Editorial

Friday, November 22, 2024
సైన్స్గతం గతః కాదు, గతం వర్తమానః - ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

గతం గతః కాదు, గతం వర్తమానః – ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

అంతరిక్షంలో ఓ వస్తువును చూడాలంటే దాని గతాన్నే చూడాలనేది సహజ విశ్వసూత్రం! నిజం. అందుకే గతం గతః అనుకోనక్కరలేదు, వర్తమానమే అంటున్నారు సూరజ్ వి. భరద్వాజ్ నేటి తన కాలమ్ లో…

ఖగోళమంతా మిధ్య! గతాల గమ్మత్తు! భూమ్మీద నుంచి చూస్తే అక్కడ కనిపించేదేదైనా గతం! కాంతివేగాన్ని అధిగమించి వినువీధిలో ప్రయాణించి గమ్యాన్ని చేరితే అది వర్తమానం! అక్కడి వర్తమానం బహుశా మనకు భవిష్యత్తు! అంతరిక్షంలో ఓ వస్తువును చూడాలంటే దాని గతాన్నే చూడాలనేది సహజ విశ్వసూత్రం! అంతెందుకు ప్రత్యక్ష సూర్యుడిని మనమెన్నటికీ చూడలేం! ఉషోదయం వేళ ప్రసరించే సూర్యకిరణాలు సైతం మనకు కనిపించే కంటే 8 నిమిషాల 20 సెకన్ల క్రితం జనిస్తాయి. సూర్యుడి నుంచి 93 మిలియన్ మైళ్ళు ప్రయాణించి భూమికి చేరుతాయి!

మహావిస్ఫొటనమంటారు! మరి బిగ్ బ్యాంగ్ కు ముందేంటి? అది చోటు చేసుకున్న వేదిక ఎలాంటిది? దాని పుట్టుపూర్వోత్తరాలేంటి?

చిన్న అణువు నుంచి బ్రహ్మాండం ఆవిర్భవించిందంటారు! మరా అణువు ఆద్యంతాల రహస్యమేంటి?

విశ్వంలో అణువులు ఒకే సమయంలో రెండుచోట్ల ఉనికిలో ఉంటాయంటారు! ఆ కారణంగా సమాంతర విశ్వం మనుగడలో ఉండే అవకాశం ఉందంటారు! మరి ఆ మర్మమేంటి?

గురుత్వాకర్షణ శక్తి అత్యంత తీవ్రంగా ఉండే కృష్ణబిలాలు మరో బ్రహ్మాండానికి దారులంటారు! అవి మనల్ని భవిష్యత్ కాలంలోకి తీసుకెళ్తాయనే హైపోథెటికల్ థియరీలు కూడా ఉన్నాయి!

విశ్వక్షితిజం ఆవల ఏముంది? విశ్వం నిరంతరం వ్యాపిస్తుందంటారు! మరి శూన్యంలో దాని దారెటువైపు?

లాంటి విశ్వావిర్భావ రహస్యాలపై..

ఫోర్ డైమెన్షనల్ కాస్మాస్ లో టైం, స్పేస్, మాస్, గ్రావిటీ, బ్లాక్ మ్యాటర్, మ్యాటర్, యాంటీ మ్యాటర్, లైట్, ఫోటాన్స్, టైక్యాన్స్, క్వాజర్స్, నేబ్యులాలు, స్టార్స్, స్టార్ క్లస్టర్స్, మిల్కీవే, గెలాగ్జీలు, వైట్ డ్వార్ఫ్, రెడ్ డ్వార్ఫ్ లు, నోవా, సూపర్ నోవాలు, బ్లాక్ హోల్స్, కామెట్స్, ఆస్టెరాయిడ్స్

లాంటి సెలెస్టియల్ ఆబ్జెక్టులపై..

ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధనలు అప్రతిహతంగా కొనసాగడానికి మూలం టెలిస్కోప్!

