Editorial

Sunday, November 24, 2024
కథనాలుఎంతో గొప్ప గాడిద : మాడభూషి శ్రీధర్ తెలుపు

ఎంతో గొప్ప గాడిద : మాడభూషి శ్రీధర్ తెలుపు

ఆ ‘గాడిద’ వీర చక్ర, ‘వారి’కి గౌరవ వందనం

గాడిదలు మనుషుల కన్నా చాలా గొప్పవని ఈ కథ వంటి వాస్తవికత చదివితే అర్థమవుతుంది. ఒకప్పుడు గాడిద కొడకా అని తిడితే పెద్ద తిట్టయ్యేది. కాని ఇప్పుడు నానా బూతులు దారుణంగా తిట్టుకుంటున్నారు. ఏమైనా ఇప్పటి కాలంలో దారి తప్పిన మనుషులను గాడిదలతో కుక్కలతో పోల్చడం న్యాయం కాదు.

మాడభూషి శ్రీధర్

1971 భారతదేశం పాకిస్తాన్ తో యుద్దం చేస్తున్నదశ. భారతీయ సైనికుల ఆయుధాలను, ఇతర సామగ్రి మోస్తూ పోతూ ఉండగా పెడొంగిని పాకిస్తాన్ సైనికులు పట్టుకున్నారు. అక్కడ కూడా ఈ పెడొంగితో ఆయుధాలు సామాన్లు మోయించారు. కాని పెడొంగి తన మాతృదేశాన్ని మరిచిపోలేదు. పక్షం రోజుల్లో పాకిస్తాన్ సైనికుల కళ్లు గప్పి భారతదేశానికి చేరుకుంది. దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం నడిచింది. అదీ మూపున మీడియం మెషీన్ గన్, ఇతర ఆయుధ సామగ్రి మూట మోస్తూ. తను ఇదివరకు పనిచేసిన యూనిట్ కు నడిచి చేరుకున్నది. పూర్తిగా అలసిపోయిన పెడొంగిని చూసి భారతీయ సైనికులు చాలా ఆనందించారు. పెడొంగిని ప్రేమగా ఆదరించారు. రాష్ట్రపతి వీర చక్ర బిరుదు ఇచ్చి గౌరవించారు.

ఇంతకూ ఈ పెడొంగి ఎవరు? పెడొంగి ఒక గాడిద. ఇది తిట్టుకాదు. అది నిజంగా నాలుక్కాళ్ల గాడిద.

యుద్ధంలేని శాంతి సమయాల్లో కూడా ఈ జంతువుల సేవ గొప్పది. ఎక్కడో దూరాన ఉన్న సైనిక శిబిరాలకు సరుకులు తరలిస్తాయి.

అది స్పానిష్ జాతికి చెందిన గాడిద గారు. 1962 భారతీయ సైన్యంలో చేరినపుడు దాన్నిహూఫ్ నెంబర్ 15328 అని పిలిచే వారు. సైనిక సేవా శాఖలో జంతు రవాణా విభాగంలో చేరింది. ఆయుధాలు మందుగుండి సామగ్రి, ఇతర పరికరాలను మూపున మోస్తూ సైనికుల వెంట తిరగడం ఈ గాడిద గార్ల పని. ఎవరైనా గాయపడినా చనిపోయినా కూడా హాస్పటల్ కు మోసుకుపోయేది గాడిదగార్లే. కొన్ని నేలల్లో నడవడానికి కూడా సాధ్యం కాదు. కాని అక్కడ గాడిద గారలు నడవగలుగుతాయి. యుద్ధంలేని శాంతి సమయాల్లో కూడా ఈ జంతువుల సేవ గొప్పది. ఎక్కడో దూరాన ఉన్న సైనిక శిబిరాలకు సరుకులు తరలిస్తాయి. చలికాలంలో మంచు కురుస్తున్న దశలో ఏ వాహనాలు నడవలేని నేలల్లో కూడా ఈ గాడిద గారలు చేసే సేవలు మరవలేనివి.

1987నాటికి ఈ పెడొంగి గారి వయసు 29 సంవత్సరాలు. ఎటి కంపనీ ఏ ఎస్ సి లో దీనికి పనులు చెబుతున్నారు. అక్కడ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ చున్నిలాల్ శర్మ ఈ గాడిదగారి సేవలను గురించి విని గుర్తించారు. పాకిస్తాన్ నుంచి తప్పించుకుని మనదేశానికి పాకిస్తాన్ ఆయుధాల మూటలతో సహా రావడం చూసి మురిసి పోయారు. సాధారణంగా 18 నుంచి 20 సంవత్సరాల కన్న ఎక్కువ కాలం ఇవి సేవలకు అందించడం కష్టం. కాని ఆశ్చర్యకరంగా పెడొంగి గారు పెద్ద వయసులో కూడా 17 వేల అడుగుల ఎత్తున కూడా గాడిద చాకిరీ చేయడానికి సిద్ధంగా ఉత్సాహంగా ఉంది.

మస్కట్ 53

గాడిద గారి పేరుతో లాంజ్ సాహస యోధురాలని దానికి సన్మాన పత్రం రాసిచ్చారు. డిల్లీ లోని ఆర్మీ సర్వీస్ కాంప్ లో కొత్త లాంజ్ కు మౌంటేన్ ఆర్టిలరీలో మ్యూల్ పెడొంగి పేరు పెట్టారు. పెడొంగిని ఎ ఎస్ సి లో మస్కట్ 53 గా నియమించారు. 1989లో గ్రీటింగ్ కార్డు మీద పెడొంగి చిత్రాన్ని ముద్రించారు. తరువాత పెడొంగిని బరేలి పచ్చిక బయళ్లకు తరలించి, ఇష్టం వచ్చినంత గడ్డి మేస్తూ చివరి దశ ప్రశాంతంగా గడపడానికి వీలు కల్పించారు. అక్కడి సైనికులు దీని చరిత్ర తెలిసి చాలా ప్రేమగా చూసుకున్నారు.

మఖ్మల్ రగ్గు వీరచక్ర

1992లో ప్రత్యేకంగా పెడొంగిని డిల్లీకి తీసుకువెళ్లి 223 కోర్ డే ఫంక్షన్ లో నీలి మఖ్మల్ రగ్గు కప్పి సత్కరించారు. రాష్ట్రపతి వీర చక్ర మెడల్ ఇచ్చారు.

గిన్నీస్ రికార్డు

ఉత్తర సిక్కింలోని ఒక యుద్ధ భూమి పేరు పెడొంగి. ఆ పేరును ఈ గాడిదగారికి పెట్టారు. అంతేకాదు ఈ గాడిద గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. సుదీర్ఘ కాలం మ్యూల్ గా పనిచేసిన గాడిదగా ఆ గౌరవం పెడొంగికి దక్కింది. చివరకు మార్చి 25, 1998లో పెడంగి ప్రశాంతంగా కన్ను మూసింది.

కార్గిల్ యుద్దానికి ముందు కాలంలో ఈ జంతు రవాణా విభాగాన్ని రద్దు చేద్దామనుకున్నారు. ఏ వాహనమూ తిరగడం సాధ్యం కాని ప్రాంతాలలో పర్వత సానువుల్లో ఈ గాడిద గౌరవనీయమైన సేవలు చేస్తున్నాయని గమనించి రద్దు ఆలోచన మానుకున్నారు.

కార్గిల్ యుద్దానికి ముందు కాలంలో ఈ జంతు రవాణా విభాగాన్ని రద్దు చేద్దామనుకున్నారు. కాని కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఒకవైపు పాకిస్తాన్ ఫిరంగులు పిడుగులు కురిపిస్తున్నా, చలించకుండా నిబ్బరంగా ఈ గాడిదలే సరుకులు మోసాయి. ఆయుధాలు తెచ్చియిచ్చాయి. గాయపడిని సైనికులను హాస్పటల్ కు తరలించాయి. నేలమీద గాడిద కాళ్లు గట్టి ఆనుతాయి. ఏ వాహనమూ తిరగడం సాధ్యం కాని ప్రాంతాలలో పర్వత సానువుల్లో ఈ గాడిద గౌరవనీయమైన సేవలు చేస్తున్నాయని గమనించి రద్దు ఆలోచన మానుకున్నారు.

తాజా కలం

ఒక మిత్రుడు ఫేస్బుక్ లో మంచి విషయం ఇచ్చాడు. ఫోటోతో సహా. కాని చివరకు మతద్వేష వాక్యాలతో దాన్ని కలుషితం చేసాడు. గాడిదలు మనుషుల కన్నా చాలా గొప్పవని ఈ కథ వంటి వాస్తవికత చదివితే అర్థమవుతుంది. ఒకప్పుడు గాడిద కొడకా అని తిడితే పెద్ద తిట్టయ్యేది. కాని ఇప్పుడు నానా బూతులు దారుణంగా తిట్టుకుంటున్నారు. ఇందులో గొప్పదనం ఏమిటంటే గాడిదలను తిట్టడం ఆపడమే. చాలా సంతోషం. ఒకరిని గాడిద కొడకా అని తిడితే ఒక కవి వ్యంగ్యంగా వీడా నాకొడుకటంచు గాడిద వల వల ఏడ్చెన్ అంటాడు. కనుక ఇప్పటి కాలంలో దారి తప్పిన మనుషులను గాడిదలతో కుక్కలతో పోల్చడం న్యాయం కాదు.

* మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార శాఖ పూర్వ కమిషనర్‌. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆనంద్ మహీంద్ర యూనివర్సిటీ న్యాయ విశ్వ విద్యాలయానికి డీన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article