Editorial

Sunday, November 24, 2024
press noteఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 'కృతజ్ఞాతాభివందనం'- PRESS NOTE పూర్తి పాఠం

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ‘కృతజ్ఞాతాభివందనం’- PRESS NOTE పూర్తి పాఠం

ప్రియమైన ప్రజలకు…

నా జీవితంలో ఒక కీలక నిర్ణయాన్ని, ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి, వ్యక్తిగత కారణాల వల్ల, ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ, స్వచ్ఛంధ పదవి విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నాను. ఈ మేరకు నా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ కార్యదర్శి గారికి ఈ మెయిల్ ద్వారా తెలపడం జరిగింది. ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలోని, పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అరాకొర వసతుల నడుమ, ఎంతో శ్రమించి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో చేరి, రెండున్నర దశాబ్దాల పాటు సర్వీసు అందించాను. ఆ పదవీకాలం పూర్తవకుండానే ఈ వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొంత బాధ కలిగించినా, ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా, నా మనసుకు ఇష్టమైన పనులను, నాకు నచ్చిన రీతిలో చేయబోతున్నాను అనే ఆనందం నాకు మరింత ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తోంది.

పేదలకు సేవ చేసే అవకాశమిచ్చిన భారత ప్రభుత్వానికి, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ మరియు నేటి తెలంగాణ ప్రభుత్వాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

ఇలాంటి కీలకమైన సమయంలో నాకు బాసటగా నిలబడి నా ఈ నిర్ణయాన్ని గౌరవించిన నా కుటుంబ
సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ ప్రస్థానంలో నాకు విద్య నేర్పిన గురువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, సహచర అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మా కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడక పని చేసిన సిబ్బందికి, వారి కుటుంబాలకుమీడియా మిత్రులకు స్వచ్ఛంధ సంస్థలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నన్ను నమ్మి, పలు హోదాలాలో ప్రజలకు, ప్రత్యేకించి పేదలకు సేవ చేసే అవకాశమిచ్చిన భారత ప్రభుత్వానికి, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ మరియు నేటి తెలంగాణ ప్రభుత్వాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నన్ను నా కుటుంబ సభ్యులను తమలో ఒకరిగా చేర్చుకొని మా పిల్లలను కంటికి రెప్పలా కాపాడి విధినిర్వహణలో నాకు వెన్నంటి ఉన్న పోలీసు సిబ్బంది రుణాన్ని ఏం చేసినా తీర్చుకోలేను. కేవలం నేను నా కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా, నాలాంటి అవకాశాలు రాని లక్షలాది పేద విద్యార్థులు, వారి కుటుంబాలకు సేవలు చేసి, వారి బిడ్డలను నాకంటే గొప్పగా తీర్చిదిద్దాలన్న నా నిర్ణయాన్ని స్వాగతించి, నాకు స్వేచ్ఛనిచ్చిన ఆయా సంక్షేమ శాఖామాత్యులకు మరియు అధికారులకు నా ధన్యవాదాలు.

పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకితభావంతో పని చేశాను.

పోలీస్ అధికారిగా సేవలు అందించి ఒక గుర్తింపును తెచ్చుకున్న నేను, మరింతగా పేద ప్రజలకు
ఉపయోగపడాలని కీర్తిశేషులు ఎస్.ఆర్.శంకరన్ గారి మార్గంలో పేదలకు నాణ్యమైన చదువు అందాలని
భావించాను. నా మూలాలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నాయి కాబట్టి, నా వంతుగా వాటికి సేవ చేయాలని, పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకితభావంతో పని చేశాను. అలా సంక్షేమ భవనంలో ఈ తొమ్మిది సంవత్సరాల కాలం, తొమ్మిది నిమిషాలుగా గడిచిపోయింది. లక్షలాదిమంది పేద బిడ్డలకు గురుకులాల సిబ్బందే తల్లిదండ్రులై, ఆ బిడ్డల బంగారు భవిష్యత్తును తమ స్వహస్తాలతో తీర్చిదిద్దుతున్న వారందరికీ నా పాదాభివందనాలు. కర్తవ్య నిర్వహణలో మీకు మీరే సాటి.
రాబోయే రోజుల్లో ఈ విద్యాసంస్థలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేవరకు విశ్రమించమని మన అందరం చేసిన ప్రతిజ్ఞను మీరు ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను.

