ఔషధ విలువల మొక్కలు ( 43 ) : వెదురు
వెదురు పుణ్యమేమొ వేణువుగా మారె
వెదురు బొంగు తాను వెన్ను గాదె
వెదురు బియ్యమున్ను వేయించ నౌషధి
వెదురు కెదురు లేదు పొదల లోన
నాగమంజరి గుమ్మా
వెదురు, వేణువుగా, గుడిసెలకు వెన్నుపట్టుగా, గృహోపకరణాలుగా ఎన్నో ఉపయోగాలు తెలిసినవే.
వైద్య సంబంధ విషయాలకు వెదురు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెదురు బియ్యం వేయించి గంజి కాచి ఔషధంగా ఉపయోగిస్తారు. వెదురు చిగుళ్ళ కషాయం చలువ చేస్తుంది. కఫం, రక్తదోషం, మూలవ్యాధి, మధుమేహం లాంటి వ్యాధులకు పనికి వస్తుంది. స్త్రీలకు గర్భకోశమును శుభ్రము చేయుటకు, ఆకలి పుట్టుటకు దీని కషాయాన్ని ఇస్తారు.
భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో వెదురుని బాన్‌సులోచన్ అంటారు.
వెదురుని అంటువ్యాధులు నిర్మూలించే ఔషధంగా కూడా వినియో గిస్తారు. వెదురు తీపిదనం కలిగి ప్రొటీనులు, ఆయుర్వేద గుణాలు కలిగివుందంటే చాలామందికి నమ్మసఖ్యంగా ఉండదు. భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో వెదురుని బాన్‌సులోచన్ అంటారు. దీనినే తబషిర్ అని, తవషిర్ అని యునానీ వైద్య విధానాల్లో వినియోగిస్తూవుంటారు. దీనినే ఆంగ్లంలో బాంబూ మన్నా అని వ్యవహరిస్తూ, ఊపిరితిత్తులవ్యాధికి టానిక్ గానూ ఉపయోగిస్తున్నారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.