తద్వారా ఎన్నికల్లో లబ్దికి బీజేపీ ప్రయత్నిస్తోందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుల రద్దును ఆమోదించిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలని అప్పటి వరకూ నిరసనలు కొనసాగించాలని రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికిప్పుడు వెనక్కి వెళ్ళే యోచనలో లేమని రాకేష్ తికాయత్ చేసిన ప్రకటన ఇందులో భాగమేనని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఎవరూ కనీస మాత్రంగా ఊహించని నిర్ణయం తీసుకోవడానికి కారణం త్వరలో సమీపిస్తున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలే అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, కేంద్రం ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి గతేడాది తొలుత మూడు ఆర్డినెన్సులను, తర్వాత వాటి స్థానంలో బిల్లులను తెచ్చిన సంగతి తెలిసిందే. అవి పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలుగా మారాయి. 2020 సెప్టెంబర్ 15వ తేదీన ఒక బిల్లు, 17వ తేదీన మిగతా రెండు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి. వీటిని వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్ర పక్షం, ఎన్డీయే కూటమిలోని పార్టీ శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ అప్పుడే తన పదవికి రాజీనామా చేశారు.
ఆ మూడు బిల్లులు ఇవే…
1) నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్ 2020).
2) ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు’ (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్.
3) ‘రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ – 2020)
ఈ మూడు బిల్లులకు ప్రభుత్వం ఉపసంహరించుకుంది.