సంస్థ తెలుపు : పద్మలత అయ్యలసోమయాజుల
కవయిత్రి, నృత్యకారిణి, సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని ఐన పద్మలత అయ్యల అమెరికాలో గత ఏడు ఒక చిరువిప్లవం ప్రారంభించారు. బాలబాలికల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు గాను ‘చాణక్య ఇన్సిటిట్యూట్ ఆఫ్ లీడర్షిప్’ ను ప్రారంభించారు. అధునాతన జీవితానికి సనాతన వైభవం గొప్పదనాన్ని చాటేందుకు నడుంకట్టారు. ఇందుకోసం మాతృభాషను ఆధారం చేసుకుని దేశవిదేశాల్లో ఉన్న మన బాలబాలికల్లో దేశీయ విలువలను నాటడానికి పాటుపడుతున్నారు. “సైనిక దండయాత్రతో అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలుచుకున్న రీతిలోనే దేశవిదేశాల్లో తెలుగు భాషా భావుటాను సమున్నత సాంస్కృతిక పతాకగా ఎగురవేయాలన్నది నా కల” అంటూ తన వినూత్న ప్రయోగాన్ని, అందుకు గల నేపథ్యాన్ని తెలుపు టివితో పంచుకున్నారు.
పద్మలత గారు చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. కానీ, వృత్తిరీత్యా స్థిరపడ్డది సాఫ్ట్ వేర్ రంగంలో. ఉంటున్నది అమెరికాలోని సియాటిల్ నగరంలో. తెలుగు భాష అన్నా, మన సంస్కృతి అన్నా ఆమెకు ఎంతటి అభిమానం అంటే అమ్మ అంత ఇష్టం. దేశమంత ప్రేమ.
వారి కార్యరంగం భాహుముఖం. గతంలో అమెరికాలోని అట్లాంటా తెలుగు సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. IACA బోర్డు సభ్యులుగానూ సేవలు అందించారు. 2014లో ప్రాణహిత అన్న స్వచ్ఛంద సంస్థను స్థాపించి బుద్దిమాంద్యం గల రోగులకు అండగా ఉంటున్నారు. తాజాగా ‘చాణక్య’తో పలు కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతున్నారు.
ఈ ఆడియోలో వారు సంస్థ లక్ష్యాలను సుస్పష్టంగా ప్రకటించడం మీరు వింటారు. మరిన్ని వివరాలకు, సంప్రదించడానికి వారి వెబ్ సైట్ చూడవచ్చు: http://chanakyaleaders.org/