నేడు సెప్టెంబర్ 29
క్రీ.శ 1251 సెప్టెంబర్ 29 నాటి దుర్గి (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో గంగయసాహిణి శ్రీ కరణాధిపతి నామదేవపండితులు పల్నాడులోని దుగ్య పట్టణంలో (దుర్గి) వంకేశ్వరదేవరను ప్రతిష్టించి దేవర అంగరంగ భోగాలకు నైవేద్యాలకు వివిధ గ్రామాలలో అనేక భూములను దానమిచ్చినట్లుగా చెప్పబడ్డది. అట్లే పరివార దేవరల అఖండ దీపాలకు నైవేద్యాలకు అనేక దానాలు చేసినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం.334].
అట్లే క్రీ.శ 1323 సెప్టెంబర్ 29 నాటి దర్శి (ప్రకాశం జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో తత్తినూరి నాందేవరాజులు దర్శి స్వయంభూదేవరకు భోగవ్రిత్తిగా పతకమూరు, సామంతపూండి గ్రామాలలో కొన్ని భూములను సర్వమాన్యంగా యిచ్చినట్లు చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు I Darsi 10].
అట్లే క్రీ.శ 1547 సెప్టెంబర్ 29 నాటి కోలవల్లి (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహానాయంకరాచార్య కూనపులి పెదపాపినాయనింగారు దానమేదో చేసినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర దాన వివరాలు తెలియరావడంలేదు. [ద.భా.దే.శా. X XXXI నెం 92].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.