ఔషధ విలువల మొక్కలు ( 14 ) : మరువక పత్రం
మరువకమని పిలుచు మరువం మనసెరుగు
మల్లె కాగడాల మధ్య చేర్చి
కలిపి కట్ట నెర్ర కనకాంబరాలకు
సరియగు జత నౌదు సరసులార
నాగమంజరి గుమ్మా
శ్రీగణేశు పూజలో మరొక దివ్య పత్రం మరువక పత్రం.
దీనికే మరొక పేరు మరువం. మగువల పాలిటి మరులు తీగ.
మరువానికే మాటలు వస్తే, “మల్లెలు, కాగడా మల్లెలు, కనకాంబరాలతో నన్ను చేర్చి కట్టండి, మీ జడలో పెట్టండి, ఎంత అందమో చూడండి” అనదా?
ఈ పత్రి కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది. కాబట్టి వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.