Editorial

Sunday, November 24, 2024
కాల‌మ్‌మూడు సూత్రాలు తెలుపు : ఈ వారం వెలుతురు కిటికీ

మూడు సూత్రాలు తెలుపు : ఈ వారం వెలుతురు కిటికీ

మూడే మూడు పదాలు. ప్రేమించు… క్షమించు…త్యజించు… ఇవి ప్రశాంత జీవనానికి అద్భుత సోఫానాలు.

సిఎస్ సలీమ్ బాషా

ఎవరైనా సరే జీవితంలో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలనుకుంటే ఈ మూడు పదాలు అత్యంత ముఖ్యమైనవని తెలుసుకోవాలి. ఈ మూడు పదాలు కాదు, జీవన మార్తాలు. అవి ఎందుకు ముఖ్యమైనవీ అంటే వీటిలో దేన్ని పాటించినా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఇందులో మొదటిది నూరు శాతం ప్రశాంతతనిస్తుంది.

రెండవది 75% అనుకోవచ్చు.

మూడవది కనీసం 50 శాతం ప్రశాంతతను ఇస్తుంది.

మొత్తం మీద ఈ మూడు పదాలు వ్యక్తులను బట్టి మార్చుకుంటూ పోవచ్చు. అలా చేసినా దాదాపు జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్ కూడా.

కాలమిస్టు సలీం భాషా సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా. వారి మొబైల్ నంబర్ 93937 37937

నిజానికి ప్రేమించడం అన్నది మనకు లాభం కలిగించే విషయం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. చాలామంది ఎవరినైనా ప్రేమిస్తే అది అవతలి వాళ్ళకే లాభం అనుకుంటారు. కానీ కాస్త ఆలోచిస్తే ప్రేమించడం అన్నది మనకు లాభం అన్న విషయం అర్థమవుతుంది. దాదాపు 30 సంవత్సరాలు జైల్లో ఉన్న నెల్సన్ మండేలా ప్రేమించడం వల్ల చాలా లాభం ఉంది అన్నాడు. జైల్లో సైతం తనని బాగా ఇబ్బంది పెట్టిన జైలు వార్డెన్ లను సైతం ఆయన ప్రేమించాడు. దాంతో అంత సుదీర్ఘ కాలం జైల్లో ఉండగలిగాడు, అది ప్రశాంతంగా. అయితే అట్లాంటి పని అందరూ చేయలేరు. ఏ మదర్ థెరీసా నో, మహాత్మా గాంధీ నో, ప్రేమించడం జీవన విధానంగా పెట్టుకున్న వారు తప్ప.

ప్రేమ

మనుషుల్ని ప్రేమించడం అన్నది చాలా గొప్పది. అంత గొప్ప పని ఇంకోటి లేదు. జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవతలి వాళ్ళు మనల్ని ప్రేమించినా ప్రేమించక పోయినా మనం వాళ్ళని ప్రేమిస్తే, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడైతే అవతలి వాళ్ళు కూడా
మనల్ని ప్రేమించాలని కోరుకున్న మరుక్షణం మనం ప్రశాంతతను పోగొట్టుకుంటాము.

మనం చాలాసార్లు “నన్ను వాడు మోసం చేశాడు, అటువంటి ఎలా ప్రేమిస్తాను”, “నాకు చాలా అన్యాయం చేశాడు, అట్లాంటి ఎదవని ప్రేమించడం సాధ్యమా?” “అసలు అలాంటి మనిషిని ప్రేమించే గలమా?” అనుకుంటారు.

