డా. మట్టా సంపత్ కుమార్ రెడ్డి
శైవ శాక్తేయ సంప్రదాయాలకు కేంద్రస్థానమైన
తెలంగాణ సంస్కృతిలో బోనం ఒక విశిష్ట పర్వం!
ఏడాది పొడుగునా ఇక్కడ బోనాలే బోనాలు
బోనం కథ, తాత్త్వికత చాలా చాలా పెద్దది
అది రాస్తే రామాయణం, పాడితే భాగవతం!!
బోనం అంటే భువనం
సకల ప్రాణికోటికి మూలస్థానం
బోనం అంటే వట్టి మట్టికుండే. కానీ అది నిండుకుండ
బోనం ఒక పూర్ణకుంభం. బోనం ఒక బ్రహ్మాండ బాండం
బోనం ఒక ధాన్యాగారం. బోనం ఒక ధనాగారం.
బోనం సృష్టికి ప్రతిసృష్టిచేసే ఒక మాతృగర్భం
పసుపన్నం కావచ్చ, పరమాన్నమే కావచ్చు
బెల్లపునీళ్లో పసుపునీళ్లో నింపిన ఘటమో కావచ్చు
కానీ బోనమంటే ఆహారరూపంలోని ఒక సఫలతాశక్తి
మన పచ్చని ప్రకృతి అర్థనారీశ్వరమయం!
తాండవమో లాస్యమో ఆదిదంపతులకు అదేకదా ప్రీతి
అభినయంలో ప్రథమం ఆంగికం… ఇదేమరి భువనం
భువనం అంటే దివారాత్రులు పుట్టిపెరిగేది కదా
అనునిత్యం చలనంలో, గమనంలో ఉండేదికదా
మరి అది ప్రకృతిపరమైన ఆది పరాశక్తే కదా
ఏ శక్తికైనా మౌలికమైన బలం ఆహారమే కదా
ఆహారమంటే ఒక ప్రపథమ సఫలతా శక్తేగదా
సమస్త సఫలతా శక్తులకు
మాతృశక్తి.. అన్నమేనని ప్రకటించే సందర్భం
కొండంత ప్రకృతిశక్తికి – కుండంత కృతజ్ఞతే బోనం…!!
అమ్మ సర్వసాత్విక…అందుకే పిల్లల తొట్లెలు
అమ్మ ఆగ్రహరూపిణి.. అందుకే అంబల్లు, ఉల్లిగడ్డలు
అమ్మ క్రిమినాశిని…అందుకే పసుపు, ఎల్లిగడ్డలు,వేపాకులు
అమ్మ అన్నపూర్ణ… అందుకే ఆహార నివేదనలు
అమ్మ శాకాంబరి… అందుకే పచ్చగూరలు,గుమ్మడికాయలు
అమ్మ బలవర్ధకి… అందుకే పలారాలు, చమిలిముద్దలు
అమ్మ కటాక్షప్రసాదిని… అందుకే వెయికండ్ల కుండలు
అమ్మ వృద్ధికారిణి.. అందుకే రాట్నాల బహుమానాలు
అమ్మ సకల చరాచరసృష్టికి సమస్త ప్రసాదిని
అందుకేగదా గండచిలుకలూ,చెంఢ్లూ, ఇండ్లూ, బండ్లూ…!!
ప్రకృతిలో ముడిబడ్డదే మన మౌలికమైన సంస్కృతి
అర్థంచేసుకుంటే గనుక అనంతమైన విస్తృతి
అపార్థమే గొప్పదనుకుంటె అంతులేని వికృతి
ఇది కల్లాకపటం తెలియని వట్టి ఎడ్డిమాలోకం
చేరదిస్తే చంకనెక్కుద్ది…దూరంకొడితే పారిపోద్ది
చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత…!