వస్తువులను 3 రెట్లు పెద్దవిగా చేసి చూపించే టెలిస్కోపును 1608 లో మొట్టమొదలు కనుగొన్నది డచ్ శాస్త్రవేత్త హన్స్ లిప్పర్షే. కానీ, గెలీలి గెలీలియో రూపొందించిన టెలిస్కోపు మాత్రమే అస్ట్రనామికల్ సొసైటీ నుంచి పేటెంట్ పొందింది. దీంతో హన్స్ లిప్పర్షే మరుగునపడ్డాడు. కొన్ని మార్పుచేర్పులతో తాను కనుక్కొన్న టెలిస్కోపును మొట్ట మొదటిసారిగా విశ్వంలోకి ఎక్కుపెట్టిన వాడు గెలీలియో! అలా ఖగోళ వస్తువులను 30 రెట్లు పెద్దవిగా చూపించిన గెలీలియోనే టెలిస్కోపు ఇన్వెంటర్ గా చరిత్రకెక్కాడు! ప్రస్తుతం ఖగోళ పరిశోధనల కోసం ఆప్టిక్, రేడియో టెలిస్కోపులను సైంటిస్టులు వినియోగిస్తున్నారు. ఆప్టిక్ మోడల్లో రిఫ్రాక్టర్, రిఫ్లెక్టర్, కాంపౌండ్లనీ మూడు రకాల టెలిస్కోపులున్నాయి. వీటిని అంతరిక్ష పరిశోధనల కోసం వ్యోమనౌకలకు ఫిక్స్ చేస్తుంటారు!

విశ్వంలో కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు, గెలాగ్జీల పుట్టుక, నాశనం మొదలు ఒక మిలియన్ పరిశోధనలు హబుల్ టెలిస్కోప్ ద్వారా జరిగాయి.

 

ఇక స్పేస్ లో కోబ్, కెప్లెర్, గెలాక్స్ లాంటి ఓ 20 రకాల టెలిస్కోపులున్నా, వాటిలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ పాత్రే గణనీయమైంది! విశ్వంలో కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు, గెలాగ్జీల పుట్టుక, నాశనం మొదలు ఒక మిలియన్ పరిశోధనలు హబుల్ టెలిస్కోప్ ద్వారా జరిగాయి. ఇక హబుల్ కు కొనసాగింపుగా ఈ మధ్యే అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను నాసా తయారుచేసింది. దీన్ని 2021 (ఈ ఏడాది) నవంబర్లో రోదసీలోకి పంపనున్నారు. జేమ్స్ వెబ్ లో హబుల్ కంటే మెరుగైన ఇన్ఫ్రారెడ్ రిజల్యూషన్, సున్నితత్వం ఉన్నాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు ద్వారా విశ్వంలో తొలి గెలాక్సీలు ఏర్పడడం వంటి కొన్ని సుదూర సంఘటనలను, వస్తువులనూ పరిశీలించడంతోపాటు ఖగోళశాస్త్రానికి, విశ్వావిర్భావానికీ సంబంధించిన రంగాలలో విస్తృతమైన పరిశోధనలు జరపవచ్చు.

ప్రపంచంలో అతిపెద్ద ‘500 మీటర్ ఆపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్’ చైనాలో ఉంది.

అంతరిక్ష పరిశోధనల్లో రేడియో టెలిస్కోపులు కూడా అత్యంత కీలకమైనవి. ఇవి విశ్వాంతరాళాల్లోని విద్యుదయస్కాంత రేడియో తరంగాలను సంగ్రహించి వివిధరకాల శబ్దాలను డీకోడ్ చేసి విశ్లేషించడానికి ఉపయోగపడుతున్నాయి. ఐతే వినువీధిలో సుదూరంగా ఉన్న గెలాగ్జీలు, నక్షత్రాల నుంచి సంకేతాలు అందుకోవాలంటే అవి చాలా విశాలంగా ఉండి, భారీ యాంటీనాలను, అధిక మెగాహెట్జ్ సామర్థ్యాలను కలిగి ఉండాలి. ప్రపంచంలో అతిపెద్ద ‘500 మీటర్ ఆపర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్’ చైనాలో ఉంది. స్పేస్ లో కూడా 3 రకాల రేడియో టెలిస్కోపులు పనిచేస్తున్నాయి.