చిన్నారి స్వేరోల్లారా…

సముద్ర గర్భం నుండి వినీల ఆకాశం వరకు విజయకేతనం ఎగరేసిన సాహసికులు మీరు.

ఈ తొమ్మిది సంవత్సరాలు నాతో పాటు అలుపెరుగకుండా, ప్రతీ పాఠాన్ని, ప్రయోగాన్ని, ఆటను, పాటను,పోటీని గుండెకు హత్తుకొని ప్రయాణించారు. సముద్ర గర్భం నుండి వినీల ఆకాశం వరకు విజయకేతనం ఎగరేసిన సాహసికులు మీరు. మీ బంగారు కలలను నిజం చేయాలని మేము పడ్డ ఆరాటం,
దానికి మీరు, ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులు అందించిన సహకారం, నాకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చాయి. మన సంకెళ్లను మనమే, మేధోశక్తితో తెంపుకోవాలన్న స్వేరో సిద్ధాంతాన్ని కాపాడవలసింది మీరే. స్వేరోయిజాన్ని భావితరాలకు పరిచయం చేస్తూనే మీ గొప్ప ఆలోచనల ద్వారా ఆవిష్కరణల ద్వారా స్వేరో అనే భావనను మరింత పదునెక్కించాల్సింది మీరే! మీ అంతిమ లక్ష్యం చేరుకునేదాకా, దయచేసి విశ్రమించకండి. మీకు సహాయం చేసిన వ్యక్తులను ఎన్నడూ మరవకండి. అలాగే స్వేరీ• పూర్వ విద్యార్థులు ఎక్కడ ఉన్నా అక్షరం, ఆర్థికం, ఆర్యోగం అనే మన మూడు లక్ష్యయాల్లో సాధికారతను సాధించే దిశగా మరింత శక్తితో పని చేయాలని పిలుపునిస్తున్నాను. పరాజిత జాతుల్లో వెలుగు రేఖలు పరుచుకోవాలని నిస్వార్ధంగా పని చేస్తున్న సమస్త స్వేరో  న్యాయకత్వానికి నా అభినందనలు.

తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి..

మీ పిల్లల భవిష్యత్తుపై మీరెలాంటి బెంగ పెట్టుకోకుండా, మునుపటిలాగే సంస్థకు ఎల్లవేళలా సహకరించాలని మనవి.

గురుకులాలు ప్రస్తుతం సమర్ధవంతమైన అధికారుల చేతిలో ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తుపై మీరెలాంటి
బెంగ పెట్టుకోకుండా, మునుపటిలాగే సంస్థకు ఎల్లవేళలా సహకరించాలని మనవి. అలాగే గురుకులాల విద్యాలయాలను నిర్వీర్యం చేసే కుట్రల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాను.
ఈ రెండున్నర దశాబ్దాల ప్రభుత్వ సర్వీసులో సాధ్యమైనంత వరకూ చట్టానికి, భారత రాజ్యాంగానికి లోబడే నా విధులు నిర్వహించాను. ఈ క్రమంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే, అవగాహన లోపం వల్లనే
జరిగిన తప్పులుగా భావించి, పెద్దమనసుతో క్షమించమని ప్రజలను కోరుతున్నాను.

భావి తరాలను ఒక కొత్త ప్రపంచంలోనికి నడిపించే ప్రయత్నం చేస్తాను. ఈ నా నూతన ప్రయాణంలో మీ అందరి దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

ఇక ఈ పదవివిరమణ తరువాత నా శేషజీవితమంతా మహనీయులు, నా స్ఫూర్తిప్రదాతలైన
మహాత్మజ్యోతిరావు పూలే దంపతులు, బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్, మాన్య శ్రీ కాన్షీరాం గార్లుచూపిన మార్గంలోనే నడిచి, పేదలకు పీడితులకు అండగా ఉండి, భావి తరాలను ఒక కొత్త ప్రపంచంలోనికి నడిపించే ప్రయత్నం చేస్తాను. ఈ నా నూతన ప్రయాణంలో మీ అందరి దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
mUmUST
డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
19.07.2021

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article