నవంబర్ 7వ తారీఖు
క్రీ.శ.1291 నవంబర్ 7వ తారీఖున కాకతీయ కుమార రుద్ర దేవ మహారాజులకు పుణ్యంగా రాయ సకల సేనాధిపతి సోమయాదులు జువులకంటి మూలస్థానం భీమనాథదేవరకు 2 పుట్ల రేగడి భూమిని, తాంటితోపును యిచ్చినట్లుగా గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలో జూలకల్లు శాసనం చెబుతోంది.
అట్లే 1524 నవంబర్ 7న తిరుమల దేవమహా రాయలు రాజ్యం చేస్తుండగా వాకిటి ఆదెపు నాయనింగారి కార్యకర్తలు గోరంట్ల పెరుమాళ్ళ దశమి సేవలకు, నైవేద్యాలకు వారి తండ్రి రామ నరుసుం గారికి పుణ్యంగా అనేక దానాలు చేశాడు. చారిత్రకంగా యిది ప్రముఖమైన శాసనం. శాసన కాలం 1524. శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం.
శాసనంలో చెప్పబడ్డ తిరుమల దేవమహా రాయలు కృష్ణదేవరాయల కుమారుడు. దీనిద్వారా తిరుమల దేవ మహారాయలు స్వల్ప కాలం స్వతంత్రుడుగా పాలన చేశాడని చెప్పవచ్చు. 1565 లో ఆళియ రామరాయలి మనవడు యిదే తారీఖున ‘‘ఘనగిరి’’ నుండి దానాలు చేసినట్టుగా చెప్పబడ్డది. ఘనగిరి అంటే పెనుగొండ. నాటి అనేక శాసనాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.