కొండపొలం గొర్ల కాపరుల జీవన గ్రంధం. జీవన్మరణంలో ఒక వృత్తి తాదాత్మ్యతకు అపురూప నిదర్శనం. రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ నవలా రచనకు గాను తానా నవలల పోటీ -2019లో అత్యున్నత రచన చేసినందుకు రెండు లక్షల బహుమతిని అందుకున్నారు. అది కాదు నేటి విశేషం. ఆ నవలను ప్రసిద్ధ దర్శకులు క్రిష్ – పేరు కూడా మార్చకుండా దృశ్యమానం చేయడం మరో విశేషం. వారు ఆ సినిమాను వచ్చేనెల ఎనిమిదిన మన ముందుకు తెస్తున్నారు. ఈ మధ్యాహ్నం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ నవల రచన ఎంతటి ప్రయాసతో ముడివడి ఉన్నదో ఎట్లా మూడు దశాబ్దాలుగా తనలో నలిగిందో, ఎంతటి మమేకంతో ఈ రచన చేశారో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తెలుపు నేటి ప్రత్యేకం.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
నా కాళ్ల కింది నేల, నా చుట్టు వున్న జీవితాలు కలిసి నా చేత రాయించిన మరో నవల యీ (Konda Polam) ‘కొండపాలం.’
సగిలేటి నుంచి నల్లమలల దాకా వున్న బరక పాలాలూ, మెరక నేలలూ, వంకలూ వాగుల్లూ, మిట్టలూ గుట్టలూ, చెట్లూ చేమలూ, రకరకాల జీవరాశులతో కూడిన యీ నేలకు నేను ఆస్థాన లేఖకుడ్ని. నిరంతరం వాటి ముందు కూచుని అవి చెప్పే విషయాల్నిశ్రద్ధగా వింటూ రాసి ప్రకటించటం నా పని. ఆ పరంపరలో ఇప్పుడు నల్లమల కొండల వంతు వచ్చింది.
1987 నుంచి రచనా వ్యాసంగంలో ఉన్న సన్నపరెడ్ది వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. కడప జిల్లా బాలరాజుపల్లె వారి నివాసం. 2019లో తానా నవలల పోటీల్లో కొండపొలం అత్యుత్తమ రచనగా ఎంపికవడమే కాదు, అంతకు ముందు 2017లో వారి రచన ‘ఒంటరి’కి కూడా మూడో బహుమతి అందుకున్నారు. కవిత్వంతో మొదలైన వారి రచనా ప్రస్థానంలో ఇప్పటికి రెండు కథా సంపుటులు, ఎనిమిది నవలలు వెలువడ్డాయి. వారి రచనలు చదవడం ఒక గొప్ప అనుభవం. తన రచనా వ్యాసంగానికి మూలం ‘అరుగు’ అంటూ వారు ఎంతో అద్భుతంగా ఆ నేపథ్యాన్ని నవలకు ముందు వివరిస్తూ ఈ రచనను దానికే అంకితం ఇవ్వడం మరో విశేషం. రచయిత ఫేస్ బుక్ అకౌంట్. ఇ -మెయిల్ SANNAPUREDDY12@GMAIL.COM
పాలము దున్ని, విత్తనాలు విత్తి కరువు కాలానికి చింతపడుతూ, మంచి కాలానికి వంత పాడుతూ పంటను ఇంటికి చేర్చుకొనే వ్యవసాయం వేరు. తానే విత్తనమయి మట్టి పాత్తిళ్ల లోంచి మొలకెత్తి, ఆశగా ఆకసానికి చూసే రైతుదనం వేరు. పెద్దంబలి పొద్దున దొడ్ల తడికలు తీసి గొర్లను బైటకు తోలి ఎండల్లో వానల్లో వాటి వెనక కాపలాకర్రలా తిరుగుతూ పాద్దుగుంకే సమయాన తిరిగి గొర్లను దొడ్లల్లోకి చేర్చే గొర్ల కాపరితనం వేరు. తానే ఆకలికి మరో రూపమైన గొర్రెగా మారి బతుకంతా మేతకోసం వెంపర్డాడే గొల్లదనం వేరు.
