చూస్తుండగానే, దశమి సమీపిస్తుంది. మానవుడు కనుమరుగై మహోన్నతమైన దుర్గామాత ప్రత్యక్షమౌతుంది. వందనం మనిషి! జగమంత విస్తరించే కడుపేద మనిషీ నీకు దశమి వందనం!!
కందుకూరి రమేష్ బాబు
కన్నంటుకోని నగరం కోల్ కొత్తా. అలుపు సొలుపూ లేని జనారణ్యం కోల్ కొత్తా. ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు రఘురాయ్ మాటల్లోనైతే ‘అది ఎప్పుడు మేలుకొంటుందో తెలియదు. ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియదు.’ అటువంటి మహానగరంలో కుమార్థులి ఒక దివ్యధామం. అక్కడి వీథులన్నీ గర్భగుడికి దారులే. ఇండ్లూ వాకిళ్లూ దేవీ విగ్రహాల లోగిళ్లే.
చూస్తుండగానే, దశమి సమీపిస్తుంది. మానవుడు కనుమరుగై మహోన్నతమైన దుర్గామాత ప్రత్యక్షమౌతుంది. ఇక దేవత యజమాని పరం అవుతుంది. నిజానికి వారికది విగ్రహమే కావచ్చును. కానీ, అదొక తపస్సు. ఆహోరాత్రులూ నవరాత్రుల కోసమే అంకితమయ్యే మహోపాసన. మానవ మహత్కార్యానికి ఒక చిత్రమైన కొలుపు.
ఈ వీథి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం. కుమార్థులికీ, కోల్ కొత్తాకు ప్రత్యేకం.
ఇదంతా ఒక పార్శం. మరొక పార్శం జీవన సమరం.
తొలుత పని చిన్నగానే మొదలౌతుంది. అది అనేక దశల్లో సాగుతుంది. చివరాఖరికి రంగులద్దిన పిదప మాత కన్ను తెరుస్తుంది. విస్తుపోయే వర్ఛస్సుకు లొంగిపోతాడు మనిషి. చిత్రమేమిటంటే, తమ బొమ్మ తమ కార్ఖాణాల్లోనే తల్లిగా మారి పూజలందుకుని వీడ్కోలూ తీసుకుంటుంది. అప్పుడు చిన్నబోవడం వీళ్ల వంతు. అంతదాకా తామే భగవంతులు. ఆ పిదప పూజారులూ కూడా కాదు, చిల్లర దేవుళ్లు.
ఈ వీథి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం. కుమ్మరి వీధిగా చెప్పుకునే కుమార్థులికీ, కోల్ కొత్తాకు ప్రత్యేకం.
వందనం మనిషి! జగమంత విస్తరించే కడుపేద మనిషీ, దశమి వందనం!!