ఐతే, మన దగ్గర అందుబాటులో ఉన్న టెలిస్కోపుల సాయంతో నక్షత్రాలు, గ్రహాలను చిన్నచిన్న చుక్కల్లా మాత్రమే చూడగలుగుతున్నాం! అంతరిక్ష పరిశోధనలు ముందుకెళ్ళాలంటే మరింత శక్తివంతమైన టెలిస్కోపులు అవసరం! ఐతే, అవి సహజ భౌతికశాస్త్ర నిబంధనలకు, విశ్వనియమాలకు లోబడి పనిచేసేవై ఉండాలి. అలాంటివే కాస్మిక్ టెలిస్కోపులు! ఇవి ప్రస్తుతానికి ఊహాజనితమే ఐనా, భవిష్యత్తులో అవి మనుగడలోకి వస్తే మాత్రం ఖగోళవస్తువులను, విశేషాలను అత్యంత పెద్దవి చేసి చూపిస్తాయనడంలో సందేహం లేదు! ఉదాహరణకు గెలీలియో టెలిస్కోపును తీసుకుందాం. అది గురుగ్రహాన్ని 30 రెట్లు జూమ్ చేసి చూపించగలిగితే, కాస్మిక్ టెలిస్కోపు 100 బిలియన్ రెట్లు ఎక్కువ చేసి చూపించగలదు!

సూర్యుడు ఓ టెలీస్కోప్ లెన్స్ లా పనిచేయడం ద్వారా మనం చూసే వస్తువు ఆ ఫోకల్ పాయింట్ దగ్గర ఫోకస్ లోకి వస్తుంది. ఫలితంగా మన కంటితో చూడలేని ఒక నక్షత్రం, ఈ అద్దాల్లోకి మలుపడం ద్వారా 100 బిలియన్ రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది!

సూర్యని గురుత్వాకర్షణ శక్తికిలోనై వక్రీకరణకు గురైన సుదూర నక్షత్రాల కాంతిని కాస్మిక్ టెలిస్కోపులోకి మళ్లించడం ద్వారా 50 బిలియన్ మైళ్ళ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా, భారీ పరిమాణంలో చూడవచ్చు. కాస్మిక్ టెలిస్కోప్ డిటెక్టర్ అర్రే సుదూర ప్రపంచాల నుంచి పరావర్తనం చెందే కాంతిని సేకరించి, ఆ సంకేతాలను భూమ్మీదకు పంపిస్తుంది. అలా అది ఓ టెలిస్కోప్ ఐ పీస్ లా పనిచేస్తుంది. అంతరిక్షంలో సుదూర వస్తువుల నుంచి వెలువడే కాంతి సూర్యుడికి దగ్గరగా ప్రసరిస్తున్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తికి లోనవుతుంది! ఆ ప్రభావం వల్ల కాస్త వంచబడిన కాంతికిరణాలు ఒకచోటకు చేరుతాయి. ఆ ప్రాంతాన్ని ఫోకల్ పాయింట్ అంటారు. అలా సూర్యుడు ఓ టెలీస్కోప్ లెన్స్ లా పనిచేయడం ద్వారా మనం చూసే వస్తువు ఆ ఫోకల్ పాయింట్ దగ్గర ఫోకస్ లోకి వస్తుంది. ఫలితంగా మన కంటితో చూడలేని ఒక నక్షత్రం, ఈ అద్దాల్లోకి మలుపడం ద్వారా 100 బిలియన్ రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది! కాస్మిక్ టెలిస్కోపులు సుదూర ప్రపంచాల్లోని పర్వతాలు, సముద్రాలు, గ్లేసియర్ల చిత్రాలను కూడా స్పష్టంగా, వివరణాత్మకంగా చూపించే అవకాశాలుంటాయి! ఇతర గ్రహాల ఉపరితలం పూర్తి చిత్రాలను కాస్మిక్ టెలిస్కోపులు మనకు అందిస్తాయి. బహుశా ఈ టెలిస్కోపులు ఆ గ్రహాల్లోని నగరాలను కూడా అతి దగ్గరగా చూపిస్తాయేమో!

