కాళోజి అపురూప కవిత
ఆకళ్ళ కళల ఆ కళ్ళు
ఆ కళ్ళు కళల ఆకళ్ళు
ఆకళ్ల కలలు ఆ కళ్లు
కలల ఆకళ్లు ఆ కళ్ళు
పువ్వుల్లో ముళ్ళు ఆ కళ్ళు
దేవుళ్ల గుళ్ళు ఆ కళ్ళు
దయ్యాల నెగళ్ళు ఆ కళ్ళు
బ్రతుకుల బయళ్ళు ఆ కళ్ళు
బ్రతుకులకు దళ్ళు ఆ కళ్ళు
మరియాదల మళ్ళు ఆ కళ్ళు
యాది ఎద గూళ్ళు ఆ కళ్ళు
నడవళ్ళ కళ్ళు ఆ కళ్ళు
నుడువుళ్ళ దళ్ళు ఆ కళ్ళు
ఆ కళ్లు మల్లె పందిళ్లు
ఆ కళ్లు ముల్లె విప్పుళ్ళు
ఆ కళ్ళు పరువు సావళ్ళు
ఆ కళ్ళు బరువు కావళ్లు
ఆ కళ్ళు సిగ్గు విసురుళ్ళు
ఆ కళ్ళు పెగ్గు మెసలుళ్ళు
ఆ కళ్ళు మమత విసురుళ్లు
ఆ కళ్ళు సమత దొసగుళ్ళు
ఆ కళ్ళు కొంగు తావిళ్ళు
ఆ కళ్ళు కొంగ తావళ్లు
ఆ కళ్ళు ప్రణయాల అంగళ్ళు
ఆ కళ్ళు ఆకళ్ల మూకుళ్ళు
ఆ కళ్ళు బ్రతుకు దోపిళ్లు
ఆ కళ్ళు బిచ్చపు దోసిళ్లు
ఆ కళ్ళు పీనాసి పిడికిళ్లు
ఆ కళ్ళు కడుపు కడలిసుళ్లు
ఆ కళ్లు ముచ్చట దీర్చు ముళ్లు
ముడుచుకున్న మొగుళ్ళు ఆ కళ్ళు
రగులుకొన్న మొగుళ్ళు ఆ కళ్ళు
సెలవేసిన పుళ్ళు ఆ కళ్ళు
ఆ కళ్ళు కంచాల ఆకుళ్ళు
ఆ కళ్ళు మంచాల ఆకళ్ళు
ఆకళ్ల మొదళ్ళు ఆకళ్ళు
ఆకళ్లు కుదుళ్ళు ఆకళ్ళు
ఆ కళ్ళు చదువుల ఆకళ్ళు
ఆ కళ్ళు పెదవుల ఆకళ్ళు
ఆ కళ్ళు అసువుల ఆకళ్ళు
ఆ కళ్లు వసువుల ఆకళ్ళు
బ్రతుకు చట్టాల సవరణలు ఆ కళ్లు
బ్రతుకు చట్టాల వివరణలు ఆ కళ్లు
పోషణాల కావళ్లు ఆ కళ్లు
శోషణల వేవిళ్లు ఆ కళ్లు
దూషణల వాగుళ్లు ఆ కళ్లు
శాసనల సాలీళ్లు ఆ కళ్లు
కష్టాల వాకిళ్లు ఆ కళ్ళు
ఇష్టాల కౌగిళ్ళు ఆ కళ్ళు
ఆగ గదుముళ్ళు ఆ కళ్ళు
సాగముగుదాళ్ళు ఆ కళ్ళు
ఆ కళ్ళలో దాగలేని ఆకళ్ళు
ఆకళ్లను దాచలేని ఆ కళ్ళు
గుట్టు ఆనకట్ట పగుళ్ళు ఆ కళ్ళు
ఆ కళ్లు వెన్నెల సెలయేళ్ల ఆకళ్ళు
ఆ కళ్లు ఎడారి ఎండమావుల కాళ్ళు
ఆ కళ్లు ఎదిగిన పంటపైర్లచాళ్ళు
ఆ కళ్లు గొంతులకు సరిపోని తాళ్ళు
ఆ కళ్లు బ్రతుకు మొలకల వేళ్ళు
ఆ కళ్లు చటుక్కున కాటేసే తేళ్ళు
ఆ కళ్లు బ్రతుకు సూత్రం తెగుళ్లు
ఆ కళ్లు చావు సూత్రం అమళ్ళు
ఆ కళ్లు ప్రణయ ప్రళయాల రుమాళ్ళు
ఆ కళ్లు చావు బ్రతుకుల సవాళ్ళు
కొంగు బంగారం ముళ్ళు ఆ కళ్ళు
కొంగ జపానికి దళ్ళు ఆ కళ్ళు
ఆ కళ్ళు వరూధిని కళ్ల ఆకళ్ళు
ఆ కళ్లు గాంధారి కళ్ల మూకుళ్ళు
సావురాల పచ్చడి రోకళ్లు ఆ కళ్ళు
గోముతొక్కు లాటరోళ్ళు ఆ కళ్ళు
ఆ కళ్ళు కడుపు తరుగుళ్ళు
ఆ కళ్ళు కసుల మురుగుళ్లు
ఆ కళ్ళు బులుపు చిదిమిళ్ళు
ఆ కళ్ళు వలుపు అదుముళ్ళు
ఆ కళ్ళు పలుకులకు బళ్ళు
ఆ కళ్ళు కులుకులకు ఇళ్ళు
ఆ కళ్ళు తోకళ్ళు వూపుళ్ళు
ఆ కళ్ళు డేగ దూకుళ్ళు
కొరగాని కంకుళ్ళు ఆ కళ్లు
ఎరమింగ వూరిళ్లు ఆ కళ్లు
మునిగాని పూరిళ్లు ఆ కళ్ళు
మొనగాని దోపిళ్లు ఆ కళ్ళు
గిజిగాని దూగుళ్లు ఆ కళ్లు
రుజువర్తనకు గాళ్ళు ఆ కళ్ళు
అద్దరేతిరి పగళ్లు ఆ కళ్లు
ముద్దబంతుల జోళ్ళు ఆ కళ్ళు
సద్దుమణిగిన డోళ్ళు ఆ కళ్ళు
భ్రాంతి ఎదుగుళ్ళు క్రాంతి ఒదుగుళ్ళు
ఎండమావుళ్ళు వాన వడగళ్ళు
బ్రతుకు మురికి బాత వుతుకుళ్లు
బ్రతుకు చాకిరేవు చాకళ్లు
అడివి అమ్ముళ్లు కొరివి కొనుగోళ్లు
అమ్మ అంగళ్లు సాని చావళ్ళు
కసుల దాగుళ్ళు బుసల పాకుళ్ళు
దిసల నడవళ్ళు దాగ వాగుళ్ళు
విలసతకు విడుదళ్లు ఆ కళ్ళు
సానకు గంధాల తాపిళ్లు ఆ కళ్లు
సానికి రాబళ్ల తాపిళ్లు ఆ కళ్లు
ఫిర్యాదుల డోళ్ళు న్యాయంకొండ చెవుళ్ళు
నేలబాకోళ్ళు నింగి నిట్టాళ్ళు
చిచ్చుకంటి దగళ్ళు రత్తి కన్నీళ్ళు
కోరికల గోళ్ళు తీరికల సీళ్ళు
అడివి అమ్ముళ్ళు కొరివి కొనుగోళ్ళు
బైరాగి రాగాల గునుసుళ్ళు ఆ కళ్ళు
రాగి వైరాగ్యాల పొగులుళ్ళు ఆ కళ్ళు
(1966)