ఔషధ విలువల మొక్కలు ( 12 ) : దాడిమీ పత్రం
దాడిమి యను పేర దానిమ్మ పత్రిని
గణపతికిడి మొక్కు ఘనము గాను
పత్రి ఫలము బెరడు బహు గుణముల జూపు
స్వీయ వైద్యమెపుడు చేటు దెచ్చు
నాగమంజరి గుమ్మా
దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు. విఘ్నేశ్వర పూజలో ఇది మరొక పత్రి. ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది.
కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే తగ్గుతాయి.
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది కుష్టు వ్యాధికి, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
కషాయముల వంటివి తీసుకునే టప్పుడు తప్పక వైద్యుని సలహా తీసుకోవాలి. సొంతవైద్యం పనికి రాదు. ఒక్కోసారి వికటించవచ్చు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.