ఔషధ విలువల మొక్కలు ( 46 ) : తమలపాకు
తమలపాకు తీగ దైవతార్చనమున
నోటి శుద్ధి, జలుబు, నొప్పులకును
పుణ్యకార్యములకు పూనిక నొనరించు
నింటపెంచుకున్న నిష్ట సిద్ధి
నాగమంజరి గుమ్మా
పూజలకు, పుణ్యకార్యాలకు, ఏ పనైనా ప్రారంభానికి తమలపాకులు తాంబూలం ఇవ్వడం తెలిసిందే… తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు. తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు. తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు. ప్రతిరోజూ ఏడు తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
రోజుకు 5 తమలపాకుల చొప్పున రెండేళ్లు తింటే మానలేనంత వ్యసనంగా మారిపోతుందంటారు.
ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.