కాస్మిక్ టెలిస్కోపు ఒక్క ఆప్టికల్ టెలిస్కోప్ మాత్రమే కాదు! ఓ రేడియో టెలిస్కోపు కూడా! అది సుదూర ప్రపంచాల నుంచి వచ్చే కాంతిని మాత్రమే కాదు, రేడియో తరంగాలను కూడా 100 బిలియన్ రెట్లకు పెంచగలదు. ఇక్కడ ఉండే రేడియో స్పెక్ట్రంలో ఇంటర్ ఫియరెన్స్ అతి తక్కువగా ఉండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దీంతో సుదూరంగా ఉన్న భూమ్యేతర గ్రహాల్లోని పౌరులు చేసే అత్యంత సూక్ష్మమైన శబ్దాలను సైతం మనం స్పష్టంగా వినొచ్చు! అలా అందిన రేడియో సిగ్నల్స్ ను మనకున్న కంప్యూటింగ్ టెక్నాలజీతో డీకోడ్ చేసి అర్ధం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు.

సపోజ్, భూమి నుంచి 5 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గ్రహాంతరవాసులు (ఏలియన్స్) కాస్మిక్ టెలీస్కోపులను వినియోగిస్తున్నారు అనుకుందాం! వాటి ద్వారా మనల్ని గమనిస్తున్నారని కాసేపు భావిద్దాం! అప్పుడు…

కాస్మిక్ టెలిస్కోపులను అంతరిక్షంలో ఏ దిశవైపైనా గురిపెట్టవచ్చు. దాని డిటెక్టర్ అర్రే సూర్యుని చుట్టూ 360° తిరుగుతుంది. అవి ఖగోళంలో మన పరిమితులకవతల, కళ్ళు బైర్లుకమ్మేంత కాంతివంతంగా ఉండే పాలపుంత ఆవిర్భావ దృశ్యాలను కూడా మనకు కనబడేలా చేసి, ఆ రహస్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతాయి. కాస్మిక్ టెలీస్కోపులనుపయోగించి విశ్వంలో ఆవాసయోగ్యమైన ఇతర కొత్త భూమండలాలను సైతం వెతుక్కోవచ్చు! సహజంగా గ్రహాల వాతావరణంలోని వాయువుల మిశ్రమం అక్కడ జీవం ఉందో లేదో చెబుతుంటుంది. స్పెక్ట్రోస్కోపిక్ ప్రక్రియ ద్వారా వేరే గ్రహాల వాతావరణంలోని కాంతి రంగులను విశ్లేషించి ఆక్సిజన్, మీథేన్, కార్బన్ లాంటి జీవం ఉనికిని చాటే బయోసిగ్నేచర్స్ ను గుర్తించవచ్చు!

పర్ సపోజ్, భూమి నుంచి 5 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గ్రహాంతరవాసులు (ఏలియన్స్) కాస్మిక్ టెలీస్కోపులను వినియోగిస్తున్నారు అనుకుందాం! వాటి ద్వారా మనల్ని గమనిస్తున్నారని కాసేపు భావిద్దాం! అప్పుడు, బహుశా వాళ్ళు ఈజిప్టు గీజాలో జరుగుతున్న పిరమిడ్ల నిర్మాణాన్ని, లేదా ఫసిఫిక్ మహా సముద్రంలో హవాయ్ దీవులను కనుగొనే క్రమంలో పాలినేషియన్లు చేసిన సాహసోపేత నౌకాయానాలను చూస్తూ ఉండి ఉంటారు! అంటే టెలిస్కోపులు టైంమిషన్లలా పనిచేసి విశ్వాంతరాళాల్లో భూతకాలానికి మన వర్తమానకాలంలో తీసుకెళ్తాయన్నట్టు! అందుకే గతం గతః కాదు, గతం వర్తమాన: అని ప్రారంభంలో అనడం.

‘సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియాలో విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో ఎంసిజె చదివిన ఈ కరీంనగర్ బిడ్డ అనతికాలంలోనే టెలివిజన్ జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. క్రైం  నుంచి పోలిటికల్ రిపోర్టింగ్ వరకు తనది చురుకైన పాత్ర, ప్రవేశం. ప్రస్తుతం టి న్యూస్ బ్యూరోలో  పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి, సచివాలయ కార్యకలాపాలను ప్రజలకు అందజేస్తున్నారు. మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం సూరజ్’ కా సాత్వా ఘోడా  పేరిట  మనం చూస్తున్న లోకాన్నే సరికొత్తగా దర్శనం చేయిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article