విద్యాధిదేవతపై కొప్పరపు సోదరుల సీస పద్యం
తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట కవులు కొప్పరపు సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా కొప్పరం గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవారు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి. రెండవ వారు కొప్పరపు వేంకటరమణ కవి. ఈ సోదరులిరువురు పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి, పద్య విద్యకు పట్టంగట్టి కొప్పరపు సోదర కవులుగా పేరు పొందారు. విద్య ప్రశస్తి గురించి, వ్యక్తి ‘యశస్సుకు విద్యయే మేటి ఔషదంబు’ అంటూ విద్యాధిదేవతపై వీరు ఆశువుగా చెప్పిన సీస పద్యమిది. గానం శ్రీ కోట పురుషోత్తం.
కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు టివి’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తున్నారు.