ఔషధ విలువల మొక్కలు ( 3 ) : బిల్వ పత్రం
శివకేశవులకు ప్రీతిగ
నవలీలగ వేడి మాన్పె డమృత తరువిదే
శివ పుత్రుడు కపిలుండై
వివరముగా పూజలందు బిల్వమన నిదే
నాగమంజరి గుమ్మా
ఓం కపిలాయ నమః బిల్వపత్రం పూజయామి అని పూజించే బిల్వ పత్రానికి మరొక పేరు మారేడు.
మారేడు శివునికి, విష్ణువుకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాగే వినాయకునికి కూడా.
ఔషధ గుణాల విషయానికి వస్తే, మారేడు ఆకులు వేసి, పది నిమిషాలు ఉంచిన నీటిని తాగితే కఫం దూరమవుతుంది. మారేడు పండు గుజ్జు షర్బట్ చేసుకుని తాగితే మండువేసవిలో ఎండదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ మారేడు దళాలను ఒకసారి పూజించిన తర్వాత మరల నీటితో కడిగితే, మరొకసారి కూడా పూజకు ఉపయోగించుకోవచ్చని చెబుతారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
వస్తుగుణ దీపిక, బసవ రాజీయం, చరక సంహిత, సుగుణ రత్నాకరం మొదలైన ఆయుర్వేద గ్రంధాలను పరిశీలించి, సంక్షిప్తగా నాగమంజరి గుమ్మా అందిస్తున్న ఈ రచనలను ప్రతి రోజూ తెలుపు అందిస్తుందని చెప్పడానికి సంతోషంగా ఉంది.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగామంజరి గారి మనవి.