నలుపు అనగానే చీకటి అని, తెలుపు అనగానే వెలుతురు అని అనుకుంటాం. కానీ నలుపు అంటే అణచివేత అని, తెలుపు అంటే ఆ పరిస్థితిని తెలుపడం అని అనుకోవాలి. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుధారక్ ఒల్వె ఫోటోగ్రఫీ ఆ కోవలో చేసిన కృషి అద్వితీయం. ఆ నీలి రత్నం గురించి తెలుపు ఈ వ్యాసం.
కందుకూరి రమేష్ బాబు
ముంభై మహా నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను నలుపు తెలుపుల్లో బంధించిన సుధారక్ ఒల్వె భారతీయ ఫోటో జర్నలిస్టుల్లో ఒక అరుదైన రత్నం. ఆయన దళిత జాతి వెతలను, వారి కన్నీళ్లు – కడగండ్లను ఎంతో సాహసంతో ఛాయా చిత్రాల్లోకి అనువదించిన మేధావి. 2016లో వారిని పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం సత్కరించదానికి కారణం కూడా అయన నలుపును తెలిపినందుకే.
ఆత్మగౌరవం మొదలు
అవును. ముంభైలోని ఒక మరాఠీ పత్రికకు ఫోటో ఎడిటర్ గా పనిచేస్తూనే ఆయన ప్రపంచానికి ఈ దేశంలోని అంటరానితనం, అణచివేత గురించి ఎంతో బలంగా చెప్పారు. న్యాయం, ధర్మం కంటే ముందు కనీస సోకర్యాలతో కూడిన పని, ఆత్మగౌరవంతో కూడిన జీవితం అత్యవసరం అని తెలియజేశారు. వారి చెప్పుకోదగిన పనులెన్ని ఉన్నా అందులో తొట్ట తొలుత చేసిన పనుల్లో చెప్పుకోదగింది మ్యాన్ హోల్ కింద ఉన్న మనిషిని చూపించిన విధానం. అది మనల్నిఎంతగానో కలచివేస్తుంది. భయపెడుతుంది. మన ఉదాసీనతను ప్రశ్నిస్తుంది.
ఈ రెండు ఫోటోలు
మ్యాన్ హోల్ కింది మనిషినే కాదు, చెత్తకుండిలో పారేసిన బిడ్డను వారు చూపించన విధానం ఎవరమూ మరచిపోలేం.
ఈ రెండు చిత్రాలు చాలు, ఈ దేశంలో మ్యాన్ హిల్ కిందా, చెత్త కుండి వద్దా, ఈ రెండు చోట్లా పని చేస్తున్న మనిషి గురించి చెప్పడానికి. అంతేకాదు, పైనుంచి ఏది పడితే అది, ఆఖరికి కన్న బిడ్డను కూడా చెత్తలా పారేసుకునే ఈ దేశ దుస్థితినీ తెలియచెప్పడానికి కూడా.
హక్కుగా మనం చేయవలసినది, బాధ్యతగా మనం అనుసరించ వలసినవి. ఈ రెండూ అయన చిత్రాలు మనకు గుర్తు చేస్తాయి.
ఈ దుర్మార్గ వ్యవస్థలో మురికిని, చెత్తా చెదారాన్ని ఎత్తి పోసే మన సోదర మానవుడి మహాప్రస్థానాన్ని ఆయన వలే వాస్తవంగా, సన్నిహితంగా చూపిన వారు మరొకరు లేరు.
రెండు విషయాలు కాకుండా ఒకే ఒక మాట చెప్పవలసి వస్తే, ఒక్కమాటలో ఈ దుర్మార్గ వ్యవస్థలో మురికిని, చెత్తా చెదారాన్ని ఎత్తి పోసే మన సోదర మానవుడి మహాప్రస్థానాన్ని ఆయన వలే వాస్తవంగా, సన్నిహితంగా చూపిన వారు మరొకరు లేరు. అందుకే సుధారాక్ ఒల్వె ఒక నలుపును తెలుపు పద్మశ్రీ.
హైదరాబాద్ స్ఫూర్తి
మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో జరిగిన ఫోటో ఫెస్టివల్ కి హాజరైన అయన ముంభై నగరం నుంచి ఒక దశలో తాను పారిపోయి హైదరాబాద్ వచ్చానని, ఇక్కడి వీధులే తనకు జీవితాన్ని మరింత దగ్గరగా పరిచయం చేశాయని అనడం విశేషం. తిరిగి ముంబై వెళ్ళిన అయన మురికి వాడలను, అక్కడి జీవితాలను మరింత దగ్గరగా అలుముకుని తన జీవితాన్ని ఫోటోగ్రఫీతో మరింత నలుపు చేశాడు. మనకు తెలపడం ఒక్కటే ఆయన కర్తవ్యం చేసుకున్నారు.
ముక్కూ మొహం
అయన ముంభై పారిశుధ్య కార్మికుల జీవితాలతో పాటు కామాటీపురలోని రెడ్ లైట్ జీవితాలను ఎంతో మానవీయంగా చూపించారు.
ఈ చిత్రం చూడండి. ముక్కు కోసేయబడ్డ ఆ మహిళ ఈ దేశంలోని కుల వ్యవస్థ తాలూకు పీడన గురించి మీకు ఎంతటి చేదునిజాలు చెబుతుందో!
అంతేకాదు, మహారాష్ట్రలో కుల దురహంకారంతో అగ్రవర్ణాలు దళితులపై కొనసాగిస్తున్న అరాచకాలను రెండు దశాబ్దాలుగా వెలుగులోకి తెస్తున్నారు. ఉదాహరణకు ఈ చిత్రం చూడండి. ముక్కు కోసేయబడ్డ ఆ మహిళ ఈ దేశంలోని కుల వ్యవస్థ తాలూకు పీడన గురించి మీకు ఎంతటి చేదునిజాలు చెబుతుందో!
నలుపు తెలుపు వెనుక నీలం
ఈ ఫోటో జర్నలిస్టు మరెన్నో పనులు చేసినప్పటికీ, మ్యాన్ హోల్ కింద ఉన్న మానవుడిని చూపిన తీరు దానికదే సాటి. అదే నిఖార్సైన నలుపు తెలుపు. ఆ పని చేసిన పద్మశ్రీ సుధారక్ ఒల్వె దళిత బిడ్డ. నీలం వారి ఆశయం, ఆదర్శం. అందుకే ఇంతటి నిబద్దత. నిమగ్నత.
వారి అలుపెరగని కృషికి మనసారా అభినందనలు తెలుపు.
సుధారక్ ఒల్వె ఫోటోగ్రఫీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://www.sudharakolwe.com/
సహతచరా, చాలా బాగా రాశావు.