ఔషధ విలువల మొక్కలు ( 38 ) : నందివర్ధనం
కాయ గొగ్గులున్న కడుగొప్ప చేదున్న
మందు రూపమనుచు మనుజులనును
కాకరాకు కూడ కఠినంపు రుచినిచ్చి
తీపి రోగమణచు దేహమందు
నాగమంజరి గుమ్మా
చూపుకు రుచికి కూడా నచ్చకపోయినా కాకరకాయలను ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశ్యంతో తింటారు. కానీ అదే చేదు రుచితో కాకరాకులు కూడా ఉండటం విశేషం. ఆకులు తుంచి, నీడను ఎండించి, పొడిచేసి అన్నంలో తొలిముద్దతో తింటే శరీరంలోని చక్కెర నిల్వలు తగ్గి మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుందట.
కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.
కాకర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు.
రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది.
అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.