ఔషధ విలువల మొక్కలు ( 28 ) : చింత
లేత చింత చిగురు, పూత, కాయలు, పండు
మాను తదితరములు మంచి మందు
సీ విటమిను ప్రోవు చింతయే యెరుగుము
రోజు తీసుకున్న రోగముడుగు
నాగమంజరి గుమ్మా
రోగనిరోధక శక్తి కలిగించే సి విటమిన్ ఎక్కువగా కలిగింది చింత. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడిన విషయం కూడా గుర్తు ఉండే ఉంటుంది
చింతగింజల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి.
వీటిని వేయించిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్‌వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన పోతుంది. అలాగే చింతగింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్ చొప్పున పాలు, నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, గొంతు సంబంధి సమస్యలున్నవారు ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగితే సమస్య తగ్గుతుంది. ఎముకలకి బలం ఇచ్చే శక్తి కూడా చింతగింజలకు ఉంది. ఎముకలు విరిగితే ఆ ప్రదేశంపై చింతగింజల పొడిని పేస్టులా చేసి ఐప్లె చేస్తే పరిష్కారమవుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.