ఔషధ విలువల మొక్కలు ( 13 ) : దేవదారు పత్రం
హిమనగముల దొరకు ద్రుమరాజ మీ మాను
దేవదారు యనెడి దేవ తరువు
పుణ్య తీర్ధ వాసి పుణ్య జల విలాసి
అమ్మ పెంచు పత్రులమరె నిచట
నాగమంజరి గుమ్మా
బహు పుణ్యప్రదమైన హిమాలయాలలో పరమ పావని గంగానది కాలుపెట్టిన చోట పుట్టిన చెట్లు ఈ దేవదారు వృక్షాలు. పార్వతీదేవి పుట్టినింట పుట్టిన చెట్లు అంటే ఆమెకు ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. ఆ చెట్టు బెరడు ఔషధం. నిలువెత్తున పెరిగే ఆ చెట్ల సొగసు ఎవరూ పాడుచేయకుండా సింహాలను కాపు వుంచినదట హైమవతి. మరి ఆమె ముద్దుల తనయుని పూజించడానికి కావలసిన పత్రులలో చేరడానికి ఇంతకంటే ఏం కావాలి?
దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు ,కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది. ఆకారంలో సూదికొనలతో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.