మానావమానాల విషయంలో గాని, మైత్రి విషయంలోగాని, కర్తృత్వ ఫలాపేక్ష విషయంలోగాని సమబుద్ధి ప్రదర్శించి సత్యపథగామి ఐన మనిషి తన ప్రయాణాన్ని కొనసాగిస్తే అతడు గుణాతీతుడుగా గౌరవింపబడడమే గాక మానవ సమాజానికి ఆదర్శనీయుడుగా కూడా గుర్తింపబడతాడు.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
“మానవమానయోస్తుల్య స్తుల్యో మిత్రారి పక్షయోః ।
సర్వారంభ పరిత్యా గుణాతీతః స ఉచ్యతే ॥“
అంటూ గుణాతీతుడైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలను స్పష్టంగా భగవద్గీత చెప్పింది. అర్జునుడు నిస్పృహ ఆవరించినప్పుడు తాను యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదని చెప్పి యుద్ధ పరాఙ్మఖుడై ఉన్న సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా పూనుకొని అతనిని తిరిగి తన కర్తవ్యం నిర్వహించడానికి అవసరమైన ప్రేరణ నివ్వడానికి బోధించిన భగవద్గీత లోకంలో కర్తవ్య విముఖుడైన ప్రతి వ్యక్తికి కూడా అవసరమైన ధర్మాలు అందిస్తూ ఉంది. ఆ సందర్భంలో ప్రతిమనిషి కొన్నిటి నుండి తాను దూరంగా ఉండాలంటూ అతడు గుణాతీతుడనిపించుకొని పురోగమించడానికి అవసరమైన అంశలను గురించి బోధిస్తూ ‘‘అర్జునా! మానావమానల యందు సమబుద్ధి కలవాడు, మిత్రులనైనా శత్రువులనైనా, సమదృష్టితోనే చూచేవాడు, కర్తృత్వాభిమానాన్ని వదలుకున్నవాడే గుణాతీతుడని గౌరవింపబడతాడు” అన్నాడు.
ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తి కూడా మానవమానాలకు గురౌతుంటాడు. ఆ సమయంలోనే తాను నిశ్చయాత్ముడుగా ఉండి స్తుతులకు, సత్కారాలకు పొంగిపోరాదు. అదేవిధంగా నిందలూ తిరస్కారాలకు కూడా కృంగిపోరాదు.
మనిషి తాను మానసికంగా ఎదగడానికి, తన సమాజం శత్రుభావనతో పరస్పరం కలహించుకొని, ఈర్ష్యాద్వేషాలు పెంచుకొని నశించిపోకుండ ఉండటానికి తాను కొంత మానసిక ఔన్నత్యాన్ని సాధించవలసిన అవసరం ఉంది. ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తి కూడా మానవమానాలకు గురౌతుంటాడు. ఆ సమయంలోనే తాను నిశ్చయాత్ముడుగా ఉండి స్తుతులకు, సత్కారాలకు పొంగిపోరాదు. అదేవిధంగా నిందలూ తిరస్కారాలకు కూడా కృంగిపోరాదు. సంతోషాలనైనా, సంతాపాలనైనా సమబుద్ధితోనే స్వీకరించగలగాలి. అటువంటి మానసిక పరిణతిని మనిషి సాధించాలి. హర్ష విషాదాలు రెండు ఒక విధమైన మానసిక వికారాలే గనుక రెండిరటినీ సమదృష్టితో చూడగలగాలి. సాధారణంగా వ్యక్తులు ఈ రెండింటికి చలిస్తూ ఉండటం సహజం. కాని వాటికి అతీతంగా తన మనస్సును తన ఆధీనంలో ఉంచుకోగలిగే వ్యక్తి ఉన్నతుడవుతాడు.
ప్రతివ్యక్తి తనకు తన అభిప్రాయాలకు వ్యతిరేకత ప్రదర్శించేవారు కొందరు వ్యక్తులుండడం సహజం. అవి కేవలం భిన్నాభిప్రాయాలుగానే చూడాలి తప్ప ఆ వ్యక్తులను ద్వేషించే శత్రువులుగా చూడరాదు. వాళ్ళను సైతం మిత్రులుగానే భావించాలి.
