ఔషధ విలువల మొక్కలు ( 47 ) : నిమ్మ
పులుపు రుచికి నిమ్మ పులిహార కమ్మన
చలువకిదియె రాణి కొలువకేమి?
మండు వేసవియన మజ్జిగ యందున
నిమ్మ రెమ్మ లుప్పు నెయ్యమికన
నాగమంజరి గుమ్మా
నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది
నిమ్మరసం, ఉప్పు, పంచదార, తేనె, వేడినీళ్లతో ఆరోగ్యం అందించడం అందరకు తెలిసిందే.
నిమ్మ రసంతో చేసే వంటకాలు చెప్పనవసరమే లేదు. పుల్లటి నిమ్మ కాయ ఆకులు మాత్రం కాస్త వగరుగా ఉంటాయి. ఈ ఆకులను పల్చటి మజ్జిగలో వేసి, కాస్త ఉప్పు చేర్చి, మండు వేసవి ఎండలో వచ్చిన వారికి అందిస్తే చలువ చేసి, వడదెబ్బ తగలనీక కాపాడుతుంది.
అలాగే రాత్రి మిగిలిన అన్నములో కాస్త మజ్జిగ, ఉప్పు, నిమ్మాకులు వేసి మూతపెట్టి, ఉదయం తిని చూడండి… కడుపులో ఎంత చల్లగా హాయిగా ఉంటుందో… ఒకప్పుడు పల్లెల్లో మట్టికుండలో మజ్జిగ పోసి, నిమ్మాకులు వేసి ఉంచి, ఇంటికి వచ్చిన వారికి దాహం ఇచ్చే అలవాటు ఉండేది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.