రైతుదనం, గొల్లదనం రెండూ కలగలిసిన జీవితం నాది.
సగం శరీరం కంకులుగా పండి గింజలు రాలిస్తే, మరో సగం శరీరం పాదుగుగా మారి పాలిచ్చే పల్లెజీవితం నాది.
ఈ నవల రాసేందుకు పదైదు సంవత్సరాలుగా నేను రగులుతూనే వున్నాను.
పల్లె పరిసరాలలో బతుకు వనరులు లభ్యం కానప్పుడు దగ్గరలోని కొండల మీద ఆధారపడటం సహజం. ఉదయం వెళ్లి సాయంత్రం లోపల అటవీ ఉత్పత్తులను సేకరించుకొని వచ్చేవాళ్ళు కొందరైతే, వారం పది రోజుల పాటు అక్కడే కొండపొలం చేసి బతుకు తెరువు సాధించుకునేవాళ్ళు మరి కొందరు. కరువు తాండవిస్తున్నప్పుడు గొర్రెలకు నీళ్ళు మేపు వెతుక్కొంటూ ఎక్కడో కొండల్లో నాలుగు చినులుకు రాలి గడ్డి పచ్చబడిన తావులు చేరుకొని క్రుర మృగాల దాడులు తప్పించుకుంటూ ఏడెనిమిది బత్తేల కాలం జీవించిన దుర్భరమైన జీవితం ఈ కొండపొలం నవల.
గొల్లలు, కాపులు సగం సగంగా వున్న వూరు మాది. చిన్నతనాన్నించీ వాళ్లతో కలిసిమెలిసి బతుకు పయనం సాగిస్తోన్నప్పటికీ, వాళ్ల జీవితాల్ని అర్ధం చేసికొని, వాటిని సాహిత్యంలోకి తీసుకురావాలనే తలంపు వచ్చేసరికి సగం వయన్సు దాటింది. వ్యవసాయ వృత్తిని జీర్ణించుకొన్నంతగా గొర్ల కాపరితనాన్ని జీర్ణించుకొని నవలగా రాసేసరికి ఇంతకాలం పట్టింది. తనదికాని జీవితాన్ని తనదిగా మార్చుకోవాలంటే ఒక జీవితకాలం కృషి చేయవలసిందే. అది కూడా నిజాయితీగా, తన కులానికి, వృత్తికి సంబంధించి వదల్బుకొని అవతలి గట్టుకు నడవగలిగిన స్థితికి వచ్చినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. చొక్కాను వదల్చి కంబడి కప్పుకోవచ్చు. ముల్గుగర్రను వదలి బొబ్టెకర్రను చెతబట్టొచ్చు. లొట్టలు రిక్కలులాంటి ఎద్దుల అదిలింపులు చాలించి గొర్రెల్సి హెచ్చరించే శబ్ధాలు ఒంటబట్టించుకోవచ్చు. కానీ ఒంటికి అంటిన గొర్రెబొచ్చును, పెంటికల వాసనను సహజంగా అనుభూతించే గొర్లకాపరితనం రావాలిగదా! అందుకే పక్కపక్కనే కలిసి జీవిస్తోన్న వాళ్ల బతుకుల్ని అక్షరబద్ధం చేసేసరికి ఇన్ని దశాబ్దాలు పట్టింది.
ఎవరి మూలాల్ని వాళ్లు తవ్వుకొంటూ పోవటమే సులభంగా వుంటుంది.
ఊర్లో అంటుకొన్న కొంపలాంటిది రైతు దుఃఖం. దూరంగా అంటుకొని ఎగబడి కాలుతూ వున్న కొండమంట లాంటిది గొర్లకాపర్ల దుఃఖం.
