Editorial

Sunday, September 22, 2024
Photo Featureతెలంగాణా 'వరం' – రామ వీరేశ్ బాబు

తెలంగాణా ‘వరం’ – రామ వీరేశ్ బాబు

మన బొట్టు… మన బోనం… మన జాతర… రామ వీరేశ్ బాబు. ఒక జాతికి రీతికి దేశానికి ఒక ఇంటి ఫోటోగ్రాఫర్ ఎట్లా ఉంటాడంటే ఇట్లా ఉంటాడు. చదివి చూడండి. నిజానికి అతడు అర్థం కావాలంటే ఒక మొక్కు ఉన్న మనిషి గ్రామదేవతని దర్శించుకోవడమే. అది విశ్వాసాలకు అగుపించే అంజనం కూడా.

కందుకూరి రమేష్ బాబు

తెలంగాణ ఛాయా చిత్రకారుల్లో వీరేష్ బాబుది భిన్నమైన ఒరవడి, తనది అరుదైన ఛాయ. అలుకు జల్లిన వాకిట్లో ముగ్గు కనపడితే ఆగిపోయే మనిషి అతడు. పసుపూ – కుంకుమ, జాజు – సున్నంతో కూడిన మనవైన ఈస్తటిక్స్ ఎక్కడుంటే అక్కడ ఫొటో తీస్తారు. అది ఆడ మనిషా మగ మనిషా అన్నది కాదు, మనిషి ఎక్కడ తాదాత్మ్యం చెందుతాడో అక్కడే క్లిక్ చేస్తారాయన. అతడి చిత్తం జంపన్న వాగు. ఆ వాగులోకి దిగి తడిసి ముద్దై వరం బట్టే తెలంగాణ వనిత వినిర్మల హృదయం అతడి అంతరంగం. గాల్లోకి కోడిని ఎగరేసి ఎదిరిచ్చే సమున్నత సంప్రదాయమూ తన సొంతం. వీటన్నిటికీ కారణంగా అతడు ఓరుగల్లు బిడ్డ. జాతర ఫొటోలు తీసే తెలంగాణ భూమి పుత్రుడు. అడుగున పడుతున్న మన పురా జ్ఞాపకాల చరిత్రకారుడు తాను.

మిత్రులు, ఫొటోగ్రాఫర్లు ‘బ్లూ’ అని పిల్చుకునే రామ వీరేష్ బాబు నిజానికి పెద్ద డిగ్రీలు చదవలేదు. బి.ఎస్సీతోనే సరిపెట్టుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్లో కూడా డిగ్రీలూ లేవు. కానీ ‘ఒకలాంటి ప్రేమఅతడ్ని కెమెరా చేత బట్టించింది. భరత్ భూషణ్, ప్రభాకర్, రాజన్ బాబుల స్ఫూర్తితో తనని తాను సుద్రాయించుకున్న సుతారి తాను.

తాను పదవీ విరమణ చేశారు గానీ చేసింది పోస్టల్ డిపార్ట్మెంట్లో మామూలు ఉద్యోగం. తపాలా భీమా విభాగంలో ఆసిస్టెంట్ గిరి. భార్య అనూరాధ, కూతుళ్లు నీలిమ, నిహారికలు. హైదరాబాద్లోని గౌలిపురలో నివాసం.

వీరేష్ బాబు. అందుకే తనకి కెమెరా పట్టడం అన్నా వరం పట్టడం అన్నా ఒట్టి పని కాదు. ధ్యాస. నమ్మకం. విశ్వాసం. అశీర్వాదం. మరో మాటలో తిరిగి తిరిగి జన్మ నెత్తడం

