ఔషధ విలువల మొక్కలు ( 7 ) : దూర్వాయుగ్మ పత్రం
గరిక పోచ యనుచు కడు హీనముగ జూచు
జనుల మనములెల్ల ఝల్లు మనగ
ప్రీతి తోడ మెచ్చె విఘ్నేశ్వరుడు తాను
గరిక నిచ్చినంత గరిమ నిచ్చు
నాగమంజరి గుమ్మా
శ్రీ గణేశునికి చాలా ఇష్టమైన పత్రులలో మొదటిది గరిక అనబడే దూర్వాయుగ్మం. గడ్డి పోచ అని తక్కువ చేసి పలికే వీలు లేకుండా తనకు ఎంతో ఇష్టమైన ద్రవ్యంగా స్వీకరించారు స్వామి. ప్రేమగా గరికను సమర్పిస్తే చాలు కోరిన కోరికలు తీర్చేస్తారని అంటారు.
అంచున గాజు పూత ( సిలికాన్) ఉన్న ఈ గరిక రక్తస్రావాన్ని అరికడుతుంది. పిల్లలకు ఆటలలో గాయాలు తగిలి రక్తం కారుతూ ఉంటే గరికను నీటితో కడిగి బాగా నలిపి పెట్టాలి. క్షణంలో రక్తం కారడం తగ్గిపోతుంది. గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని రూపు మాపడానికి అమ్మతం తెచ్చి దర్భలపై ఉంచి మళ్ళీ స్వర్గానికి చేర్చాడట. ఆ దర్భలు ఆనాటి నుండి పవిత్ర మయ్యాయిని అంటారు. వాటి సోదరే ఈ గరిక కూడా.
ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.