అంతేకాదు, చాలామందికి ఒక డౌట్. ప్రస్తుత పరిస్థితుల్లో అందరు మనుషుల్ని ప్రేమించడం సాధ్యమా? అని. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కాదు. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయిన ఈ ప్రపంచంలో కొంత మందిని
ప్రేమించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ప్రశాంతత కావాల్సింది మనకు కాబట్టి ప్రేమించాలి.
అది సాధ్యం కాదు అనుకుంటే రెండో పదం “క్షమించు” ని పాటించాలి. ఇది కూడా కొంచెం కష్టమే. మనకు అన్యాయం చేసిన వాళ్ళని, మనల్ని హింసించిన వాళ్ళని, మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని, ద్రోహం చేసిన వాళ్లని క్షమించగలమా? కొంచెం కష్టమే. కాని, క్షమించేస్తే మన మనస్సు, మెదడు తేలికవుతాయి. ప్రేమించడం కన్నా ఇది తక్కువ కష్టమైనప్పటికీ, ఈ పని చాలామంది చేయలేరు. దీనికి చాలా ధైర్యం కావాలి. కొంతమంది ఇతరులు చేసిన తప్పుని సంవత్సరాల తరబడి కూడా క్షమించలేరు. తమాషా ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ కన్నా వీళ్లు ఎక్కువగా బాధపడతారు! క్షమించేస్తే ఒక్కసారి బాధపడాలి, క్షమించకపోతే జీవితాంతం బాధపడాలి.

క్షమ

చాలామంది సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం క్షమించడం అనేది మనకి లాభం. మనకు అవసరం. చాలా మంది అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతారు.

క్షమించేస్తే ఒక్కసారి బాధపడాలి, క్షమించకపోతే జీవితాంతం బాధపడాలి.

ప్రేమించడం, క్షమించడం కన్నా కొంచెం సులువైన పని త్యజించడం. చాలామంది ఇది కూడా చేయరు. మనం ఎవరినైనా ప్రేమించాలి లేకపోతే, క్షమించాలి. అది కూడా చేయలేక పోతే వాళ్లని వదిలేయాలి అంటే త్యజించాలి. అవతల వాళ్ళని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయాలి. ఇది కొంచెం సులువైనప్పటికి కూడా చాలా మంది ఈ పని చేయరు. తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్లని, మోసం చేసిన వాళ్ళని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీంతో ఒకసారి జరిగి దాని గురించి జీవితాంతం పదే పదే బాధ పడుతూ ఉంటారు.

త్యాగం

త్యజించడమన్నది తాత్కాలికంగా ప్రశాంతతను ఇచ్చినా, దీర్ఘకాలంలో మానవ సంబంధాలకు
అయితే అడ్డంకిగా మారుతుంది. త్యజించడమంటే ఒకరకంగా సంబంధాల పట్ల ఆసక్తి లేకపోవడం. అందరినీ వదిలేయడం వల్ల బంధాలు బలహీనమవుతాయి. సంబంధాలలో దూరాలు పెరుగుతాయి. వదిలేయడం అంటే ఒక పలాయనవాదం. ప్రేమించడం కానీ క్షమించడం కానీ మనిషి ఒక పాజిటివ్ మోషన్స్. వదిలేయడం వల్ల చాలా తక్కువ సార్లు మాత్రమే ఉపయోగం ఉంటుంది. నిజానికి వదిలేయడం ఒక నెగిటివ్ ఎమోషన్. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేయని మనిషి ఉండడు.

త్యజించడం తాత్కాలికమైన మార్గంగా ఉండాలి తప్ప శాశ్వతమైన పరిష్కారం కాదు.

ఇతరులు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా వారిని వదిలేస్తే పోతే కాల క్రమేణా మనం ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే త్యజించడం తాత్కాలికమైన మార్గంగా ఉండాలి తప్ప శాశ్వతమైన పరిష్కారం కాదు. అయితే పదే పదే మనల్ని ఇబ్బంది పెట్టె వాళ్ళని, బాధ పెట్టే వాళ్ళని వదిలేయడం అన్నది ఒక మంచి పరిష్కారమే!

ప్రేమించు..క్షమించు..త్యజించు…

మనిషి బేసిక్ గా స్వార్థపరుడు కాబట్టి అందర్నీ ప్రేమించాలి, లేదా క్షమించాలి, పోనీ అది కాకపోతే వదిలేయాలి (త్యజించాలి).

ఈ మూడు సూత్రాల ప్రకారం జీవించడంలో గొప్ప శాంత ఉందని మీరే గుర్తిస్తారు, మరి ముందు వీటిని పాటించడం మొదలెట్టండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article