Editorial

Sunday, November 24, 2024
సంపాద‌కీయంకేసిఆర్ : UNSTOPPABLE

కేసిఆర్ : UNSTOPPABLE

హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం మొదటిసారిగా నిన్న ప్రెస్ ముందుకు వచ్చిన కేసీఆర్ మళ్ళీ ఈ రోజు కూడా ప్రగతి భవన్ నుంచి లైవ్ పెట్టి వరి పంట విషయంలో యుద్ధ పంథాలో బిజెపి వైఖరిని ఎండగట్టారు.

ఒక వంక బండి సంజయ్ సమాధానలేమిని గట్టిగా ఎద్దేవా చేస్తూ అత్యంత కీలకమైన అంశాలపై విస్పష్టంగా తన వైఖరి ప్రకటించడం విశేషం.  తాను మారనని, ఇదే పంథాలో నడవడానికి ఇక ముందు  తనకు ఎదురులేదు (UNSTOPPABLE ) అన్నట్టు వ్యవహరించడమూ గమనార్హం.

కందుకూరి రమేష్ బాబు

ఇటీవల మొదలైన బాలకృష్ణ రియాలిటీ షో కన్నా కేసిఆర్ ప్రెస్ మీట్ లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. విజ్ఞానానికి విజ్ఞానం. వినోదానికి వినోదం, విమర్శలకు విమర్శలు. అదే సమయంలో ఒకింత సంక్షోభం ఎదురైన ఈ సమయంలో కూడా వారు రాజకీయంగా విస్పష్టమైన వైఖరిని తేట తెల్లం చేస్తూ UNSTOPPABLEగా ముందుకు పోతుండటం మరో విశేషం. ఒక రకంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల గెలుపు ఆయన్ని అసహనానికి గురిచేసినప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలే తనని ఇలా మొహరింప జేస్తున్నట్లు పేర్కొంటూ మొత్తానికి కోల్పోయిన ప్రతిష్టను పునరుద్దరించుకోవడంలో కేసీఆర్ అడుగులు రసవత్తరంగా ఉన్నాయ్. ఈ అడుగులు కేవలం ప్రదర్శన కాకూడదని కోరుకుంటూ తెలుపు సంపాదకీయం

నిన్నటి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కు ప్రతిస్పందిస్తూ ఈ ఉదయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన నేపథ్యంలో తిరిగి ఈ సాయంత్రం రెండో రోజు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం విశేషం.

విశేషం ఏమిటంటే, నేటి ప్రెస్ మీట్లో తన రాజకీయ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన దళిత ముఖ్యమంత్రి అంశమూ ప్రస్తావనకు తెచ్చారు. అంతేకాదు, ఉద్యమ కారులను కాదని వేరే పార్టీ వారిని పార్టీలోకి చేర్చుకొని, వారికి మంత్రి పదవులివ్వడాన్ని కూడా గట్టిగ సమర్థించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వరి అంశం ఆధారంగా  చేసుకుని తనకు ఎదురులేని విధంగా కేసిఆర్ అటు పార్టీపై ఇటు  ప్రభుత్వంపై పట్టు బిగిస్తూ రానున్న రోజుల్లో బలపడనున్న బిజెపికి గట్టి సవాల్ విసురుతూ తన వ్యూహాన్ని సాన బెడుతున్నారు. రేపు కూడా ప్రెస్ మీట్ ఉంటుందని, శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బిజెపికి వ్యతిరేకంగా అందోళనా కార్యక్రమం తీసుకోబోతున్నట్టు కూడా ప్రకటించారు.

బండి సంజయ్ పై విరుచుకుపడ్డ కేసీఆర్

నిన్న వరి కొనుగోలు విషయంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం స్పష్టం చేయాలని తాను డిమాండ్ చేసినప్పటికీ ఆ విషయం బండి సంజయ్ ఎత్తకపోవడాన్ని కేసిఆర్ నిశితంగా ప్రశ్నించారు. “వడ్ల విషయం తప్ప పనికిరాని అంశాలన్నీ మాట్లాడాడు” అంటూ ఎండగట్టారు. పెట్రోల్ డిజిల్ లపై పెంచిన సెస్ ను విత్ డ్రా చేయడం గురించి మరోసారి డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలకు సరైన సమాధానం చెప్పని బండి సంజయ్ ని తీవ్రంగా ప్రశ్నిస్తూ వ్యక్తిగత దూషణలు మానాలని, అనవసరమైన ముచ్చట్లు చెప్పొద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరో మూడు కీలక అంశాలపై మొదటిసారి పెదవి విప్పడం అన్నిటికన్నా విశేషం.

1. దళిత ముఖ్యమంత్రి అన్న అంశం

“దళిత ముఖ్యమంత్రిని చేయలేదు. నిజమే. కానీ తర్వాత ఎన్నికలకు వెళ్లి గెలిచాము కదా” అన్నారు. “ఎన్నికల్లో అంతకుముందు కన్నా ఎక్కువవ సీట్లే గెలుచుకున్నం కదా” అని కూడా ఆయన నొక్కి చెప్పారు. “దళిత ముఖ్యమంత్రిని చేయకపోవడానికి కారణాలున్నాయి” అంటూనే,  అయితే, షబ్బీర్ అలీ కూడా వద్దన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక ఈ అంశం పసలేనిదన్నట్టు పేర్కొనడం విశేషం. ఎన్నికలకు వెళ్లి అత్యధిక సీట్లను పొందాం కనుక దళిత ముఖ్యమంత్రి అన్న నాటి పాత హామీకి ఇక నుంచి ఎటువంటి ప్రాధాన్యం లేదని, ఇక ఆ పసలేని మాట ఎవరు ఎత్తినా అది వృధా అన్న ధోరణిలో కేసీఆర్ విస్పష్టంగా సమాధానం ఇవ్వడం విశేషం.

2. ఉద్యమకారులకు ‘కూడా’ ప్రాధాన్యం …

రాష్ట్రం ఏర్పడిన వెంటనే తాను మాట్లాడుతూ ఇక నుంచి తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అని అప్పుడే చెప్పానన్న సంగతిని గుర్తొ చేస్తూ నాటి నుంచే తమ పంథా మారిందని, అందుకే ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించడమే గాక వారి సామర్థ్యాన్ని బట్టి మంత్రి పదవులు ఇచ్చి వారి సేవలు తీసుకుంటున్నామని అన్నారు. “ఇందులో తప్పేముంది?” అంటూ సమర్థించుకున్నారు. అంతేకాదు, ఒక రాజకీయ పార్టీగా టీఆర్ ఎస్ విస్తృతం కావడానికి కావాల్సిన విధానం అవలంభించడం తప్పేట్లా అవుతుందని కూడా ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు, “ఉద్యమ కారులకు కూడా కొందరికి ప్రాధాన్యం ఇస్తాం” అంటూ సమయం, సందర్భం ఉన్న చోట వారిని కూడా గుర్తించి తగు విధంగా పార్టీని సమన్వయం చేసుకుందని, అలా అవసరమైన సమయంలో ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. ఈ మాటల్లో ఉద్యమ కారులకు ‘కూడా’ అన్న మాట నోట్ చేసుకోవాలి.

3. అది వ్యవసాయ క్షేత్రం

ఫాం హౌజ్ లో ఉండటం అన్నది తప్పేలా అవుతుందని, “అది నా నియోజకవర్గంలో నేను నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రమని, భాజప్తా అక్కడ ఇల్లు కట్టుకొని తానూ తన కొడుకూ వ్యవసాయం చేసుకుంటున్నా”మని కేసిఆర్ అన్నారు. ‘ట్రాక్టర్లతో ఫాం హౌజ్ దున్నుతా’ అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను తూర్పార పడుతూ “నువ్వేమైన ట్రాక్టర్ డ్రైవర్ వా?” అని ఎద్దేవా చేస్తూ, తాను దేనికీ భయపడనని, తామేమైన భూములు అక్రమిస్తున్నమా? అని అన్నారు.

బండి సంజయ్ పై కేసీఆర్ ఈటెల

రకరకాలుగా బండి సంజయ్ మాట్లాడటం సరికాదని, ముందు వరి విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించాలని, అలాగే పెంచిన డిజిల్ పెట్రోల్ ధరల విషయంలో సెస్ విత్ డ్రా చేసుకోవాలని కేసిఆర్ డిమాండ్ చేస్తూ ఇక నుంచి యుద్ద పంథాలో తాము బిజెపిని కట్టడి చేస్తామని మరోసారి హెచ్చరించారు.

రేపు కూడా ప్రెస్ మీట్ ఉంటుందని, అవసరమైతే విలేకరులకు లంచ్ కూడా ఇకనుంచి ఇక్కడే పెడతా మని అయన అంటూ శుక్రవారం రోజున నియోజకవర్గాల్లో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా వరి విషయంలో ఆందోళన చేయబోతున్నామని కూడా అయన ప్రకటించడం కొసమెరుపు.

బిజెపికి ఉరిగ మారనున్న వరి

మొత్తం మీద ఈటెల గెలుపు కేసేఆర్ ని తీవ్రంగా ప్రభావితం చేయడం, దాన్నుంచి బయటపడెందుకు బండి సంజయ్ వ్యాఖలు ఉపకరించడం, అదే సమయంలో కామారెడ్డిలో వరి కుప్పపై మరణించిన రైతు మరణం నుంచి ప్రజల దృష్టిని ఏకంగా బిజెపిపై పోరాటానికి వీలుగా మలుపడంలో కేసిఆర్ పక్కా  వ్యూహాత్మకంగా వెలుతున్నట్టే ఉంది. ఈ వైఖరి దీర్ఘకాలికంగా అనుసరిస్తే మటుకు మంచిదన్న భావం అత్యధిక ప్రజల్లో ఉన్నది. మరి, చూడాలి.

ఉల్లాసంగా ‘ట్రబుల్ షూటర్’

కాగా, నేటి ప్రెస్ మీట్లో తనకు ఇరువైపులా ఆర్ధిక మంత్రి హరీష్ రావ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన రెడ్డి కూచోగా నిన్నటిదాకా ట్రబుల్ షూటర్ గా వ్యవహరించిన హరేశ్ రావు పక్కనే ఉండి కేసిఆర్ ప్రసంగిస్తున్న సమయంలో మాటలు అందించడం కూడా మరో విశేషం.

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article