మనిషి ఎత్తుగా ఉంటాడు. బిడియంగా మాట్లాడుతాడు. పెద్దగా ఆసక్తి కలిగించే మనిషిలా ఉండడు. కానీ కొంచెం మాటలు కలిపితే సమ్మక్క సారక్కలు మొదలు తాను పుట్టి పెరిగిన వరంగల్ జిల్లాలోని జాతర్లన్నీ కలియతిప్పుతడు. ‘మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ’ అన్నది ఇలాంటి మనుషుల గురించి చెప్పుకునే పదబంధం. తానొక సాంస్కృతిక పరివాహం అనాలి. అవును మరి. నిజంగానే ఆయన నూటికి ఎనభై శాతం ప్రజల సంబురాలను ఎత్తిపట్టిన బోనం. అట్లా మేడారం జాతర ఒక్కటేకాదు, వరంగల్ జిల్లాలో జరిగే కొమ్రెల్లి మల్లన్న జాతర, కొత్తకొండ వీరన్న జాతర, ఐనోలు మల్లన్న జాతర, కురివి వీరభద్రుడి జాతర – వీటన్నిటినీ ఆయన ఫొటోగ్రఫి చేసాడు. ఒక్కో జాతరని, ఆ జాతర్లకు వెళ్ళే జన సామాన్యాన్ని, ఆ సుద్దరోళ్ళ వినిర్మల, నిసర్గ సౌందర్యం, వారి నిఖార్సయిన విశ్వాసాలు, వాటన్నిటినీ ఆయన కండ్ల ముందర పటం గట్టి చూపించాడు. ఒకానొక పురా జ్ఞాపకాల్లో మనల్ని పునీతం చేస్తడు. ఎందుకంటే అతడి మాటలు వేరు, ఫోటోలు వేరు కావు. రెండూ ఒకటే.

తానొక సాంస్కృతిక పరివాహం అనాలి. అవును మరి. నిజంగానే ఆయన నూటికి ఎనభై శాతం ప్రజల సంబురాలను ఎత్తిపట్టిన బోనం.

తాను చిన్నప్పట్నుంచీ జాతర్లకు వెళ్లిన మనిషి. అమ్మానాన్నలు, నాయినమ్మ, పెద్దమ్మ, తాతమ్మ, తాతలతో ఎడ్లబండిమీద వెళ్ళిన మనిషి మూడ్రోజుల పాటు ప్రయాణం చేసిన బాలుడు. ఆగి ఆగి ప్రయాణం… అట్లా మేడారం దాకా వెళ్ళిన అనుభవాలు. అవే జ్ఞాపకాలు అతడ్ని కెమెరా భుజాన వేసుకుని మళ్ళీ పెద్దయ్యాక వెంబడించేలా చేశాయి. వెళితే అవే దృశ్యాలు… స్త్రీలు వరం పట్టడం. పిల్లలు కాకపోతే జంపన్న వాగులో స్నానం చేసి రేగుచెట్టు ముందు నిలబడటం. నిలబడి అట్లా ధ్యానంలోకి వెళితే, ఆ భగవంతుడి సన్నిధిలో తాదాత్మ్యం చెందితే… గంటలు గంటలు… హఠాత్తుగా తెలివయి, తూలి పడిపోయే స్త్రీలు… నిప్పుల గుండం మీద నడిచే తల్లులు. వాళ్ళని చిత్రించడం అంటే అది తన తల్లిని, తెలంగాణ తల్లుల్ని చిత్రించడమే. అందుకే అనడం, అతడిది ఒట్టి ఫోటోగ్రాఫి కాదని, జనజీవన జాతర అని. అమ్మతల్లికి నైవేద్యం అని.

ఒక లీనం, ఓ సంలీనం. ఆలుమగలు ఒకరిని ఒకరు దగ్గరకు తీసుకుని భగవంతుడిలో లీనం కావడం, అది ఆలుమగల ఆలింగనమే కావచ్చు. కాని భౌతికం కాదు. పారభౌతికం, ఆ తాదాత్మ్యం వ్యక్తిగతం కాదు, సామూహికం. అటువంటి అపూర్వ అలౌకిక క్షణాల్ని బంధించిన చిత్రకారుడు ‘బ్లూ’. ఆయన్ని రాయడం అంటే దృశ్యాదృశ్యంగా పొర్లు దండం పెట్టడమే. కళ్ళు మూసుకొని కలియ తిరగడమే.