గొర్రెలు చేలో మేసినాయనీ, ఒక్కపూట బొక్కెడు మేత కోసం ఏడాది పైరు నాశనం చేసినాయనీ నాన్న గొణుక్కొంటూ, మేపిన మంద ఎవరిదైందీ తెలియక మాపటేల అన్నిగొర్లదొడ్ల వద్దకూ వెళ్లి గొంతెత్తి తిట్టిరావటం నా బాల్యంలోని గొర్లకాపర్ల గురించిన ఒక జ్ఞాపకం. చేనిదాకా వెళ్లి కత్తిరించినట్లు గొర్లు కొరికిన పైరును చూసి నాన్న బాధపడుతూ వుంటే రైతు దృష్టికోణంలోంచి గొర్లనూ, గొర్ల కాపర్లనూ నేను అర్థం చేసికొన్న తీరు వేరు. గొర్లు కొండల్నించి దిగి వచ్చిన తర్వాత డబ్బు ఒప్పందంతో రాత్రిళ్లు మా చేలల్లో చేర్చించినపుడు, గొర్లు లేచి పక్క చేలల్లోకి వెళ్లి ఉడగకుండా, నక్కలూ తోడేళ్లూ మందమీద దాడి జేయకుండా సగం రాత్రిదాకా నేనూ, మరో సగం నాన్నా కావిలున్నపుడు గొర్ల సాన్నిహిత్యం కొంత అర్ధమైంది. తెల్లారుజాము మూడు గంటల్నించే వెల్లి ఎక్కడెక్కడో తిరిగి దొంగచాటుగా ఆముదపు ఆకులు, వేప రెమ్మలు విరుచుకొచ్చి పిల్లల గూళ్లల్లో కట్టి వాటి పగటి మేపుకు ఇబ్బంది లేకుండా చేసేందుకు గొల్లలు పడే అగచాట్లు కొత్తగా అనిపించాయి. చేలగట్టు మీద అడ్డంగా నిలబడి గొర్రెల్ని మేపుతోన్నపుడు అవి పైరు
కర్రల్ని కొరుకుతాయేమోనని నాన్న దూరాన్నించే ఆరాటపడుతూ కేకలేసి, తిట్టి హెచ్చరిస్తోంటే, గెనిమల మీది గడ్డిని ఇంకొక్క బొక్కెడయినా తినిపించాలని ఆ తిట్లు వినబడనట్లుగా, గొర్రెల్సి అదిలించినట్లే నటిస్తూ మసలే కాపర్లనూ చూశాను. బరకల్లో గడ్జిపోచల కోసం ఆరాటంగా తిరిగే గొర్లమందనూ చూశాను. కొండల్లో ఒళ్లంతా భయమే నింపుకొని కడుపాత్రంతో తిరిగే గొర్రెల సమూహాల్ని చూశాను. గొల్లలతో కలిసి నడిచాను. వాళ్ల కష్టాల్ని చెవులు కళ్లుగా చేసికొని విన్నాను. వాళ్లను గురించి తెలిసికొనేసరికి, వాళ్లను అర్హం చేసికొనే పరిణతి వచ్చేసరికి చాలా కాలమే పట్టింది.
ఈ విషయంలో నేను మొద్దు విద్యార్థినేనేమో!ఊర్లో అంటుకొన్న కొంపలాంటిది రైతు దుఃఖం. దూరంగా అంటుకొని ఎగబడి కాలుతూ వున్న కొండమంట లాంటిది గొర్లకాపర్ల దుఃఖం.
