నేడు జూలై 8 వ తేదీ
క్రీ.శ 1308 జూలై 8 నాటి టెక్మాల్ (మెదక్ జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో ప్రధాని, పురవరి మహదేవనాయకులు టేక్మల్ అష్టాదశ ప్రజల అనుమతిని ఆ గ్రామ భూములపై వచ్చే ఆదాయంలో కొంతభాగము (మాడ బడి పాదికలెక్క) ఆ ఊరి మూలస్థానం భోగనాథదేవర భోగానికిచ్చినట్లుగా చెప్పబడ్డది. [మెదక్ జిల్లా శాసనాలు. నెం.135].
అట్లే క్రీ.శ 1397 జూలై 8 నాటి ముదివేడు (చిత్తూరు జిల్లా) శాసనంలో హరిహర రాయల పాలనలో మహానాయంకరాచార్య మోట్ట దోరపనాయనింగారు బల్లెగానచెరువు కింద తమకిచ్చిన భూములను తిప్పిశెట్టి కొడుకు తిప్పిశెట్టి కూతురు తిమాయలు తిరువెంగళనాథునికి, మల్లికార్జునదేవరకు, భయిరవ దేవరకు, ముక్కొండ్ల రంగనాథునికి, దేవబ్రాహ్మణ వ్రిత్తులను,సేషము చెంన్నయగారి కుమారుండు రామవొజ్యులంగారికి పెట్టినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.ని.శా XVI నెం. 9.].
అట్లే క్రీ.శ 1515 జూలై 8 నాటి అమరావతి శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు పూర్వ దిగ్విజయ యాత్రలో ఉదయగిరి మున్నగు రాజ్యాలను జయించి అమరావతికి విచ్చేసి అమరేశ్వరునికి అనేక దానములనిచ్చినట్లు రాయలవారు “తులాపురుష” దానమిచ్చినట్లు, చిన్నాదేవి రత్నధేను మహాదానమును, తిరుమలదేవి సప్తసాగర మహాదానమును యిచ్చినట్లు, రాయలవారు అమరేశ్వరదేవర నైవేద్య మహాపూజలకు పెద మద్దూరుగ్రామాన్ని యిచ్చినట్లు 118 మంది బ్రాహ్మణులకు నిడమానూరు. వల్లూరు గ్రామాలనిచ్చినట్లు, తమ పురోహితులైన రంగనాథదీక్షితులకు, శివదీక్షితులకు కొత్తపల్లి త్రోవగుంట గ్రామాలను యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా VI నెం 248].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.