Editorial

Thursday, November 21, 2024
Peopleజయ జయహే పి.వి : డా. మధు బుడమగుంట

జయ జయహే పి.వి : డా. మధు బుడమగుంట

భరతమాత ముద్దు బిడ్డ శ్రీ పాములపర్తి నరసింహారావు .వారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా యాభై దేశాల్లో జరిపించాలని నేటి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడమే కాకుండా పివి స్మారక జ్ఞాన భూమిని నిర్మించి ఆయన పేరుమీద ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించడం నిజంగా ఆ మహానుభావునికి ఒక గొప్ప నివాళి.

డా. మధు బుడమగుంట
క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్తుల కాలంలో ‘చాణుక్యుడు వ్రాసిన అర్థశాస్త్రమే నేటి రాజకీయ పరిపాలనా విధానాలకు మూలం. ఎన్నో శతాబ్దాలుగా ఎంతో మంది రాజులు ఈ అర్థశాస్త్రాన్ని అవపోసనపట్టి తమ రాజ్యాలను ఎంతో జనరంజకంగా పరిపాలించారు. కాలానుగుణంగా ఆ పరిపాలనా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ మూలం మాత్రం అట్లాగే వుంది.

 

20 వ శతాబ్దంలో అటువంటి చాణుక్యుడే మన తెలుగునాట జన్మించి భారతదేశ ఆర్ధికరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొనివచ్చి, అంతర్జాతీయంగా భారతదేశ ఎగుమతుల దిగుమతుల వాణిజ్యవిధానాలలో పెనుమార్పులకు ఆద్యుడయ్యాడు. అతనే తెలుగువాడైన మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్రపంచం గుర్తించాకా గానీ భారతీయులు గుర్తించని జాతి వజ్రం! భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు, ప్రపంచ భాషాకోవిదుడిగా పొరుగుదేశాల మన్ననలు పొందిన మన పాములపర్తి వెంకట నరసింహారావు మనందరం గౌరవంగా పిలిచే పి వి నరసింహారావు.

న్యాయవాద వృత్తిని కాకుండా పాత్రికేయుని రూపమెత్తి, కాకతీయ పత్రిక నడిపి అందులోనే జయ అనే పేరుతో ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషిచేశాడు. అప్పుడే వివిధభాషలను నేర్చుకొని బహుభాషావేత్తగా పేరు గడించాడు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా, లక్నేపల్లి గ్రామంలో జూన్ 28, 1921 న జన్మించిన పి వి, ప్రాధమిక విద్య వరంగల్ జిల్లాలోనే పూర్తిచేశారు. పిమ్మట కరీంనగర్ జిల్లా వాసులైన పాములపర్తి రంగారావు దంపతులు ఆయనను దత్తత తీసుకోవడంతో ఆయన పాములపర్తి నరసింహారావు అయ్యారు. తరువాతి కాలంలో నిజాం వ్యతిరేక ఉద్యమబాట పట్టి, కాంగ్రెస్ పార్టీ సభ్యుడై హైదరాబాద్ విముక్తి కొరకు పోరాడాడు. తరువాతి న్యాయవాద పట్టాను పుచ్చుకొని, న్యాయవాద వృత్తిని కాకుండా పాత్రికేయుని రూపమెత్తి, కాకతీయ పత్రిక నడిపి అందులోనే జయ అనే పేరుతో ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషిచేశాడు. అప్పుడే వివిధభాషలను నేర్చుకొని బహుభాషావేత్తగా పేరు గడించాడు.

పి వి రాజకీయ జీవితం 1957 లో ఆయన శాసన సభ్యుడిగా ఎన్నికై చట్టసభలకు వెళ్ళడంతో మొదలైంది. పిమ్మట ఆయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు.  ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టి, భూస్వామ్యవర్గాలకు వ్యతిరేకి అయ్యాడు. అంతేకాక ఆ సమయంలోనే వేగవంతమైన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, పి వి నరసింహారావు గారికి ఒక చేదు అనుభవంగా మిగిలింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పాలంటే పి వి ప్రధాని కాక మునుపు, తరువాత అని ప్రపంచ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తారు.

ఆ పిమ్మట ఆయన కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి, అనేక పదవులను సమర్ధవంతంగా నిర్వహించి అందరిచేత మన్ననలు పొందాడు. విదేశీవ్యవహారాల శాఖామాత్యునిగా ఆయన చేసిన కృషి, ప్రపంచంలోనే మన భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. పిమ్మట అనుకోని పరిస్థితులలో  ప్రధానమంత్రి పదవి అతనిని వరించింది. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించి విదేశీ పెట్టుబడులకు మంచి ఊతమిచ్చాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పాలంటే పి వి ప్రధాని కాక మునుపు, తరువాత అని ప్రపంచ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తారు. అది ఆయన పడిన కష్టానికి వచ్చిన గుర్తింపు. ఆయన చేసిన సంస్కరణల వల్లే 2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం భారతీయ బ్యాంకులకు అంటకుండా కాపాడుకోగలిగాం. దేశీయ బ్యాంకులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి భారతీయ రిజర్వ్ బ్యాంకు నియంతృత్వంలోకి తెచ్చిన ఘనత మన మేటి నగధీరుడిదే. ప్రముఖ ఆర్థికవేత్త, మన మాజీ ప్రధాని శ్రీ మన్ మోహన్ సింగ్ గారు, నరసింహారావు గారికి కర్మ యోగి అంటూ ప్రస్తావిస్తూ ఆయన గురించి ఒక పెద్ద వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఎన్నో మంచి విషయాలు ఆ మహానుభావుని గురించి ప్రస్తావించడం జరిగింది.