కొన్ని మొక్కల్ని భూమిలో నాటి వాటిని కాపాడుకొనే స్థిరమైన జీవితం రైతుది. కొన్ని ప్రాణాల్నివెంటేసుకొని వాటిని బతికించుకొనేందుకు బీడునేలలూ కొండకోనలూ తిరిగే సంచార జీవనం గొల్లలది. కరువులొస్తే పైరు ఎండిపోయి రైతు దుఃఖం కనిపిస్తుంది. మేతను వెతుక్కొంటూ కానని నేలలకు వెళ్లిపోయే గొర్లకాపర్ల దుఃఖం లోకానికి కనిపించదు. ఊర్లో అంటుకొన్న కొంపలాంటిది రైతు దుఃఖం. చుట్టుపక్కల వాళ్లు ఆర్పేందుకు వస్తారు. ఆరినా ఆరకున్నా సానుభూతి అయినా దక్కుతుంది. దూరంగా అంటుకొని ఎగబడి కాలుతూ వున్న కొండమంట లాంటిది గొర్లకాపర్ల దుఃఖం. చూసేవాళ్లేగాని దగ్గరకు వెళ్లేవాళ్లుగానీ, ఆర్పేందుకు ప్రయత్నించేవాళ్లుగానీ కనిపించరు.
ఏడాది పొడవునా నల్లమలలు మాకు కొత్తగానే కనిపిస్తాయి.
నల్లమల కొండ పాదాలనించి మా వూరికి ఐదారుమైళ్ల దూరం వుంటుంది. పొద్దున్నే లేచి కళ్లు నులుముకొంటూ పడమటి దిశకేసి చూస్తే ఏదో ధైర్యాన్నిస్తూ గంభీరంగా నిలబడుకొని వున్న కొండ వరసలు కనిపిస్తాయి. చలికాలపు ఉదయాలు బారెడు పొద్దెక్కేదాకా తెల్లని ఆవులమందల్లా కొండల మీద మొయిలు మేస్తూ పైకెగబాకుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తే, వానాకాలము చినుకు తెరల చాటున వొదిగిపోయిన పర్వతాల ముగ్ధత్వము కళ్లు విప్పార్చుకొనేలా చేస్తే, ఎండాకాలపు రాత్రిళ్లు మంటల తోరణాలు చుట్టుముట్టి కొండలపైకి ఎగబాకుతూ భయపెడుతోంటే- ఏడాది పొడవునా నల్లమలలు మాకు కొత్తగానే కనిపిస్తాయి.
నిజంగా గొర్ల కాపర్లే యీ నవల రాసింటే అచ్చం గొర్రెబొచ్చు వాసన గుబాళించి వుండేది.
బాల్యంనించీ కొండల్లోకి వెళుతూనే వున్నాను. కొట్టాల్ని కప్పుకొనే బోదగడ్డికో, కొట్టం వాసాలకో, వేపెనారకో, చింతకాయలకో, అహోబిలం, జ్యోతి, బిలం గుహ, పాములేటయ్య, భైరవకోనలాంటి క్రేత్రాల్ని దర్శించేందుకో కొండల్లో తిరుగుతూనే వున్నాను. ఈ దుర్గమారణ్యాల్లోనే మా వూరి గొర్లకాపరులు నెల, నెలన్నరపాటు గొర్రెల్ని మేపుకొంటూ కొండపాలం చేస్తూ బతుకుతారనే విషయం తెలిసి ఆశ్చర్యం కలిగేది. అదొక మార్మిక జీవనం. దాన్ని గురించి వాళ్ల నోళ్లల్లోంచి వింటూ దిగ్బ్రాంతికి గురయ్యేవాన్ని. ఆ జీవితాన్నిగురించి దశాబ్దాలుగా వింటూ, వాళ్లు తిరిగిన ప్రాంతాలు నేను చూసి వుండటం వలన విన్న దృశ్యాల్ని ప్రాంతాలకు అన్వయించుకొని అనుభూతికి తెచ్చుకొంటూ, వాళ్ల అనుభవాల్ని నావిగా అనుభూతిస్తూ నేనూ గొర్రెలకాపరిగా మారి కొండల్లో తిరిగినంతగా మార్పు చెందితేగాని ఈ నవల రాయలేకపోయాను. నిజంగా గొర్ల కాపర్లే యీ నవల రాసింటే- దీనికన్నా ఎంతో స్పష్టంగా, చిక్కగా, మరింత దగ్గరితనంగా, ఇంకొంత వాస్తవికంగా వుండేది. అందులో సాఫ్ట్ వేర్ విద్యార్థి రవీంద్రయాదవ్ పాత్ర వుండకపోవచ్చు గాని అచ్చం గొర్రెబొచ్చు వాసన గుబాళించి వుండేది. గొరైల జీవనానికి సంబంధించిన చాలా సూక్ష్మమైన అంశాలు వాళ్లకు మాత్రమే తెలుసు.
