విగ్రహం స్థాపించడం సాంకేతికం. మన మనస్సులోని పవిత్రభావాలకు కేవలం అదొక సంకేతమే. కాని అదే సర్వస్వం కాదన్నది శాస్త్ర హృదయం. మన సాధన సన్మార్గంలో సాగడానికి తొలిసోపానంగా అర్చామూర్తులను ఆరాధించాలి తప్ప ఆ మొదటిమెట్టు దగ్గరే ఎవ్వరూ ఆగిపోరాదన్నది పూర్వుల భావన.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
“అర్చనామూర్తి రూపేణ మననస్యాత్ ప్రసాదం ।
వినా మూర్తిరచింత్యన్య చింతనం దుష్కరం భవేత్ ॥”
అని కణ్వ సంహిత ఏడో అధ్యాయంలో పేర్కొన్నది. వ్యక్తిలో దైవభావన స్థిరపడడానికి, మనసు దారితప్పకుండా ఉండడానికి ఒక మార్గమే యీ అర్చామూర్తి ఆరాధన. ఆధ్యాత్మిక మార్గసాధకునికి అతిముఖ్యమైన విషయం మనోబలమే. మనస్సు స్థిరంగా ఉండని సందర్భంలో ఆధ్యాత్మిక సాధన కష్టంతో కూడిన పని అవుతుంది. అందుకని మన పూర్వులు మన మనస్సుల్లో దైవభావన స్థిరపడే నిమిత్తం తొలుత విగ్రహాలను ఏర్పాటుచేసుకోవాలని నిర్దేశించారు. అందుకే కణ్వసంహిత ‘మనస్సు తృప్తిపడే రీతిలో అర్చనారూపాన్ని ఏర్పరచుకోవాలి. అర్చనామూర్తి లేని పక్షంలో భగవచ్చింతనం కష్టతరమవుతుంద’ని స్పష్టపరచింది.
ప్రయోజనం మానసిక స్థిరత్వం. పూర్తిగా మనస్సు దైవచింతనా సముపేతం కావాలన్నది ప్రధాన లక్ష్యం. సామాన్యులు తమ మనస్సులను నేరుగా నిర్గుణోపాసన చెయ్యడమనేవి సాధ్యం కాదు కనక సగుణోపాసనకు మార్గనిర్దేశనం చేశారు ప్రాచీణ ఋషులు. అది కూడా అందరూ ఒకేరూపాన్ని మాత్రమే ఏర్పాటుచేసుకొని పూజించాలన్న నియమాన్ని ఏర్పరచకుండా, తమ తమ ఇష్టదైవాన్ని అర్చామూర్తి రూపంలో పూజించుకోవచ్చునన్నారు. ఏ దైవాన్ని ఏ రూపంలో పూజించినా అన్నీ సర్వశక్తివంతుడైన ఆ పరబ్రహ్మ స్వరూపునికే అందుతాయని చెప్పడంలో కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించినట్లవుతుంది. అందుకే సనాతనధర్మం ప్రత్యేకంగా ‘‘ఏకంసత్ విప్రోబహుధావదంతి’’ అన్నారు. దైవం ఒక్కరే, కాని పండితులు పలు రూపాలని ప్రవచించడంలోని ఆంతర్యం కూడా ఇదే.
మనకు పూర్వం నుండి కూడా మహర్షులు నిర్గుణోపాసనను చేస్తూ దైవభావనలోని ఔన్నత్యాన్ని కాపాడుతూ వచ్చారు. దైవ ఆరాధనే ప్రధానం కాని విగ్రహాలు, దేవాలయాలు ప్రధానం కావన్న భావాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. మనోనిగ్రహం కొరకు, స్థిరచిత్తం నిమిత్తం విగ్రహం ముఖ్యమన్నారు. చిత్తం స్థిరత్వం సాధించడానికి మొదటిమెట్టు విగ్రహారాధన. కాని మనం అక్కడితో ఆగిపోవడం అనేది లక్ష్యం చేరుకోలేకపోవడమే నన్నది తిరుగులేని సత్యం.