ఒక లీనం, ఓ సంలీనం. అది ఆలుమగల ఆలింగనమే కావచ్చు. నిప్పుల మీద నడక కావొచ్చు. కాని భౌతికం కాదు. పారభౌతికం, ఆ తాదాత్మ్యం వ్యక్తిగతం కాదు, సామూహికం.

ఇట్లాంటి ఇమేజెస్ ను ఆయన వట్టిగనే చిత్రించలేదు. గడిచిన జీవితం పండ్ల చెట్టయితే ఆ చెట్టు ముందట నిలబడ్డాడు. అలా నిలబడితే దక్కిన ఫలమే ఇతడి ఇమేజెస్. అవును మరి! జాతర్లల్లో రాత్రుళ్లూ, పగళ్లూ గడిపిండు. ఎండకు మాడిండు. చలికి వణికిండు. మంచులో తడిసిండు.

అన్ని రోజులూ ఉన్నాయ్. చెట్లు నరికి, నెగడు పెట్టుకుని కట్టెల పొయ్యిల మీద వండుకు తిన్న రోజులు. కరెంటు గిరంటు ఏమీలేని రోజులు. బిందిలు లేవు, గిలాసలూ లేవు. చెలిమల్లో నీళ్లు తోడుకుని దాహార్తిని తీర్చుకున్న యాది దినాలు. తంతెలు గింతలే లేని సమ్మక్క సారక్కలు…. భరిణిలో కుంకుమతో గిరిజన పూజారుల రాక….. అక్కడ భవిష్యవాణి వినడం….ముగ్గేయడం, వరం బట్టడం, కోడెను కట్టేయడం, కోడిని ఎదిరివ్వడం……మీసాలు కొరిగిచ్చుకోవడం.. శిగమొచ్చి ఊగడం… బోనం ఎత్తుకోవడం….ఇట్లా ఒకటా రెండా? ఒక్కలా ఇద్దరా ? వేలు, లక్షలు. ఆ జన సందోహంలో కాటగలిసిపోకుండా సుతారంగా మనింటి దాకా వచ్చే మనిషే మన వీరేష్ బాబు. బహుజన జాతర ఫొటోగ్రాఫర్. సాంస్కృతిక వైభవం మిన్నగా గల తెలంగాణకు వరం తాను.


నూటికి ఎనభై శాతం మనుషుల సంబురం. ఆటా పాటా క్రతువులు. అందుకే ఈ ఛాయా చరిత్రకారుడి పరిచయాన్ని బోనాల సందర్భంగా ‘తెలుపు’ సగౌరవంగా అందిస్తున్నది. మన బొట్టు, మన బోనం, మన జాతరకు నమస్సులూ అని వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.

ఒక జాతికి రీతికి దేశానికీ (ప్రాంతానికి ) ఒక ఇంటి ఫోటోగ్రాఫర్ ఎట్లా ఉంటాడంటే ఇట్లా ఉంటాడని అందుకే చెప్పడం.

తనకి కెమెరా పట్టడం అన్నా. వరం పట్టడం అన్నా ఒట్టి పని కాదు. ధ్యాస. నమ్మకం. విశ్వాసం. అశీర్వాదం. మరో మాటలో తిరిగి తిరిగి జన్మ నెత్తడం ఉంది. అందుకే పదే పదే ఆ జీవన సంబరంలో మునిగి తేలుతడు. తిరిగిన ప్రదేశాల్లోనే తిరుగాడుతుంటడు. మనుషులు నిండు హృదయాలతో కొలిచే ఘట్టాలను ఒడిసి పట్టుకుంటడు. అది పేగుబంధం.

అయితే తనకు పెద్దగా పేరు రాలేదంటే అందుకు కారణం జాతర్లే. అవును, జనసామాన్యం సంబురానికి అంత పెద్ద కథ ఉందా అనుకునే వాళ్లే ఎక్కవగదా ! అందుకే అతడు తెలంగాణ మాదిరే ఎగబాకకుండా నిదానంగా ఉన్నాడు. ఎవరి పట్టింపుల్లోకి రాలేదు.

ప్రభుత్వాలకు పర్యాటకం కావాలి. ప్రజలకు విశ్వసనీయమైన ఆన కావాలి. రెండిటి మధ్య దూరం అట్లాగే ఉండింది. అందుకే వీరేష్ బాబును మనం ఇంకా మంచిగా చూడ వీలు కాలేదు.