స్వయంగా బహుభాషావేత్త అయిన నరసింహారావు గారు ఏ విషయంలోనూ తడబడే మనస్తత్వం కాదు. ఆయన మనసులోని మాటను తను చెప్తేనే గ్రహించగలం.

స్వయంగా బహుభాషావేత్త అయిన నరసింహారావు గారు ఏ విషయంలోనూ తడబడే మనస్తత్వం కాదు. ఆయన మనసులోని మాటను తను చెప్తేనే గ్రహించగలం. చట్ట సభలలో ఆయన వాగ్ధాటికి నిలిచి ఆయనను ప్రశ్నలతో భయపెట్టేవారు ఎవరూ దాదాపు లేనట్టే. ప్రతివిషయంలోనూ ఎంతో పరిజ్ఞానంతో వుండేవారు.

పివి నరసింహారావుగారు 17 భాషలలో పండితుడు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా అక్కడి భాషలో మాట్లాడి అనువాదకుల అవసరం లేకుండా చేసేవారు. పాత్రికేయ వృత్తిని కూడా చేసిన ఈ బహుభాషా పండితుని లో ఒక కవి కూడా దాగివున్నాడు. కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారి “వేయి పడగలు” ని హిందీ లోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించారు. అంతేకాక ఇన్‌సైడర్: ఆయన రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు చాలా చాలా పోలిక వుంది. అంతేకాక ఆయన వ్రాసిన కథానిక `రామవ్వ’ , 1949 నాటి స్థితిగతులను తెలుపుతూ ఎంతో ప్రఖ్యాతి గాంచింది. `రామవ్వ’ నాటి చరిత్రకి, నేటి సాక్ష్యం! మానవత్వం ముందు అల్లర్లు, అఘాయిత్యాలు దిగదుడుపే అన్న అక్షర సత్యాన్ని ఈ కథానికలో చూపించారు మన పి.వి.నరసింహా రావుగారు.

పి వి నరసింహారావు భారతదేశ ఆర్థిక చరిత్రను మార్చారు. కానీ ఆయన పొందవలసిన గౌరవం ఎంతో వుంది. ఈ భారతదేశం ఆయనకు ఎంతో రుణపడివుంది. ఆయన అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ బిరుదునిచ్చి సత్కరించవలసిన సమయం ఇప్పుడైనా వస్తే ఎంతో సంతోషిస్తాను అని ప్రముఖ పాత్రికేయుడు, బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మరియు మన్మోహన్ సింగ్ గారికి ఆర్ధిక సలహాదారుగా పనిచేసిన శ్రీ సంజయబారు తన పుస్తకం ‘1991’ వ్రాసిన తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూలో వ్యక్తీకరించారు.

వారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా యాభై దేశాల్లో జరిపించాలని నేటి తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించడమే కాకుండా పివి స్మారక జ్ఞాన భూమిని నిర్మించి ఆయన పేరుమీద ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించడం నిజంగా ఆ మహానుభావునికి ఒక గొప్ప నివాళి.

ఆ మహానుభావుని గొప్పదనం మనందరం కూడా తెలుసుకోవాలి. ఆయన కీర్తి కొరకు పాకులాడలేదు. అందరూ తనను గుర్తించాలని తపన పడలేదు. తను చేయాలనుకున్న సంస్కరణలు అన్నీ పూర్తిచేసి, సొంత పార్టీలోనే అవమానాలు, చీత్కారాలు ఎదురైననూ వెరువక తన కర్తవ్యాన్ని పూర్తిచేసి డిసెంబర్ 23, 2004 న తనువు చాలించాడు. ఆయన భౌతికంగా లేకున్నను ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల ఫలాలు నేడు మనం అనుభవిస్తున్నాము. ఆ ఒక్క కారణం చాలు ఆయనను మహానుభావుడు అని మనం గుర్తెరిగి ఆయనను స్మరించుకొందాం.

చివరగా, హైదరాబాద్ లోని ఈ ఫ్లైఓవర్ మరియు ఎక్స్ ప్రెస్ వే కు ఆయన పేరు పెట్టడం ఎంతో ముదావహం. అంతేకాదు ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా 50 దేశాల్లో జరిపించాలని నేటి తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించడమే కాకుండా పివి స్మారక జ్ఞాన భూమిని నిర్మించి ఆయన పేరుమీద ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించడం నిజంగా ఆ మహానుభావునికి ఒక గొప్ప నివాళి.

మన దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’కు ఆయన అన్ని విధాల అర్హుడు. ఆ పురస్కారం ఆయనకు లభించాలని మనందరం కోరుకుందాం.

ఈ చక్కటి వ్యాసం సిరిమల్లె ( తెలుగు భాషా సౌరభం ) సౌజన్యంతో పున:ప్రచురిస్తున్నం. వ్యాసకర్తకు, సిరిమల్లెకు ధన్యవాదాలు. http://sirimalle.com/

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article