మనకు పూర్వం నుండి కూడా మహర్షులు నిర్గుణోపాసనను చేస్తూ దైవభావనలోని ఔన్నత్యాన్ని కాపాడుతూ వచ్చారు. దైవ ఆరాధనే ప్రధానం కాని విగ్రహాలు, దేవాలయాలు ప్రధానం కావన్న భావాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. మనోనిగ్రహం కొరకు, స్థిరచిత్తం నిమిత్తం విగ్రహం ముఖ్యమన్నారు. చిత్తం స్థిరత్వం సాధించడానికి మొదటిమెట్టు విగ్రహారాధన. కాని మనం అక్కడితో ఆగిపోవడం అనేది లక్ష్యం చేరుకోలేకపోవడమే నన్నది తిరుగులేని సత్యం. ప్రతి ప్రాణిలోని దైవాన్ని గుర్తించాలన్న బోధనను అనేక గ్రంథాలు అనేక సందర్భాల్లో అనేక కథల్లో వివరించాయి. దాన్ని విస్మరించరాదు. జీవాత్మను పరమాత్మగా భావించడం ఉన్నతాశయంగా మనధర్మం పరిగణించింది. మన దేహమే ఒక దేవాలయమని కూడా చెప్పింది`
“దేహోదేవాలయప్రోక్తో జీవోదేవస్సనాతన ః
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ ॥”
అంటూ ‘‘దేహం పవిత్రదేవాలయం, అందులోని జీవుడే పరమేశ్వరుడు నీతోని అజ్ఞానమనే నిర్మాల్యాన్ని త్యజించి ‘సోహమ్’ (నీవే నేను) అని పూజించు’ అని చెప్పడం వెనక నీలోని జీవాత్మయే ఆ పరమాత్మగా భావించమని చెప్పినట్లైంది. దీన్నే ‘‘అహం బ్రహ్మాస్మి’ అని చెప్పారు. భగవంతుణ్ణి పూజించడమంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించడంగా చెప్పడం గమనిస్తే పూజకు ఏది ముఖ్యమో తెలుస్తున్నది.
అనేక పాపకార్యాలకు ఒడికట్టి పూర్తి కలుష భావమనస్కులమై, తోటి ప్రాణులకు అపకారం తలపెడుతూ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని విగ్రహాలంకరణలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినా అది స్వచ్ఛమైన పూజ క్రిందకు రాదు.
ఏవిధమైన మలిన భావాలను మనస్సులోనికి రానివ్వరాదు. నిష్కల్మషమైన మనస్సే పవిత్రమై భాసిస్తుంది. అది పూజార్హమవుతుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా జీవన విధానాన్ని మలచుకోవాలి. అనేక పాపకార్యాలకు ఒడికట్టి పూర్తి కలుష భావమనస్కులమై, తోటి ప్రాణులకు అపకారం తలపెడుతూ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని విగ్రహాలంకరణలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినా అది స్వచ్ఛమైన పూజ క్రిందకు రాదు. కేవలం విగ్రహపూజ, విగ్రహాలంకరణాదులు బహిరమైనవే తప్ప అంతరంగ క్షాళనను చెయ్యలేవు. పుణ్యాన్ని అందివ్వవు. దీన్ని ప్రతి ఆధ్యాత్మిక మార్గసాధకుడు గమనించి ప్రవర్తించాలి.
విగ్రహం స్థాపించడం సాంకేతికం. మన మనస్సులోని పవిత్రభావాలకు కేవలం అదొక సంకేతమే. కాని అదే సర్వస్వం కాదన్నది శాస్త్ర హృదయం. మన సాధన సన్మార్గంలో సాగడానికి అది ఒక మార్గం మాత్రమే. దాన్నే పరమావధిగా భావించరాదు. దాన్ని ఆలంబనం చేసుకొని స్థిరచిత్తాన్ని సాధించాలి. మన ప్రయత్నాన్ని ఫలింపజేసుకోవాలి. తరువాతి మెట్టుపై అడుగుపెట్టి గమ్యం చేరాలి. దైవ కటాక్షం పొందాలి. ఈ మార్గానుయాయులకు తొలిసోపానంగా అర్చామూర్తులను ఆరాధించాలి. తద్వారా మానసిక ఔన్నత్యాన్ని, మోక్షాన్ని సాధించగలగాలి. ఆ దిశగా మనిషి ప్రయాణం సాగాలి తప్ప మొదటిమెట్టు దగ్గరే ఎవ్వరూ ఆగిపోరాదన్నది పూర్వుల భావన. కరుణ, దయ, మొదలైన సద్గుణ సంపద సాయంతో ఈ ఆధ్యాత్మిక సాధనను సుసంపన్నం చేసుకోవడమే శ్రేయస్కరం.