ప్రతాప్ రాజులపల్లి
కైత లల్లి తీరుతా, కథలు కూర్చి తేరుతా
తెలుగు తల్లి, పాలవెల్లి, పదసేవలో ఓలలాడి తేలుతా
అడ్డంకులు ఎదురైనా, ఒడిదుడుకుల బెదురైనా
నుడి కారపు ఆ ఒడిలో, సడిలేని ఆ సవ్వడిలో || కైత||
తేట తెలుగు సొబగుల, తేటగీతి సొగసుల
మత్తేభపు మద గతుల, శార్దూలపు స్వర జతుల, సీస భాస శరదృతుల
ఉత్పలమాల ఉధృతుల, చంపక ఛందో ధృతుల, కంద మకరంద సుర ద్యుతుల
మిళింద సందోహ సంభ్రమ గతుల, మరి, మరి చేరి కోరి గ్రోలినా తీరని దాహపు రీతుల || కైత ||
నాదైన అరుదు పంథాతో, నా తల్లి కుదురు హుందాతో
మధుర మందర ఛందంతో, వధూటి సుందర చందంతో
అర్రులు జాచి అనంత జన సమూహం తీయక తీయని తేనియ, మోహమున జుఱ్ఱు నటుల
సుస్వర నిస్వనులు వెన్నంటేలా, కరతాళ ధ్వనులు మిన్నంటేలా || కైత ||