భారతీయ సినీ జగత్తులో వెండి వెలుగుల సంక్షిప్త పరిచయ ధారా వాహిక ఇది. ప్రపంచ సినీ చరితకు మన భరతదేశం అందించిన మహానుభావుల కృషి తెలుపు నీరాజనం ఈ శీర్షిక. ఈ వారం రెండవ పురస్కార గ్రహీత బి.ఎన్. సర్కార్ గారి జీవితకాలం కృషి వినండి.
దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార (Dadasaheb Phalke award ) గ్రహీతలను వారానికి ఒక్కరు చొప్పున ప్రముఖ సినీ విమర్శకులు, రచయిత, జర్నలిస్టు శ్రీ హెచ్ రమేష్ బాబు తెలుపు కోసం అందిస్తున్నారు. మొదటి భాగం దాదా సాహెబ్ పై ఉపోద్గాతం- దీన్ని క్లిక్ చేసి ఆ ఎపిసోడ్ వినగలరు. రెండవ వారం శ్రీమతి దేవికారాణి గురించి. నేటి ఎపిసోడ్ శ్రీ బి.ఎన్. సర్కార్ పై. మరి వినండి…ఆ వెండి వెలుగుల ఘనతను మననం చేసుకొండి.
హెచ్. రమేష్ బాబు గారి గురించి తెలుగునాట పరిచయం అక్కరలేదు. సినీ చరిత్రలో చెరిగిపోని సంతకాలను వారు అద్వితీయంగా అక్షరబద్ధం చేశారు. వినోద స్థాయిలో ఉన్న సినిమా పత్రికా రచనను వారు అమిత శ్రద్ధతో చరిత్ర, సాహిత్య గౌరవం పొందేలా చేశారు. అంతకు మించి మొన్నటి దాకా ఉప శీర్షికగా ఉన్న తెలంగాణ సినీ చరిత్రను వారు శిరోధార్యంగా చేసి, స్వీయ అస్తిత్వానికి పట్టాభిషేకం చేశారు. స్వతంత్ర రచన, పత్రికలకు శీర్షికలు, గ్రంధాలకు సంపాదకత్వం, తదితరాలుగా నిర్వహించిన వారి కృషి ఒక్క చోట గ్రంధస్తం అవుతే అది సినీ పరిశోధకులకు విలువైన సంపదే అవుతుంది.
వారు వెలువరించిన అనేక పుస్తకాల్లో కాంచన మాల జీవన చిత్రాలు, దాదా ఫాల్కే జీవిత చరిత్ర, ధృవాతార కన్నాంబ, మహానటి సావిత్రి, మార్గదర్శకుడు కెవి రెడ్డి, దర్శక చక్రవర్తి ఆదుర్తి సుబ్బారావు, నంది అవార్డు విజేతలు, తొలి నాటి సినిమా పాటల పుస్తకాలు పేర్కొనదగినవి. తెలంగాణ సినీ దిగ్గజం బి.నరసింగరావు గారిపై కూడా వారు ఒక గ్రంధం వెలువరించారు.