నేడు తారీఖు జులై 30
క్రీ.శ 1270 జులై 30 వ తారీఖునాటి పెద్దగంజాం (ప్రకాశం జిల్లా ) శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో పిన్నశెట్టి కొడుకు..శెట్టి (పేరు నశించిపోయినది) పెద్దగంజాంలో పిన్నేశ్వర దేవరను ప్రతిష్ఠించి, దేవర అమృతపడికి కొల్లిమిరలు గ్రామాన్ని, చతుర్దశి సోమవారాలకు, చయిత్ర పవిత్రాలకు, హవిర్బలి అర్చనలకు పెద్దగంజాం, పినగంజాం, కడాకుదురు,చొప్పరేల, కనుపర్తి,దేవరంపల్లి, పాందుర్తి మున్నగు ఏడు గ్రామాల ఉప్పు వాములపైసుంకాలను, అడ్డవట్టసుంకాలను, అట్లే అఖండ దీపాలకు 100 గొఱ్ఱెలను, ఓగిరం మీది పెరుగుకు, నెయ్యికి 10 గోవులను యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం.427].
అట్లే క్రీ.శ 1416 జులై 30 నాటి దాడిరెడ్డిపల్లి (ప్రకాశం జిల్లా) శాసనంలో దేవరాయలపాలనలో వారి కుమారుడు శ్రీ వీర రామచంద్రఒడయలు ఉదయగిరి రాజ్యం చేస్తున్నపుడు బావినాయనింగారు తమ తమ్ముడు గంగనాయనింగారికి స్వర్గలోక ప్రాప్తికోసం గంగసముద్రమనే తటాకమును గుమ్మల్లపల్లిలో త్రవ్వించి,బ్రాహ్మణులకు భూములను దానంచేసినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు II కనిగిరి 4].
అట్లే క్రీ.శ 1555 జూలై 30 నాటి ఎల్లమంద (గుంటూరు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర తిరుమలరాజయ్య పేరున సిద్దిరాజు తిమ్మరాజయ్యగారు కొండవీటి రాజ్యంలోని ఎల్లమంద గ్రామంలో ప్రజలు కట్టాల్సిన వివిధ రకాల పన్నులను నిర్ణయించి ప్రకటించినట్లు చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం. 204].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.