చిత్రమేమిటంటే, అసలు ప్రపంచంలోని అతి పెద్ద జాతర్లలో మన మేడారం జాతర చెప్పుకునే సందర్భం వచ్చింది. మన బతుకమ్మను మనం పేర్చుకునే సందర్భం వచ్చింది. నిజానికి వచ్చింది, పోయింది. ప్రభుత్వాలకు పర్యాటకం కావాలి. ప్రజలకు విశ్వసనీయమైన ఆన కావాలి. రెండిటి మధ్య దూరం అట్లాగే ఉండింది. అందుకే వీరేష్ బాబును మనం ఇంకా మంచిగా చూడ వీలు కాలేదు. ఇంకా చూడవలసే ఉంది. అతడి ఫొటోల్లో ఏమున్నదో చూసి మురిసిపోవాల్సి ఉన్నది. తనది బాల్య చేష్ట కాదని, తన ఊరును, వాడనూ, వాగుల్నీ వంకల్నీ, జనాల్నీ, జాతర్లనీ- మన బొట్టు మన బోనాన్ని మళ్లీ చూసి, దాని విశిష్టతను పెద్దగా చెప్పుకోవలసి ఉంది. ఆ సందర్భంలో వీరేష్ బాబు పెద్దవాడే అయితడు.

వాటిల్లో జాతర ఒక సబ్జెక్టయితే, గడియారాలు ఇంకో సబ్జెక్టు, అలాగే తల్లులు బిడ్డలా సంక్షేమం కోసం బువ్వ వండి తలకెత్తుకున్న బోనం మరో సబ్జెక్టు.

అలా అని ఇతడు అనామకుడూ కాదు. మన రాష్ట్రంలో అతికొద్ది మంది సాధించిన ఘనతలన్నీ అతడు అతి సామాన్యమైన జీవన దృశ్యాలతో, జన జీవన సంస్కృతీ సాంప్రదాయాలతో సాధించిన మాన్యుడు. వాటిల్లో జాతర ఒక సబ్జెక్టయితే, గడియారాలు ఇంకో సబ్జెక్టు, అలాగే తల్లులు బిడ్డలా సంక్షేమం కోసం బువ్వ వండి తలకెత్తుకున్న బోనం మరో సబ్జెక్టు.

ఇవికాక చెట్లు పుట్టలు అతడికిష్టమైన మరో వ్యాపకం. వాటిని తన కెమెరాతో బంధించి ప్రపంచ స్థాయి ఫొటోగ్రఫీ సంస్థల్లో సభ్యత్వం సాధించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లోని రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ అసోసియేట్ షిప్ తో అతడ్ని గౌరవించింది. ఇతడి మేడారం జాతర ఫోటోల్ని ముంబైలోని ప్రసిద్ధ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శించింది. బి.నరసింగ్ రావు సంకలనం చేసిన బోనాలు కాఫీ టేబుల్ బుక్ లో అతడే ప్రధాన వైభవం. ఒక్క మాటలో నిశబ్దంగా మన వైభవాన్ని జాతీయస్థాయిలోకి తీసుకెళ్లిన ఫొటోగ్రాఫర్ వీరేష్ బాబు.

అయితే, ఇదంతా తాను ఒక ప్రాజెక్టులో భాగంగా చేయలేదని గ్రహించాలి. ముందే చెప్పినట్టు చదువుకోసం తీసింది కూడా కాదు. కేవలం ఉండబట్టలేక, తన మైండ్ లో మళ్లీ మళ్లీ తిరగాడే ఆ జ్ఞాపకాలకు చిత్రిక పట్టిండు. అదే ఈ ఫొటోగ్రాఫర్ని జాతర స్పెషలిస్టును చేసింది.

జీవితంలోని సూక్ష్మతని, జానపదుల విశ్వాసాల్లోని సంలీనాన్ని ఆయన చూపినట్టు ఇంకెవరూ చూపలేదు.

