కాలేజీ చదువులకు వెళ్ళిన విద్యార్థులను ఎన్ని విధాల చైతన్యం చేయాలో మీకు తెలుసు. అందులో మొదట్లోనే ఎదురయ్యే ర్యాగింగ్ వంటి వికృతపు పోకడల గురించి చెప్పనక్కర లేదు.
విషాదం ఏమిటంటే, కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడమూ మనం చూశాం. అందుకే ఎంతో బాధ్యతతో ర్యాగింగ్ వ్యతిరేక సభల్లో ప్రచారం కోసం డా.ఎలనాగ రాసిన చక్కటి సీస పద్యం ఇది. గానం శ్రీ కోట పురుషోత్తం.
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.