నేడు సెప్టెంబర్ 25
క్రీ.శ 1557 సెప్టెంబర్ 25 నాటి చిడిపిరాల (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల పెద అవుబళరాజులు శ్రీభాష్యపురం చంన్నరాయనికి ఆశ్వజ, వైశాఖ, జేష్ఠ మాసాల తిరునాళ్ళకు తిరుపణ్యారాలు ఆరగించేందుకు చడ్పరేల (చిడిపిరాల) వద్ద రెండు కాల్వల నడుమగల ఒక ఖండుక 32 పుట్ల భూమినిచ్చినట్లుగా చెప్పబడ్డది. ఈ శాసనం సెప్టెంబర్ 24 నాటి సంబటూరు శాసన విషయాన్నే తెలుపుతోంది. [ద.భా.దే.శా XXXI నెం 119].
అట్లే క్రీ.శ 1367 సెప్టెంబర్ 25 నాటి పట్నం శాసనంలో బుక్కరాయలు I పాలనలో మహానాయంకరాచార్య పంది బమ్మినాయనింగారు కదిరి అహోబళదేవర తిరు ‘బోనానకు’ పాంతర్లపల్లి చెరువు వెనక పుట్టెడు మడి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 5].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా