ఔషధ విలువల మొక్కలు ( 29 ) : వేప
దంత ధావనమన, తనువు మెఱియుటన్న
వత్సరాది నాటి ఉత్సవమున
వలసినాకు వేప వరము జనులకున్ను
చేదు వేప కున్న క్షేమగుణము
నాగమంజరి గుమ్మా
వేప వేయి గుణముల నిధి. పలు రోగాల పాలిటి పరమౌషధి.
వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త- ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు…. “ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు”.
వేప పుల్ల, ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, గింజలు, మాను ఇలా ప్రతి భాగం ఔషధమే. చర్మ రోగాలకు, కాంతిని పెంచడానికి, మసూచి వంటి రోగాల నివారణకు వేపాకును, కడుపులో నులిపురుగుల నివారణకు వేప పువ్వును , పంటల చీడపీడలకు వేపాకుల కషాయం, వేపనూనెలను, గృహోపకరణాలకు వేప కలపను ఉపయోగిస్తారు.
తెలుగువారి తొలిపండుగ ఉగాది వేప పువ్వుతోను, ముందురోజు కొత్త అమావాస్య నాడు పోలేరమ్మకు వేప మండలతో అర్చనను చేస్తారు.
“ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు”.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.