ఔషధ విలువల మొక్కలు ( 8 ) : తులసి పత్రం
తులసి పూజ సేయ తులతూగు భాగ్యాన
తులసి నెరుగని దెవరిలను చూడ
కఫము కోయు మందు కడసారి తీర్థము
తులసి యున్న తావు దొరలు సిరులు
నాగమంజరి గుమ్మా
తులసి గురించి తెలియని దెవరికి? తులసిలో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, భూతులసి అని మూడురకాలున్నాయి. భూ తులసి గింజలనే సబ్జా గింజలు పేరుతో వేసవిలో చల్లదనానికి నీటిలో నానబెట్టి తాగుతారు.
తులసి పత్రం పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకు గొంతు సంబంధ వ్యాధులకు దివ్యౌషధం. దగ్గు, జలుబు, కఫం మొదలగునవి హరిస్తుంది. ఆఖరులో తులసి తీర్థం పోసేది కూడా అందుకే… చెప్పదలచుకున్న మాటలు ఎటువంటి ఆటంకం లేకుండా చెప్తారనే…
ఇకపోతే శంఖ చూడుడు అనే రాక్షసుని భార్య బృంద. విష్ణువు మాయోపాయంతో శంఖ చూడుడును వధించగా, బృంద విష్ణువును శిలగా మారిపోమని శపిస్తుంది. అప్పుడు విష్ణువు బృందను మరు జన్మలో తాను గండకీ నదిలో సాలగ్రామం అవుతానని, బృంద తులసిగా పుట్టి తనను సేవించాలని చెప్తారు.
లక్ష్మీ సరస్వతీ అత్తా కోడళ్ళు అవడం చేత ఇద్దరూ ఒకే వ్యక్తిని కటాక్షించరు అని ప్రతీతి. శ్రీ గణేశుడు విద్యల నాధుడు అయిన పిదప లక్ష్మీదేవి వరం కోరుకోమని అంటే, లక్ష్మీదేవిని తన చెంత ఉండాలని తాను లక్ష్మీ గణపతి నవుతానని, తనని పూజించిన వారికి విద్య, ధనము రెండూ కలగాలని కోరుతారు గణపతి. లక్ష్మీదేవి సరేనంటారు. అలా ఒక్క వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడు విష్ణు స్వరూపంగా తులసి పూజలను అందుకుంటారు. మిగతా రోజుల్లో ఆయనకు తులసి పూజ నిషిద్దం.
వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంథం చరక సంహితలోనూ అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ తులసి ప్రస్తావన ఉంది. కాగా, పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది.
ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.