అనేక నియమాలు, ఎన్నో కట్టుబాట్లు, పలు నిబంధనలు – ఇవన్నీ మానవుని ఉత్తమశీలవంతునిగా తీర్చిదిద్దడానికే తప్ప వేధించడానికి కాదన్న విషయం మనం గ్రహించాలి.
‘‘య ఆత్మనో దుశ్చరితాదశుభం ప్రాప్నుయాన్నరః ।
ఏ నసా తేన నాన్యం స ఉపాశంకితు మర్హతి ॥’’
సమాజం ఆరోగ్యంగా ఉండటానికి, ఆ సమాజంలోని వ్యక్తులు ఆరోగ్యకరమైన ఆలోచనలు కలవాళ్ళై ఉండాలి. వారి ప్రవర్తన, వారి నడవడిక సర్వజనామోదకరంగా ఉండాలి. ఆ నడవడికను, ఆ ప్రవర్తనలనే మన పూర్వులు ‘శీలము’ అన్నారు. వ్యక్తి ఉత్తమ శీలవంతుడు కావడానికే ప్రాచీనకాలం నుండి మన గ్రంథాలు బోధించే ప్రయత్నం చేశాయి. దానికి హృదయశుద్ధి కావాలి. హృదయశుద్ధి కొరకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపాయి. ఆ విషయంలో మన పూర్వులెవరూ కూడా వెనకబడలేదు, పైగా అనేక హెచ్చరికలు కూడా చేసి పాపభీతిని కూడా కలిగించే యత్నం చేశారు.
శీలవంతుడు కాని వ్యక్తికి ఏనాటికీ అభివృద్ధి ఉండదు. అందుకని ప్రతివ్యక్తి గొప్ప ఆత్మవిశ్వాసంతో తన నడవడిని తన ప్రవర్తనను మార్చుకొని సమాజంలో తల యొత్తుకొని నిలవాలి.
శీలవంతులు కాని వ్యక్తుల సమూహం మానవుని ప్రశాంత జీవనాన్ని భగ్నం చేస్తూ ఉంటాయి. శీలవంతుడు కాని వ్యక్తికి ఏనాటికీ అభివృద్ధి ఉండదు. అందుకని ప్రతివ్యక్తి గొప్ప ఆత్మవిశ్వాసంతో తన నడవడిని తన ప్రవర్తనను మార్చుకొని సమాజంలో తల యొత్తుకొని నిలవాలి. తన శీలమే లోకానికి ఆదర్శం కావాలి. తన కారణంగా ఏవైనా దుష్పలితాలు వస్తే వాటిని అధిగమించాలి తప్ప అవి ఇతరులపై రుద్దకూడదు. అది నిజమైన శీలవంతుని లక్షణం. ఇతరులపై తప్పుపెట్టి తాను రక్షించుకునే యత్నం చెయ్యరాదు. దానివల్ల అతని జీవితంలో అభివృద్ధి ఉండదని మహాభారతంలోని భీష్మపర్వంతో వేదవ్యాసమహర్షి ఈ శ్లోకంలో చెప్పాడు. ‘‘తన చెడ నడతవల్ల తాను చేసిన పాప కార్యాల వల్ల ఏదైనా దుష్ఫలితాలు వస్తే అవి తానే అనుభవించాలి తప్ప తన దోషాలను ఇతరులకు ఆపాదించరాదు. దానికి అవతలివారిని బాధ్యలను చెయ్యరాదు. చాలామంది చెడ్డపనులు తాము చేసి వాటివల్ల వచ్చిన చెడు ఫలితాలు వస్తే ఆ పనులను ఇతరులకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా చెయ్యడం తప్పు’’ అని చెప్పడం ఆ వ్యక్తిలోని శీలదోషాన్ని తెలుపుతున్నది.
శీలవంతుడైన వ్యక్తికి ఎదుటివారిపై గౌరవం ఉంటుంది. ప్రతి వ్యక్తిని కూడా గౌరవించే రీతిలో అతని ప్రవర్తన అతని మాటలు ఉంటాయి. ఈ విషయాన్ని స్కాందపురణం కూడా ధ్రువపరచింది. మంచి నడవడి లేని వ్యక్తుల వ్యవహారశైలిని, వారి ప్రవర్తనను గురించి ఆ పురాణమే…
‘‘స్త్రీ పుత్ర మిత్ర సుహృదాం ఆశాచ్ఛేదకరాశ్చయే ।
జనస్కాప్రియావక్తార: క్రూరా: సమయభేదిన: ॥’’
‘‘స్త్రీలకు, పుత్రులకు, మిత్రులకు, సజ్జనులకు తమ మాటలచేత పలు వాగ్డానాలు చేసి చివరకు ఆశాభంగము చేసేవారు, ఇతరులతో అప్రియములు మాట్లాడేవారు, క్రూరంగా, కఠినంగా, దయలేనివారుగా వ్యవహరించేవారు’’ మహాపాపులని స్పష్టపరచింది. శీలవంతులైన వ్యక్తులు ఇటువంటి పాపపు పనులకు దూరంగా ఉంటారు.