అవును మరి. జీవితంలోని సూక్ష్మతని, జానపదుల విశ్వాసాల్లోని సంలీనాన్ని ఆయన చూపినట్టు ఇంకెవరూ చూపలేదు. అందుకే ఆయన్ని సామాన్యుడనుకోవద్దు. ఆయన సబ్జెక్టులూ సరళంగా కనిపించినంత మాత్రాన అవి ‘సింపుల్’ అని కొట్టి పారేయనూ వద్దు. ఎందుకంటే, అది తాను జీవించి, అనుభవించి, పలవరించిన అనుభవ పాఠాలు. అంతకు మించి గతకాలపు వైభవ చిహ్నాలు, నూటికి ఎనభై శాతం మనుషుల సంబురం. ఆటా పాటా క్రతువులు. అందుకే ఈ ఛాయా చరిత్రకారుడి పరిచయాన్ని బోనాల సందర్భంగా ‘తెలుపు’ సగౌరవంగా అందిస్తున్నది. మన బొట్టు, మన బోనం, మన జాతరకు నమస్సులూ అని వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. మరి నేటి నుంచి మొదలైన బోనాలను మరింత శ్రద్దగా తిలకించమనీ మిమ్మల్నీ కోరుతున్నది. పండగ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్సులు.

More articles

20 COMMENTS

  1. Perfect story of Telangana Jathatra.photographer Rama. Veeresh babu excellent supporting images ,well written and timely presented by kandukuri ramesh babu. Amazing story hats off to you Mr. Ramesh.

  2. Thanks Ramesh for your wonderful article on me. It’s a memorable day. Enjoyed reading my article. I did a little work and there is more to do. Till my health permits I keep on doing photography. Once again thank you Ramesh.

  3. తన ఫొటోలతో చరిత్రని లిఖిస్తున్న ఒక అద్భుతమైన చరిత్రకారున్ని పరిచయం చేశారు… తన సమకాలీయునైన నేను వీరేశ్ బాబు గారిని ఒక్క సారైనా ముఖతా కలవాలని ఉంది…

  4. వీరేష్ బాబు జిజ్ఞాస తనను ఉన్నత శిఖరంలో నిలిపింది.తన చిత్రాల ద్వార మన ఉనికిని మనకు గుర్తు చేస్తూ ఈ క్షణం ఒక అలౌకిక ప్రపంచంలో విహరింప చేస్తుంటే అంతకంటే కోరుకునేదేమున్నది.ఆధ్యాత్మికత ఆవిష్కరించడంలో తనదైన శైలి అత్యున్నతమే మరి.ఎందరో మహానుభావులు భవిష్యత్ కు అందిస్తున్న నిధులని గ్రహించాలి.

  5. Indeed Rama Veeresh Babu is a renowned photographer of Telangana. I have seen his solo photography exhibitions where one can find traditional art of Telangana specially focused on Bonalu jataras n old clock towers etc., which are beautiful. Photography is a soul satisfying art and takes us closer to the emotion. His passion of photography is excellent and awesome. I thank Mr. Ramesh Babu Garu.

  6. Chandrasekhar Chanda

    An amazing personality, he is known to this world as a photographer, but as a childhood friend we know him as multi talented. Rama Veeresh Babu ( Blue) sometimes it is very difficult to recollect the name he is well known as Blue. He is an Artist does wonderful paintings, musically talented plays mouth organ,
    guitar, likes adventure and also humorous.

  7. I can’t read this write up but as always, Veeresh Babu’s images speak for themselves. He has lovingly captured grassroots cultural activities and a way of life in Andhra-Telangana region that is threatened by forces of globalisation, commercial entities and other vested interests. More power to his lens and to Telupu TV for highlighting such fine artists.

    • Thank you very much Vijay S. Jodha ji for your encouraging words. Can you please send your mobile number to my mail

  8. I know Mr. Veeresham Babu right from his marriage with Anuradha. A perfect pair. Mr.Veeresham was immensely involved in Photography. His photos exhibition held in Rabindra Bharati, was impressed many 25 years back. GOD bless him. Govt. of Telangana should honour him for his photographs… 🎉🎉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article