ఉన్నట్టుండి- తడిసిన గొర్రెపిల్లలా వజవజ వణుకుతూ, నిండా ముసుగేసుకొని కొండల్నించి వూర్లోకొచ్చి పడతాడు గొర్లకాపరి. అతన్ని పరామర్శించి సానుభూతి చూపటం తప్ప కొండల్నించి హిమాలయ శిఖరాల్లోని చలినంతా దుప్పట్లో చుట్టుకొచ్చిన అతని జ్వరాన్ని నేను అనుభూతించలేను గదా! దాన్ని అక్షరీకరించటం నాకు సాధ్యం కాదుగదా!
అతని ఒక్కని వల్లనే వ్యవస్థ బాగుపడుతుందనే అత్యాశ లేదుగాని అతనిలాగే ప్రతి ఉద్యోగి నిక్కచ్చిగా పనిచేసే తన పరిధిలో పర్యావరణ పరిరక్షణ చేయాలనే ఆశతోనే అతని గమనాన్ని మార్చింది.
కొండ పొలం చేయటమనేది ఇతరులకు ఎవ్వరికీ అర్థంకాని గొర్ల కాపరుల రహస్య జీవితం, సాహసోపేతమైన గమనం. అవసరం కల్పించిన సాహసం అది. ‘బతుకా? చావా?’ అనే ప్రశ్నఎదురైనపుడు చావుకు తెగించి బతకడమే! చావు జంతువులుగా బతుకును వెతుక్కుంటూ పోవటమే.
బతుకు కోసం సాహసం చేస్తూ గొర్ల కాపరుల, వ్యవసాయదారుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని యీనాటి యువత ఎందుకు ముందుకు సాగాటం లేదనే ఆవేదన ఈ రచన వెనక వుంది. పనిని ఇష్టపడటం, పనిని స్వంతం చేసికోవటం, తానే పనిగా మారిపోవడం అనే మూడడుగుల గమనం మనిషిని అజేయుడిని చేస్తుందనే నమ్మకం వుంది.
ఆ నమ్మకమే రవీంద్రయాదవ్ పాత్రను సృష్టించి అడవికి పంపింది. తన్ని సాఫ్ట్ వేర్ రంగం నించి దారి మళ్లించి అటవీశాఖాధికారిగా చేసింది. అతని ఒక్కని వల్లనే వ్యవస్థ బాగుపడుతుందనే అత్యాశ లేదుగాని అతనిలాగే ప్రతి ఉద్యోగి నిక్కచ్చిగా పనిచేసే తన పరిధిలో పర్యావరణ పరిరక్షణ చేయాలనే ఆశతోనే అతని గమనాన్ని మార్చింది. నేను రైతుబిడ్డను. నేలనంతా ఆక్రమించుకొంటూ వస్తోన్న “వయ్యారిభామ’ అనే రాకాసి గడ్డి మొక్కని తన పరిధిలో అయినా పీకి పారేసి నాశనం చేసే రైతు మనస్తత్వం నాది. ఒక్క చెట్టును నరకకుండా కాపాడినా పర్యావరణ పరిరక్షణ సౌధానికి ఓ న్తంభం నిలెత్తినట్లే గదాయని నమ్మే చిన్న ఆశ నాది.
