ఔషధ విలువల మొక్కలు ( 6 ) : దత్తూర పత్రం
దత్తూర మనెడి పేరిట
మత్తేభ ముఖుని కొలువగ మహి నిలచె నిదే
ఉత్తమ మౌ భ్రాంతుల కిది
విత్తులు విషమగు, పొసగవు పెరడుల పెంచన్
నాగమంజరి గుమ్మా
శ్రీ విఘ్నేశ్వర పూజలో దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకులను కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఈ మొక్క తెల్లని పూవులు, ముండ్లతో కూడిన కాయలు కలిగి ఉంటుంది.
ఆయుర్వేదంలో నల్లని ఉమ్మెత్తను ఉపయోగిస్తారు. ఈ గింజలు విష తుల్యములు. కానీ ఆకుల రసము భ్రాంతి వంటి మానసిక రోగాలను అదుపు చేస్తుంది. జుట్టు పూర్తిగా తీసివేసి, ఆకుల రసాన్ని తలపై మర్దనా చేయాలి. కొన్ని పత్యాలు పాటించాలి. కాగా, ఇది ఆరుబయలులో పెరగవలసిన మొక్కే కానీ, ఇంటి పెరటిలో పెంచదగినది కాదు.
ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.