పాపపుణ్యాల ప్రసక్తి తీసుకొనివచ్చే ప్రయత్నం మానవ ప్రవర్తనను సరిద్దిదడానికే. అందుకే మన శాస్త్రాలన్నీ ఈ దిశలో ఆలోచించేందుకు అనేకవిధాలైన ధర్మాలను ప్రవచించాయి. ఇది సార్వకాలిక ధర్మము.
పూర్వులు మానవ ప్రగతి కొరకు ఎంత తపించారో, మనిషి నడవడిని ఋజుమార్గంలో పెట్టాలని ఎంత యోచించారో వీటి అధ్యయనం చేసినవారికి అర్థమవుతాయి.
‘‘లోకో భిన్నరుచి:’’ అన్న మాట బాగా ప్రచారంలో ఉంది. ప్రతి వ్యక్తికీ ఒక ఆలోచనాధోరణి ఉంటుంది. భిన్న భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల సమూహమే సమాజం కనుక భిన్న భిన్న ప్రవర్తనలు మనకు దర్శనమిస్తుంటాయి. నైతిక విలువలే సమాజోన్నతిని సాధిస్తాయి. భిన్నాభిప్రాయాలున్నవారినందరిని కూడా ఏకతాటిపైకి తెచ్చి సామాజిక ప్రగతిని సాధిస్తాయి. ఆ క్రమంలోనే భారతీయ ధర్మాలు వానికి ఆధ్యాత్మిక భావాలను పునాదిగా చేసుకొని విస్తృత సాహిత్యాన్ని సృష్టించాయి. అందుకే అనేక ఉపనిషత్తులు, అన్ని పురాణాలు, మరెన్నో శాస్త్రాలు పుట్టుకొచ్చాయి.
పూర్వులు మానవ ప్రగతి కొరకు ఎంత తపించారో, మనిషి నడవడిని ఋజుమార్గంలో పెట్టాలని ఎంత యోచించారో వీటి అధ్యయనం చేసినవారికి అర్థమవుతాయి. సత్యాలు గోచరిస్తాయి. మనిషి జీవితానికి కొన్ని నియమ నిబంధనలు విధించాయి. కొన్ని కట్టుబాట్లకు పూనుకొన్నాయి. అందుకే ‘‘విద్వేషం చ వినాశంచ మనసాపిన చింతయేత్’’ అని శుక్రనీతి వంటి గ్రంథాలు చెప్పాయి. ‘‘ఎవరినో ద్వేషించుటకు, ఎవరికో నష్టం కలిగించుటకు పూనుకొనే ఆలోచనలను కూడా నీ మనసులో రానివ్వద్ద’’ని చెప్పిన ధర్మాన్ని లోతుగా పరిశీలిస్తే వ్యక్తి ప్రవర్తన ఏ మార్గంలో సాగాలని ఆ మహనీయులు కోరుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అంతేగాక తాను ఒక వేళ దు:ఖంలో ఉన్నా ఎవరిని కఠినమైన మాటలతో బాధింపవద్దంటూ స్మృతులు పేర్కొన్నాయి.
‘‘నారుంతద: స్యాదార్తోపి న పరద్రోహ కర్మధీః ।
యయాన్యోద్విజతే వాచా నోలోక్యం తాముదీరయేత్ ॥’’
ఏ వ్యక్తి అయినా తాను దు:ఖితుణ్ణై ఉన్నానని ఎదుటివారిని పరుషమైన మాటలు మాట్లాడరాదు. ఫలానా పని చేయడంవల్ల ఇతరులకు ద్రోహం చేసినట్లవుతుందని సంశయం కలిగితే ఆ పనికి పూనుకోరాదు. ఇతరులను బాధ పెట్టే మాట కూడా మాట్లాడరాదు.
ఇన్ని నియమాలు, ఇన్నికట్టుబాట్లు, ఇన్ని నిబంధనలు మానవుని ఉత్తమశీలవంతునిగా తీర్చిదిద్దడానికే తప్ప వేధించడానికి కాదన్న విషయం మనం గ్రహించాలి.
ఉత్తమ వ్యక్తిని రూపొందించడానికి సహకరించేదే ఆధ్యాత్మిక విద్య. అది మంచిశీలం వల్ల మాత్రమే శోభిస్తుందన్న నిజాన్ని అన్ని గ్రంథాలు ముక్తకంఠంతో చెప్పాయి.