నేనీ నవల రాసినందుకు ఎప్పుడు సంతృప్తి చెందుతానంటే – కొండపాలం అనుభవాల్ని వాళ్లు చెబుతూ వుంటే నేను ఆసక్తిగా విన్నట్లే యీ పుస్తకాన్ని వాళ్లు చివరిదాకా ఆసక్తిగా చదివినపుడు.
నేనీ నవల రాసినందుకు ఎప్పుడు సంతృప్తి చెందుతానంటే- సాహిత్యకారులంతా మెచ్చుకున్నప్పుడు కాదు. కొండపొలం చేసి వచ్చిన గొర్లకాపరులు చదివి ఫర్వాలేదని భుజం తట్టినపుడు, ముప్పయ్యేళ్ళుగా కొండపాలం అనుభవాల్ని వాళ్లు చెబుతూ వుంటే నేను ఆసక్తిగా విన్నట్లే యీ పుస్తకాన్ని వాళ్లు చివరిదాకా ఆసక్తిగా చదివినపుడు.
చివరగా ఒకమాట –
జననం నించి పయనమై వస్తోన్న నేను వ్యవసాయదారుల కాలిబాటలోనే నడున్తున్నప్పటికీ, అప్పుడప్పడూ దారిపక్కనే సమాంతరంగా దుమ్ము రేపుకొంటూ వెళ్లే గొర్లకాపరుల అడుగుజాడల్ని కూడా తొక్కుతూ వచ్చాను. రాను రాను రెండు దారులూ కలిసిపోయే కరువుబాట ఒకటి ఏర్పడి, అది కాస్తా రహదారిగా మారి నగరాలకేసి వెళుతూ వుండటాన్ని నిస్సహాయంగా చూస్తూ వున్నాను.
click for Konda Polam Trailer
కొండపొలం నవలకు శ్రీ చౌదరి జంపాల గారు రాసిన తొలి పలుకులు… ‘జీవనారణ్యంలో సాహసయాత్ర’ ఈ లింక్ క్లిక్క్ చేసి చేసి చదవవచ్చు.
అలాగే, పోటీకి వచ్చిన 58 నవలల్లో ‘కొండపొలం’ను ఉత్తమ రచనగా ఎంపిక చేసిన ఇద్దరు రచయితల్లో ఒకరైన కాత్యాయనీ విద్మహే గారి ముందు మాట ‘ఉత్పత్తి కులాల మానవీయతకు నిలువుటద్ధం’ దీన్ని క్లిక్ చేసి చదవచ్చు.
అన్నట్టు, ఈ నవల తిరిగి పునర్ముద్రణ పొంది, రెండవ -ప్రత్యేక – ప్రచురణగా ఈ వారం పుస్తకప్రియులకు అందబోతున్నట్టు చౌదరి జంపాల గారు తెలియజేశారు. వివరాలకు సంప్రదించవచ్చు.
KONDAPOLAM from novel to celluloid – An Epic Tale Of Becoming by Krish Jagarlamudi | Panja Vaisshnav TGej | Rakul Preet Singh | watch trailer by clicking the link
గొల్లోల్లు, గొర్రెల కాపర్లు ప్రపంచానికి, ప్రభుత్వాలకి ఒక కులం, క్యాస్ట్ గా మాత్రమే తెలుసు. కాానీ రైతులకు సమాంతరంగా నడిచే, మరుగున పడిపోయిన మరొక కష్టజీవిగా సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారు గుర్తించి, పదిహేనేళ్లు వెంటనడిచి రాసిన కొండపొలం అనే గొర్రెల కాపర్ల జీవనం ఒక గొప్ప కొత్త ఆవిష్కరణ. మైదాన ప్రాంత జీవులకు ఇదొక కొత్త వెలుగు.