నేడు జులై 19 వ తేది
క్రీ.శ 1426 జులై 19 నాటి వెంకటాపురం (నెల్లూరు జిల్లా) శాసనంలో 2వ దేవరాయల పాలనలో ముత్తరాజు సింగనరాజుగారికి బయిచనబోయడు ఉదయగిరి రాజ్యంలో బోయవిడిలో కుడిచలపాడు వద్ద దశబంధానికి కట్టించిన చెరువును క్రయము చేసినట్లుగాను, దానిపై వచ్చే సకల లాభాలను ఆచంద్రార్కము అనుభవించవచ్చని చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు III Udayagiri 46].
అట్లే క్రీ.శ 1579 జులై 19 నాటి కట్టకిందిపాలెం (ప్రకాశం జిల్లా) శాసనంలో శ్రీ రంగరాయ దేవమహారాజు రాజ్యం చేస్తుండగా చెన్నప్ప నాయనింగారు పోలిచర్ల చెన్నరాయనికి (దేవర) దాశ్యానికి (సేవలు) పంచపర్వాలకు 3 పుట్ల భూమినిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు II Kanigiri.15].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.