‘నిజం’ పేరుతో అక్షరాలా ఆగ్రహాన్ని ఆవేదనను కత్తిలా జులిపించే సీనియర్ సంపాదకుల తాజా వ్యాఖ్య, ఈ విరామ చిహ్నం.
శ్రీరామ మూర్తి
ఒకవైపు ఒదిగి పడుకుంటానా, జోడించిన చేతులకు చెంపలానించి శ్వాస తగిలేలా చూసుకుంటానా, ఎంత భద్రంగా ఉంటుందో, ప్రాణాన్ని చేతులు పదిలంగా కాపాడుతున్నట్టనిపిస్తుంది, వాటి రక్షణలోనే ఆరిపోయే దీపం ఒక్క ఎల్ ఐ సి దే కాదు, నడిచేటప్పుడు ముందున్న దారి, ఇంకా చాలా దూరముందిలే ఇప్పుడే మునగవని భరోసా ఇస్తుంది, వేసే ఒక్కొక్క అడుగు కిందా వేచి ఉంటుంది కాటేసే నాగు, తప్పించుకొంటూ సాగేదే నడక, ప్రతి ఒక్కరూ మారతాన్లు అభ్యాసం చేయక తప్పదు, మాయలపకీర్ల వద్ద సాష్టాంగాలు నేర్చుకోక వేరే మార్గం లేదు, నన్ను చూడగానే ఈత చెట్టు మీద కూచున్న పిట్ట రివ్వున ఎగిరిపోతుంది, నా చూపు దానిని వెన్నాడిన మేర గాలి తునకలమీద రాసి పంపిస్తుంది తానొచ్చేవరకు వేచివుండమని చెబుతూ, ఎప్పటికీ రాదు,దానికి నా మీద ఎంత ప్రేమో! తెల్లారక ముందే డ్రాప్ బాక్స్ లో పడే పాల ప్యాకెట్ ఎన్ని దూడల అంబాలను వినిపిస్తుందో, ఎంతమంది మాతల వక్షోజాలువారులో అవి, తమ్ముమాలి మనకు తీపివిందులు చేస్తున్న ఆ నెలల బాలలకు ఏమిస్తే తీరుతుంది? పవిత్ర గంగాపూర సమానమైన ఆవుపాల పొదుగుకు తనయులెప్పుడూ దూరమే, ఒక్కొక్క సిరం లోంచి అది స్రవించే వాహిని అధికార వటపత్ర శాయి అవుతుంది, మీసం మొలిచీమొలవని యుపి బీహార్ల కుర్రాళ్ల చెవి దగ్గర రోజుకోసారి స్మార్ట్ గా మోగే పలుకులు వందల మైళ్ల సన్నాయిలను ఎంత శ్రావ్యంగా శృతి చేస్తాయో తల్లిదండ్రుల చుంబన నాట్యాలను నుదిటిమీద ఎంతగా రక్తికట్టిస్తాయో, వర్తమాన దేశ నిర్మాతలు వారేనని గతేడాది వారి పాదాల కింద మడుగులుకట్టిన రక్తాన్ని తాగిన రోడ్లు అదేపనిగా కీర్తిగానం చేస్తాయి, ఎందరి ప్రాణ ధారల తాళ్లు పేని, వేసి లాగితే రాలిన అమృత ఫలమో, దానిని రుచి చూడ్డానికి ఏడు దశాబ్దాలకు మించి సాగుతున్న క్యూలో వంద, పది కోట్ల మందికి పైగా ఉన్నారు, ఇంతలోనే అదికాదు ఇదంటూ ఏడేళ్ళ విషభాండాన్ని, దానిలోంచి అక్షయంగా పెల్లుబుకుతున్న ‘కా’లు, ఉపాలు, ఎన్ ఆర్ సి ల మాదిరి చీలు నాలుకలను, అనంత, అకాల కొవిడ్ రెండో అల మరణాలను,స్వేచ్ఛల సమాధులను ప్రసాదిస్తున్న కాలానికి పాడే చరమ గీతాల చుట్టూ బిగుస్తున్న ఉరితాళ్లకు ఎదురేగే జీవితాల్లో చావెప్పుడూ అజరామరం, చిరకాలంగా తోడు లేకుండా మౌనంగా కొట్లాడే ఊపిరి పోతూ పోతూ నింపుతుంది కోటానుకోట్ల ఆక్సిజన్ సిలిండర్లను, మరణమొక విరామ చిహ్నమే గాని ఫుల్ స్టాప్ కాదు.
“మరణమొక విరామ చిహ్నమే గాని ఫుల్ స్టాప్ కాదు”