మరొక విశేషం కూడా కృష్ణభగవానుడు అర్జునునికి బోధించాడు. ప్రతివ్యక్తి తనకు తన అభిప్రాయాలకు వ్యతిరేకత ప్రదర్శించేవారు కొందరు వ్యక్తులుండడం సహజం. అవి కేవలం భిన్నాభిప్రాయాలుగానే చూడాలి తప్ప ఆ వ్యక్తులను ద్వేషించే శత్రువులుగా చూడరాదు. వాళ్ళను సైతం మిత్రులుగానే భావించాలి. వాళ్ళు ఎత్తిచూపే పొరపాట్లు ఏవైనా మీకు కూడా ఆ పొరపాట్లు దిద్దుకోవాల్సినవే అని అనిపిస్తే వాటిని సవరించుకోవాలి. ఒకవేళ మీ అభిప్రాయాలే సరైనవి ఐనప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోరాదు కాని భిన్నాభిప్రాయాలు కలిగినవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషించి పగవారిగా భావించరాదు. శత్రుభావన అనేదే మన మనస్సుల్ని వ్యాకులపరుస్తుంది కనుక వానిని దగ్గరికి చేరనివ్వరాదు. అది మానవత్వం ఉన్న మనిషి ఆచరించాల్సిన ధర్మం.
శత్రుగుణాల విషయాలను దూరంగా ఉంచి మిత్రునిగా భావించే స్థాయిని మనసు సాధించే దిశగా మన ప్రస్థానం సాగాలి. దానివల్ల మనలో పక్షపాతబుద్ధి ప్రవేశించదు. అది మన వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. అంటే వీరు మిత్రులు, వీరు శత్రువులు అనే భావం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అయినా సాధించగల శక్తిని మనిషి ఉపయోగించుకుంటే ఇది సులభసాధ్యమైనదిగానే భారతీయ ధర్మం భావించింది. జ్ఞాని ఐన వానికి సమదృష్టి అనేది సహజమైన గుణం.
ఒక్కోసారి ఆ ఫలాపేక్ష అనేది వ్యక్తిలో స్వార్థబుద్ధిని పెంచే అవకాశం ఉంటుంది. దానివల్ల స్వపర బేధ భావన మనస్సులో మొలకెత్తిస్తుంది. దానివల్ల మనిషి పతితుడయ్యే ప్రమాదం ఉంది.
ఈ శ్లోకంలో ‘‘సర్వారంభ” అనే పదం ఉంది. అంటే సర్వకర్మలు అనే అర్థం. మనిషి చేసే కర్మలను ఆరంభాలు అని కూడా అంటారు. ఏ కర్మనైనా ఆరింభిస్తారు గనుక ఈ మాటకు ఈ అర్థం చెప్పారు. ప్రతి కర్మకు ఒక ఫలితం విధిగా ఉంటుంది. ఒక్కోసారి మన కర్మఫలాలు మరో జన్మలో కూడా పొందే అవకాశం ఉంది. కాని ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి కర్మఫలాలపై ఆసక్తి ఉండదు. ఆ విషయాన్నే స్వామివారు మరో సందర్భంలో కర్మలు చేయడంలోనే మనిషికి అధికారం ఉంది కాని కర్మఫలాన్ని గురించి యోచించరాదని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే కర్తృత్వ ఫలాపేక్ష కూడదన్నది భావం. ఒక్కోసారి ఆ ఫలాపేక్ష అనేది వ్యక్తిలో స్వార్థబుద్ధిని పెంచే అవకాశం ఉంటుంది. దానివల్ల స్వపర బేధ భావన మనస్సులో మొలకెత్తిస్తుంది. దానివల్ల మనిషి పతితుడయ్యే ప్రమాదం ఉంది. కనుక ఏ వ్యక్థిఐనా కర్తృత్వ ఫలాపేక్ష లేనివాడై కర్తవ్య నిర్వహణ చెయ్యడమే విధిగా భావించవచ్చు. ఆ విషయంలో మానసిక స్థాయిని పెంచుకోగలిగిన వ్యక్తి గుణాతీతుడై భగవద్భావనకు దగ్గరౌతాడు. అందువల్ల తనకు మానసిక ప్రశాంతతే గాక, తను జీవిస్తున్న మానవ సమాజానికి కూడా మేలు జరుగుతుందన్నది సత్యమైన అంశం.
అందుకే మానావమానాల విషయంలో గాని, మైత్రి విషయంలోగాని, కర్తృత్వ ఫలాపేక్ష విషయంలోగాని సమబుద్ధి ప్రదర్శించి సత్యపథగామి ఐన మనిషి తన ప్రయాణాన్ని కొనసాగిస్తే అతడు గుణాతీతుడుగా గౌరవింపబడడమే గాక మానవ సమాజానికి ఆదర్శనీయుడుగా కూడా గుర్తింపబడతాడు.